న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: కృత్రిమ మేధ(ఏఐ) ప్రభావంపై రూపొందిన ‘ఢిల్లీ డిక్లరేషన్’ను 85కి పైగా దేశాలు ఆమోదించాయి. సామాజిక శ్రేయస్సు, మనిషి మూలధనంగా ఏఐ వ్యవస్థల వాడకం ఉండాలని ‘ఢిల్లీ డిక్లరేషన్’ పిలుపునిచ్చింది. ఈయూ, యూఎస్, యూకే సహా 85కి పైగా దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఢిల్లీ తీర్మాన ప్రకటనపై సంతకాలు చేసినట్టు విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
‘కృత్రిమ మేధ (ఏఐ) ఆగమనం అంతర్జాతీయంగా పరస్పర సహకారం, ఆయా దేశాల్లోని భాగస్వాములు కలిసి పని చేయడాన్ని గుర్తు చేస్తున్నది. మనుషులే దానికి ప్రధాన పెట్టుబడి. ఏఐ విశ్వసనీయత, ఏఐ వ్యవస్థల శక్తి సామర్థ్యం, ఏఐ సైన్స్ వాడకం, ఏఐ వనరుల ప్రజాస్వామీకరణ మొదలైన వాటికి ఈ సదస్సు పిలుపునిస్తుంది’ అని డిక్లరేషన్ పేర్కొన్నది.