ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోదఫా పాలన నాలుగేండ్లు పూర్తి చేసుకున్నది. తెలంగాణ ఎలా అభివృద్ధి సాధించింది? లక్ష్యాలను అందుకున్నదా? అంచనాలను మించి అడుగులు వేసిందా? అని సమీక్షించుకోవటానికి ఇది ఒక సందర్భం. మొదటి పర్యాయంతో రెండవ దఫా పాలనను పోల్చినప్పుడు, అనేక సారూప్యాలతో పాటు భిన్నత్వమూ కనబడుతుంది. అభివృద్ధి, సంక్షేమ విధానాల కోణంలో చూస్తే రెండవ పర్యాయం పాలన మొదటి దానికి కొనసాగింపుగానే కనిపిస్తుంది. మొదటి దశ నుంచే తెలంగాణను దేశానికి రోల్మాడల్గా కేసీఆర్ చూపించగలిగారు. గత ఎన్నికల నుంచే జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి సారించారు. కానీ మొదటి దశ పాలన కాలంలో పక్క రాష్ట్రం నుంచి పాత ఆధిపత్య వాసనలు వదులుకోలేని వలస శక్తులు తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలకు దిగాయి. కేసీఆర్ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టారు. రెండవ దశలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వ కుతంత్రాల నుంచి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతూనే, పోరాటాన్ని ఢిల్లీ బరిలోకి తీసుకుపోవడం కేసీఆర్ గొప్పదనం.
ఉద్యమకాలంలో రాజ్యాంగ బద్ధమైన, శాంతియుత పోరాటానికి కేసీఆర్ కట్టుబడి ఉన్నారు. ఇదే రీతిలో ముఖ్యమంత్రిగా తొలిదశ పాలనలో- బీజేపీతో ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ- కేంద్రంతో సత్సంబంధాల కోసం ఓర్పుతో ప్రయత్నించారు. కేంద్రం రాష్ర్టాలు సమన్వయంతో సాగాలనే సమాఖ్య స్ఫూర్తిని అనుసరించారు. కేంద్ర పాలకులు కూడా రాష్ర్టాల పట్ల ఎంతో హుందాగా, ఉదాత్తంగా వ్యవహరించాల్సింది. రాజకీయ విభేదాలకు అతీతంగా దేశ శ్రేయస్సే ప్రధానంగా భావించాలి. కానీ కేంద్రం దిగజారిపోయి రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయడమే పనిగా పెట్టుకోవడం బాధాకరం. కొత్తగా అవతరించిన తెలంగాణకు మద్దతుగా నిలువడానికి బదులు, ఏపీ విభజన తీరును తప్పుపడుతూ తెలంగాణ ప్రజల మనసును తీవ్రంగా గాయపరిచారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్కు రెండవ పర్యాయం పాలనలో ఎదురు దాడి చేయక తప్పలేదు.
కొత్తగా అవతరించిన రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎదురు సవాలు చేస్తారని ప్రధాని మోదీ ఊహించి ఉండరు. ఏవో కొన్ని ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతారే తప్ప ఏకంగా జాతీయ పక్షాన్ని స్థాపించి బరిగీసి నిలబడతారని కలలో కూడా అనుకొని ఉండరు. కానీ అసహాయ శూరుడైన కేసీఆర్ అప్రతిహత పోరాటం సాగిస్తారనడానికి తెలంగాణ ఉద్యమ విజయమే దృష్టాంతం. మలి పర్యాయం నాలుగేండ్ల పాలన పూర్తిచేసుకున్న కేసీఆర్ నేడు ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. ఇది అధికారం కోసం చేసే రాజకీయ పోరాటం కాదు. కేసీఆర్ నాడు తెలంగాణ శ్రేయస్సును ఆశించారు. నేడు దేశ సంక్షేమాన్ని కాంక్షిస్తున్నారు. ఈ పదవ సంవత్సర పాలనలో తెలంగాణ ప్రగతిని పతాక స్థాయికి తీసుకుపోవడంతోపాటు, ఢిల్లీ వైపుగా జైత్రయాత్ర సాగిస్తున్నారు. విజయోస్తు!