రాజకీయాల్లో మనం ఒక మనిషికి ఒకే ఓటు, ప్రతీ ఓటుకు ఒకే విలువ అనే సిద్ధాంతాన్ని పాటించబోతున్నాం. కానీ, సామాజిక, ఆర్థిక రంగాల్లో ఈ సమానత్వాన్ని పాటించబోవటం లేదు. ఈ వైరుధ్యాలను ఎంత కాలం కొనసాగిస్తాం? ఈ వైరుధ్యాన్ని వీలైనంత త్వరగా నిర్మూలించకపోతే అసమానత్వం కారణంగా అణిచివేతకు గురవుతున్నవాళ్లు రాజకీయ ప్రజాస్వామ్య సౌధాన్ని నేలకూల్చుతారు’ అంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉనికిలోకి రాక ముందే హెచ్చరించారు. అది నేడు మన ముందు నిజమై నిలుస్తున్నది. 75 ఏండ్లుగా ఈ దేశాన్ని పాలించిన పాలకులు సామాజిక, ఆర్థిక రంగాల్లో వేళ్లూనుకున్న అంతరాలను, వివక్షను తొలగించటానికి ఏనాడూ చిత్తశుద్ధితో ప్రయత్నించలేదు. దాని ఫలితమే, రాజకీయ ప్రజాస్వామ్యానికి ప్రస్తుతం ఎదురవుతున్న ముప్పు. అయితే, అది అణచివేతకు గురవుతున్న ప్రజానీకం కారణంగా కాకుండా, మత రాజకీయమనే మత్తుమందును నమ్ముకున్న వారి కారణంగా జరుగుతుండటం గమనార్హం.
కేంద్రంలో మోదీ-బీజేపీ పాలన మొదలైన తర్వాత రాజ్యాంగం ఉనికికే భంగం వాటిల్లే పరిస్థితులు తలెత్తాయి. రాజకీయ సమానత్వం కూడా కనుమరుగయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. నేడు మన దేశం ఒక కూడలిలో నిల్చొని ఉంది. బీజేపీ చెబుతున్న మతరాజ్యం వైపా? జాతీయోద్యమ నిర్మాతలు ఆశించిన, అంబేద్కర్ కలలుగన్న సమానత్వ భారత్ వైపా? ఎటు వెళ్లాలి. ఇవి రెండు విభిన్న తాత్విక దృక్పథాలు. ఒకటి మనల్ని వెనక్కి, వందల ఏండ్ల వెనక్కి తీసుకెళ్తే.. మరొకటి భవిష్యత్తులోకి, ఆధునికతలోకి తీసుకెళ్తుంది. సరిగ్గా ఈ సందర్భమే.. అంబేద్కర్‌ను గతంలో ఎన్నడూ లేనంత అధికంగా చదవాల్సిన, అర్థం చేసుకోవాల్సిన, ఆచరించాల్సిన ఆవసరాన్ని మన ముందుకు తీసుకొచ్చింది. ఎందుకంటే, ఆధునిక భారత నిర్మాణానికి సంబంధించి అంబేద్కర్‌కున్న దృష్టి సుదూరమైనది, విశాలమైనది. ఏడు దశాబ్దాల కిందటే మహిళలకు విడాకుల హక్కు, ఆస్తి హక్కు ఉండాలని పిలుపునిస్తూ ఆ మేరకు హిందూకోడ్ బిల్లు తీసుకొచ్చిన మహా మేధావి ఆయన. నాటి నాయకులు ఆయనలోని విప్లవతత్వాన్ని అందుకోలేక, ఆ బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి నిరసన వ్యక్తం చేసిన త్యాగశీలి బాబాసాహెబ్.
ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అంబేద్కర్ స్థాయిని అందుకునే మేధావి ఆధునిక భారతంలో మరొకరు లేరు. ఆయన ఆలోచనలను ఆచరిస్తే చాలు.. భారత్ అగ్రరాజ్యంగా అవతరిస్తుంది. ఆ దిశగా తెలంగాణ చేస్తున్న కృషి గొప్పది. దేశంలోని ఏ రాష్ట్రమూ ఈ విషయంలో తెలంగాణకు సాటి రాదు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, బీసీ జనగణన కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించింది. దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు విప్లవాత్మకమైనది. వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నది ఈ పథకం. తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టటం చరిత్రాత్మక నిర్ణయం. ఇప్పుడు 125 అడుగుల ఎత్తున బాబాసాహెబ్‌ను ప్రతిష్ఠించుకోవటం ద్వారా ఆయన స్ఫూర్తిని ప్రపంచమంతటా చాటిచెప్పే వేదికగా మన హైదరాబాద్ నిలువబోతున్నది. అంబేద్కర్ వెలుగులో తెలంగాణ యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.