శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Aug 20, 2020 , 23:26:22

ప్రైవేటు మంత్రం మోదీ తంత్రం

ప్రైవేటు మంత్రం మోదీ తంత్రం

పెట్టుబడుల ఉపసంహరణ ఒక ముద్దు పేరు. దీన్ని వాడుకొని ఎన్నో పేరు మోసిన కేంద్ర ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేయడం జరుగుతున్నది. ఒక కుక్కను చంపాలంటే దాన్ని ముందుగా పిచ్చిదని ముద్ర వెయ్యాలె. అదే పనిని కేంద్ర ప్రభుత్వం చాపకింద నీరులా చేస్తున్నది. సదరు కంపెనీ మీద బలవంతపు నిర్ణయాలు ముందుగా రుద్దుతుంది. ఆ తర్వాత అది నష్టాల్లో నడుస్తున్నదని ప్రచారం చేసుడు, ఆ తర్వాత మూసివేసుడు జరుగుతున్నది. ఇదే తంతుకేంద్ర ప్రభుత్వాల వైఖరిగా మారింది. ఇట్లాంటి వైఖరితో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. 

దేశాన్ని ఏదో ఉద్ధరిస్తనని గద్దెనెక్కిన మోదీ గత ప్రధానులకన్న నాలుగాకులు ఇంకా ఎక్కువే సదివిండు. దీనికి ఇప్పుడు నడుస్తున్న ‘బీఎస్‌ఎన్‌ఎల్‌'  ఉదంతం పెద్ద ఉదాహరణ. బీఎస్‌ఎన్‌ఎల్‌ పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించినట్టే ప్రకటించి ఆచరణలో మాత్రం ఆమడ దూరంలో ఉన్నది మోదీ ప్రభుత్వం. ప్యాకేజీ అమలు అసలే కాలేదా అంటే.. అదీ కాదు. అయింది కానీ ఎట్లా అంటే.. నిర్వీర్యం చెయ్యడంలో భాగంగానే. 88వేలకు పైగా ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులలో 79వేల మంది ఉద్యోగులను ‘వీఆర్‌ఎస్‌' చేయించింది కేంద్ర ప్రభుత్వం.  ఈరోజు బీఎస్‌ఎన్‌ఎల్‌కు సర్వీస్‌ ఇవ్వడానికి ఉద్యోగులను లేకుండా చేసి ఉన్న పిడికెడు వినియోగదారులను దూరం చేసే ప్యాకేజీ అమలు మాత్రం జరిగింది. అదీ టెక్నాలజీ పెచుకోవడం కోసం. ఎమన్నా ప్యాకేజీ ఇచ్చిందా అంటే అది ఇప్పటివరకు అతీగతీ లేదు. 4జీ ఎక్విప్‌మెంట్‌ సేకరణ కోసం పిలిచిన టెండర్లను కూడా రద్దు చేయించి దేశీయ తయారీదారుల నుంచే ఆ 4జీ ఎక్విప్‌మెంట్‌ కొనాలనే షరతు విధించడంలోని ఔచిత్యం కేంద్ర ప్రభుత్వ పెద్దలకే తెల్వాలె. ప్రైవేట్‌ టెలికామ్‌ కంపెనీలకు వర్తించని మేక్‌ ఇన్‌ ఇండియా విధానం ఒక బీఎస్‌ఎన్‌ఎల్‌ లాంటి ప్రభుత్వ సంస్థలకు మాత్రమే వర్తిస్తదా! ప్రైవేట్‌ టెలికామ్‌ సంస్థలన్నీ 5జీ టెక్నాలజీకి మారడానికి చూస్తున్న ఈ తరుణంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇంకా 4జీ టెక్నాలజీ దగ్గరకు కూడా రాకుండా ఆగిపోవడంలో ఉన్న మతలబు పెరుమాండ్లకే తెల్వాలె.

పెట్టుబడిదారీ దేశాల ఉచ్చులో పడిన కేంద్ర ప్రభుత్వం, అత్యంత ఉన్నతమైన సేవలు అందించిన దిగ్గజ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నది. దీనికి మరొక్క ఉదాహరణ కోల్‌ ఇండియా కంపెనీ కాబోతున్నది. దీనికి గనుల ప్రయివేటీకరణతో బీజం వేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. బొగ్గు గనుల ప్రయివేటీకరణ అనేది ఒక్కసారి మొదలైతే అది కోల్‌ ఇండియా సంస్థ మూతకు దారితీస్తుందనడంలో అనుమానమే లేదు. దీన్ని కాపాడుకోవాల్సింది ఆ సంస్థ ఉద్యోగులు, వారి కుటుంబాలే. ఈ ప్రయివేటీకరణ ముచ్చట ఒక్క కోల్‌ ఇండియాతోనే ఆగేటట్టు కనిపించటం లేదు. మెల్లమెల్లగా పెట్రోలియం, గ్యాస్‌ సంస్థలకు కూడా విస్తరిస్తదని చూస్తుంటే తెలుస్తూనే ఉన్నది. ఎందుకంటే దాని వెనుకున్న కార్పొరేట్‌ శక్తుల మాయ అటువంటిది. వారి మాయలో ఇదివరకే పడ్డ కేంద్ర ప్రభుత్వం వీటి విషయంలో పడదు అన్న గ్యారెంటీ  ఏమీ లేదు. ఇదే బాటలో ఇండియన్‌ రైల్వేస్‌ కూడా చేరబోతున్నది. ఇందుకోసం రోడ్‌ మ్యాప్‌ తయారు చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైందని ఇటీవలి చర్యల ద్వారా  తెలుస్తున్నది. 

కేంద్ర ప్రభుత్వం మూసివేయాలని చూస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల జాబితా పెద్దగానే ఉన్నది. ఇండియన్‌ ఆయిల్‌ - సీఆర్‌డీఏ బయోఫ్యుయల్స్‌, హిందుస్థాన్‌ ఫోటో ఫిలిమ్స్‌, ఇండియన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాసుటికల్స్‌, హిందుస్థాన్‌ కేబుల్స్‌, హెచ్‌ఎంటీ, ఎస్‌టీసీఎల్‌ ( ది స్టేట్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, లిమిటెడ్‌), ఏయిర్‌ ఇండియా, కాంకర్‌, మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. 

ఇగ నెమ్మదిగా ప్రైవేట్‌ పరం చెయ్యబోతున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలను గమనిస్తే అందులో ముందువరసలో రైల్వేస్‌ ఉంది. ఆతర్వాత ఎల్‌ఐసీ, ఎంఆర్‌పీఎల్‌(ఓఎన్‌జీసీకి అనుబంధ సంస్థ), ఎన్‌టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎస్‌జేవీఎన్‌ ఇలా జాబితా పొడుగ్గానే ఉన్నది. 

పెట్టుబడుల ఉపసంహరణ అనేది గడిచిన రెండు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రధాన పన్నేతర ఆదాయంగా ఉన్నది. 2017-18లో ఒక లక్ష కోట్లు, 2018-19లో 85వేల కోట్లు, 2019-20లో 53900కోట్లు మేర కేంద్రం ఆదాయం పొందుతున్నది. ఇదే 2020-21లో 2.1 లక్షల కోట్లుగా లక్ష్యం పెట్టుకున్నది కేంద్ర ప్రభుత్వం. ‘ఆదుకోవాల్సిన వాడే ఆగం చేసిండు’ అన్నట్టు ఉంది కేంద్ర ప్రభుత్వ తీరు. 

మోదీ ప్రభుత్వం తను అనుకున్న ప్రణాళికను నెమ్మది నెమ్మదిగా అమలు చేస్తూ భారత ఆర్థిక వ్యవస్థను ప్రయివేటు కార్పొరేట్ల చేతిలో పెట్టాలని చూస్తున్నదని జరుగుతున్న విషయాలను గమనిస్తే అర్థం అవుతున్నది. బీజేపీ ఒక ప్రణాళిక ప్రకారం ఈ దేశ యువతను సరిహద్దు,  మతపర సమస్యల చుట్టూ తిప్పుతూ తెరవెనుక తన పని తాను గుట్టుసప్పుడు కాకుండా చేసుకపోతున్నది. 

ఇప్పటికైనా మన దేశ మేధావి వర్గం మేల్కొని దేశ యువతను మేల్కొల్పకపోతే రాబోయే తరాలు ఎన్నో రంగాలలో ఎంతో కోల్పోయే ప్రమాదం ఉన్నది. రాజకీయ అవసరాలు ఉన్నప్పుడు ప్రజల దృష్టిని ఇతర ఉద్వేగపరమైన అంశాలపైకి మోదీ ప్రభుత్వం మళ్ళిస్తున్నది. ఈ విధంగా ఎంతో నష్టాన్ని మోదీ ప్రభుత్వం దేశప్రజల నెత్తిమీద మోపుతున్నది . మాంద్యంలో చిక్కుకున్న ఆర్థిక వ్యవస్థను కాపాడాల్సిన సమయంలో కాలయాపన చేస్తూ, మరొకవైపు ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ పాలన తీరును అందరూ నిరోధించాలి.

(వ్యాసకర్త:  వై.సతీష్‌రెడ్డి , టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌)


logo