గురువారం 04 మార్చి 2021
Editorial - Jan 17, 2021 , 00:28:47

మా నాయిన కవ

మా నాయిన కవ

మా నాయిన కవి కపోతే రాయడం రాదంతే..!

రాయవచ్చిన సదువరులంత

మా నాయన దగ్గర సదువుకోవాల్సిందే.

నేను రాసేది కవిత్వం కాదు

మా నాయన ఒలికిపారించిన జీవితమే.

మా నాయన

పదమందుకున్న పద్యమందుకున్న

పల్లెజీరతనం కొట్టుకొచ్చినట్లుంటది.

మా నాయిన

మాటమాటకు సామెతల సాన్పుజల్లుతాడు

పదిమంది కూసున్నకాడ

మాటల పందిరై అందరినీ కలుపుకపోతాడు.

మా నాయిన గెడం కట్టినా గెట్టు సెక్కినా

మునంకోసినా మోపులెత్తినా

నేలమ్మ యదపై పచ్చటి పందిరైతాడు.

మా నాయన చరిత్రను 

చిత్రాలుగా పగ్గమల్లుతాడు

రామాయణ భారత వీరగాథలను

సిక్కమల్లినంత అందంగా చెప్పుకొస్తాడు.

తాడుపేనినట్లు తరాల వారధికి

వరదగూడుల నిలబడుతాడు

గుండెలెంత బాధలున్న

గుప్పిటదాసుకొని

ఉత్తజేబుతో సంతకు పయనమౌతాడు.

మేము బువ్వతింటున్న రాత్రి

ఎనకట ఎప్పుడో జరిగిపోయిన

సంగతులను సుతారంగా 

మా చెవులల్లో రాసిబోస్తాడు.

ఏ ఊరికైనా పయనమై

పక్కల ఎవరు కనిపించిన

ఎవరివంటూ బంధాలకు 

దుసిరేతీగతో ముడేస్తాడు.

మా నాయన నిజంగా కవే

రాయడం రాకున్నా

నేను రాసుకున్న పుస్తకాలపై

తనది చెదిరిపోని 

సంతకమొకటి 

ఖచ్చితంగా ఉంటది.

అవనిశ్రీ

9985419424


VIDEOS

logo