‘విద్యతోనే జీవితాల్లో వెలుగులు నింపొచ్చు. నాగరికతకు విద్యే కొలమానం. అది విశ్వసించే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నది’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. చదువును పెట్టుబడిగా పెడితే ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని మహానేత బాబాసాహెబ్ అంబేద్కర్ నిరూపించారని గుర్తుచేశారు. భువనగిరి మండలంలోని తుక్కాపురం గ్రామంలో సోమవారం ‘మన ఊరు-మన బడి’కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.24.52లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి తరగతి గదులు, పాఠశాల ఆవరణను పరిశీలించి అవసరాలను గుర్తించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనున్నదన్నారు. నాణ్యమైన ఉచిత విద్యను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత విద్యావంతులుగా ఎదుగాలని ఆకాంక్షించారు.
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనున్నదని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. తుక్కాపురం గ్రామంలో సోమవారం నిర్వహించిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. అనంతరం ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో తరగతి గదులు, తాగునీటి వసతి, మధ్యాహ్న భోజనం నిర్వహణ తీరును పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలలో రూ. 24.52 లక్షలతో చేపట్టనున్న మౌలిక వసతుల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
అక్కడే మొక్కను నాటారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉన్నత విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మహిళల డ్రాపౌట్స్‌ను అధిగ మించేందుకు 33 మహిళా డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేశారన్నారన్నారు. వైశాల్యం, జనాభాలో రాష్ర్టానికి మించి మూడింతలు ఉన్న రాష్ర్టాల్లోనూ ఈ స్థాయిలో గురుకులాలు లేవన్నారు. నాగరిక సమాజ నిర్మాణానికి విద్య అవసరాన్ని గుర్తించి కార్పొరేట్ స్థాయి విద్యను సీఎం కేసీఆర్ అందుబాటులోకి తెచ్చారన్నారు. తుక్కాపురం హైస్కూల్లో డైనింగ్ హాల్, ఇతర వసతుల కోసం త్వరలోనే రూ.70 లక్షలతో పనులను చేపట్టనున్నట్లు మంత్రి చెప్పారు.
కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ బీరు మల్లయ్య, వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేశ్‌గౌడ్, పీఏసీఎస్చైర్మన్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నోముల పరమేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, సర్పంచ్ నోముల పద్మామహేందర్రెడ్డి, ఎంపీటీసీ రాసాల మల్లేశ్, ఎస్ఎంసీ చైర్మన్ నర్సింహ, పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగాం పాండు, నాయకులు అతికం లక్ష్మీనారాయణ, బల్గూరి మధుసూదన్‌రెడ్డి, జక్కా రాఘవేందర్‌రెడ్డి, చిందం మల్లికార్జున్, ర్యాకల శ్రీనివాస్, చిన్నం పాండు, శెట్టి బాలయ్య, పుట్ట వీరేశ్ యాదవ్, దుర్గపతి చంద్రమ్మ, మహేశ్, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతమై విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. ప్రైవేటు పాఠశాలల్లో బోధిస్తున్న ఇంగ్లిష్ విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనూ అందుబాటులోకి వస్తున్నది. దీనివల్ల చదువుల పరంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారం సైతం తగ్గుతుంది. ఈ పథకం మూలంగా పాఠశాలలకు అన్నిరకాల మౌలిక వసతులు తీరడంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం కూడా నెలకొంటది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి.
– పైళ్ల శేఖర్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే
ఏండ్ల తరబడి నిర్వీర్యమైన ప్రభుత్వ పాఠశాలలు స్వరాష్ట్రంలో కొత్త రూపును సంతరించుకున్నాయి. ఆంగ్ల విద్యపై ఉన్న మోజుతో తమ పిల్లలను ప్రైవేటుకు పంపించి తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని భావించే సీఎం కేసీఆర్ ప్రభు త్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల విద్యను అందుబాటులోకి తెస్తున్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా స్థిరపడడం వల్ల పేదరికం కూడా తగ్గుతుంది. తొలి విడుతలో వసతులు కొరవడిన పాఠశాలలను గుర్తించి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయింపులు జరుపడం హర్షనీయం. రాబోవు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు దీటుగా నిలవనున్నాయి.
– ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ
మన ఊరు-మన బడి కార్యక్రమం పేద విద్యార్థులకు వరం. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు 12 అంశాలతో ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఈ ఆంశాల పరంగా పనులను పూర్తి చేస్తే పాఠశాలలో విద్యార్థులకు అన్ని వసతులు అందుబాటులోకి వస్తాయి. జిల్లాలోని మన ఊరు- మనబడి పథకం కింద గుర్తించిన పాఠశాలల్లో రూ.30 లక్షల్లోపు చేపట్టే పనులను ఎలాంటి టెండర్ లేకుండానే కలెక్టర్ అనుమతితో చేపట్టేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకోవాలి.
మన ఊరు-మనబడిలో భాగంగా ప్రభుత్వం మూడు దశల్లో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయనుంది. జిల్లాలో 712 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో 29 వేల మంది అబ్బాయిలు, 26 వేల మంది అమ్మాయిలు చదువుతున్నారు. మూడేళ్ల ప్రణాళికతో అమలయ్యే మన ఊరు-మనబడి కార్యక్రమంలో మొదటి దశలో 251 స్కూళ్లు ఎంపిక చేసి 163 పాఠశాలల్లో చేపట్టబోయే 612 పనులకు సంబంధించిన అంచనాలు రూపొందించాం. రూ.30 లక్షల లోపు చేపట్టబోయే పనుల్లో భాగంగా పాఠశాలల్లో టాయిలెట్స్, తరగతి గదుల నిర్మాణం, మంచినీరు, విద్యుత్ సౌకర్యం కల్పనకు చర్యలు తీసుకోనున్నాం. ప్రభుత్వ చర్యలతో ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం మరింత పెరగనుంది.
– పమేలా సత్పతి, కలెక్టర్