దిస్పూర్: భారత్ నక్సల్స్ నుంచి విముక్తి పొందగలిగిందని.. అది చొరబాటుదారుల నుంచి కూడా విముక్తి పొందుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. రానున్న ఐదేండ్ల కాలంలో చొరబాటుదారులను కేవలం ఓటర్ లిస్టులో నుంచే కాదు, దేశంలోనే లేకుండా చేస్తామని శనివారం ఆయన ప్రకటించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న అస్సాం రాష్ట్ర పర్యటనలో భాగంగా పోలీస్ 10వ బెటాలియన్ కొత్త ప్రాంగణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
చొరబాటుదారుల ఆక్రమణల నుంచి విముక్తి పొందిన భూమిలో దీనిని నిర్మిస్తామని చెప్పారు. చొరబాటుదారులను తొలగించాల్సిందేనని, అయితే వారు తమ ఓటు బ్యాంక్ అయినందున కాంగ్రెస్ వారిని తొలగించదని ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ గతంలో పేర్కొన్న విషయాన్ని అమిత్ షా ప్రస్తావించారు. ఆక్రమించుకున్న భూముల నుంచి చొరబాటుదారులను ఖాళీ చేయిస్తే సరిపోదని, వారిని దేశం నుంచే వెళ్లగొట్టాలని ఆయన అన్నారు.