అప్పుచేసి పప్పు కూడు తినొద్దన్నారు పెద్దలు. కానీ, అప్పుచేసి ఆస్తులు పెంచుకుంటే తప్పు కాదనేది ప్రస్తుతం చెలామణిలో ఉన్న సూత్రం. డబ్బు ముందుగా ఆదా చేసి, తాపీగా లెక్క పెట్టుకొని, ఆపై ఖర్చుచేసే పరిస్థితి ఎక్కడా లేదిప్పుడు. ఈ రోజుల్లో ఇల్లు, కారు, చివరికి రోజువారీ సరుకులు కొనాలన్నా అప్పే మార్గం. క్లుప్తంగా చెప్పాలంటే ప్రస్తుతం నడుస్తున్నది ‘రుణ ఆధారిత ధన వ్యవస్థ’. ఇక ప్రభుత్వాలైతే చెప్పేదేముంది? అప్పు లేకుండా అర గంట కూడా గడవదు. అమెరికాకూ జీడీపీ కంటే ఎక్కువ అప్పుంది. అమెరికా అప్పు రోజుకు వెయ్యి కోట్ల డాలర్ల చొప్పున పెరుగుతున్నదట. దేశాలు అప్పులు తీసుకోకపోతే ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు వంటి సంస్థలు దివాలా తీస్తాయి! అప్పు తప్పు అనేసి తప్పుకోకుండా చేసిన అప్పు దేనికి ఖర్చు చేశారనేది చెప్పుకునే స్థితిలో ఉండటం ముఖ్యం.
అధికారంలోకి రావడానికి ముందు కాంగ్రెస్ తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని గగ్గోలు పెట్టింది. అందుకు నెపమంతా కేసీఆర్పైనే వేసింది. అప్పు తప్పన్నట్టుగా ఊదరగొట్టింది. కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేసింది పరిమితికి లోబడే. పైగా ఆ డబ్బు ఏదో పప్పుబెల్లాలకు ఖర్చు చేయలేదు. తరతరాలకు పనికివచ్చే లక్షల కోట్ల ఆస్తులు తయారు చేసి ప్రజలకు భరోసా కల్పించింది. కాళేశ్వరం, పాలమూరు, మిషన్ భగీరథ వంటి ప్రజోపయోగ పథకాలు తీసుకువచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిందని వీరంగం వేసిన కాంగ్రెస్ పాలకులు సుద్దపూసల్లా ఉండిపోయారా? అంటే అదేమీ లేదు. గత 8 నెలల్లో రూ.50 వేల కోట్ల అప్పు చేశారు. ‘కేసీఆర్ చేసిన అప్పు మేం కడుతున్నా’మని తెగ ఇదైపోతున్న కాంగ్రెస్ నేతలు తాము తెస్తున్న అప్పును ఎవరు తీరుస్తారో చెప్పగలరా? ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అప్పును కేసీఆర్ ప్రభుత్వం తీర్చిందన్న వాస్తవాన్ని కాదనగలరా? ఆ సంగతి అలా ఉంచితే ప్రస్తుత పాలకులు చేసిన అర లక్ష కోట్ల అప్పు దేనికోసమో చెప్పే నాథుడే కరువయ్యాడు. ప్రాజెక్టులు కట్టారా? ప్రజా సంక్షేమానికి ఖర్చుపెట్టారా? అంటే సమాధానం లేదు. రావాల్సిన రైతుబంధు రావడం లేదు. పింఛన్లు పడటం లేదు. మరి అంత సొమ్ము ఏమైనట్టు? 60 ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాలు చేసిన అప్పు సుమారు 72 వేల కోట్లు. ఇటున్న ఇటుకను అటు పెట్టని కాంగ్రెస్ సర్కార్ ఏడాది లోపే రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులున్నాయనే నానుడిని నిజం చేసి చూపింది.
అప్పులతో రాష్ట్రం మరో శ్రీలంకలా మారుతుందని గాయి గాయి చేసిన సీఎం రేవంత్ తనదాకా వస్తేగానీ తత్వం బోధపడదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అప్పుల సంసారాన్ని ఒడ్డున పడేసేందుకు తంటాలు పడుతున్నానని ఆయన చెప్పినవన్నీ కల్లబొల్లి కబుర్లే! బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర సంపద బాగా పెరిగిందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. తలసరి ఆదాయం, జీఎస్డీపీ.. ఇలా అన్నింటా తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. కానీ నడమంత్రపు పాలన వచ్చి అంతా తారుమారైంది. ఇదివరకటి ప్రభుత్వంపై అక్కసుతో ప్రాజెక్టులను పడావుపెట్టి వ్యవసాయాన్ని మూలకు నెట్టారు. సంపద పెంచడం, పంచడం అనే కేసీఆర్ పరిపాలనా సూత్రం పట్టు దొరకక కాంగ్రెస్ ప్రభుత్వం చతికిలపడుతున్నది. చేతకాని తనాన్ని ఆకతాయి మాటల కింద మరుగుపర్చాలని చూస్తే నిజానిజాలు ప్రజలకు తెలియకుండా ఉంటాయా? నక్కలు బొక్కలు వెతుకును అన్నట్టుగా గత ప్రభుత్వపు తప్పులెన్నుతూ కూర్చుంటే రాష్ట్రం ముందుకువెళ్లదు. అప్పులలో చేతివాటం చూపడం కన్నా అభివృద్ధిని పరుగులు పెట్టించే మార్గాల కోసం అన్వేషిస్తే ప్రభుత్వానికీ, ఏతావాతా ప్రజలకూ మంచిది!