సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 5 : దివంగత, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ గొప్ప సంఘ సంస్కర్త అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం అలుపెరుగని పోరాటం చేశారని, వివక్షను, అణచివేతను జయించిన యోధుడు అని కొనియాడారు. మంగళవారం జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా దళిత సంఘాల ఆధ్వర్యంలో మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి శంకర్ విలాస్ సెంటర్, ఎంజీ రోడ్డు, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్ వరకు 2వేల మందితో నిర్వహించిన ర్యాలీలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. అడుగడుగునా మహిళలు మంగళహారతులతో నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ సమాజం బాబు జగ్జీవన్‌రామ్‌ను ఇప్పటికీ గుర్తు పెట్టుకుందంటే ఆయన సేవలే కారణమని అన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల్లో వెలుగులు నింపడానికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. పరిపాలనా దక్షత, ప్రజల పట్ల ఎనలేని ప్రేమ, నిస్వార్థ సేవలతో తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందారని, ఉప ప్రధానిగా విశేష సేవలు అందించారని తెలిపారు. స్వాతంత్రోద్యమం, సామాజిక సంస్కరణోద్యమాలు కన్న ముద్దు బిడ్డ డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ అని కీర్తించారు. సామాజిక సంస్కరణోద్యమాల్లో జగ్జీవన్‌రామ్ విశిష్టమైన స్థానాన్ని పదిల పరుచుకున్నారన్నారు. అటువంటి ఎందరో మహనీయుల కలలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాకారమవుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 1985లోనే తొలిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే దళితజ్యోతి కార్యక్రమాన్ని చేపట్టారని గుర్తుచేశారు. రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత దళితబంధుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. పార్టీలకతీతంగా నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆసరా పథకం అమలు చేస్తున్నారని, ఆరోగ్య వంతమైన సమాజం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలితా ఆనంద్, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ జీడి భిక్షం, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, ఆర్డీఓ రాజేంద్రకుమార్, తాసీల్దార్ వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, వార్డు కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్, నాయకులు గుడిపూడి వెంటేశ్వర్రావు, గొండ్రాల అశోక్, చింతలపాటి చిన్న శ్రీరాములు, తలమల్ల హసేన్, గుద్దేటి ఎల్లయ్య, నెమ్మాది వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ అధికారి దయానంద రాణి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కుల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.