తెలుగుయూనివర్సిటీ : భారతదేశాన్ని జాగృతం చేసిన స్వామి వివేకానంద గొప్ప మేధావి శాసనమండలి సభ్యులు ఎస్. మధుసూదనాచారి అన్నారు. ఫిలాంత్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 159వ జయంతి సందర్బంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో గల ఎన్టీఆర్ ఆడిటోరియంలో స్వామి వివేకానంద లెజండరీ ఇండియన్ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది.
భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాల ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానంద నేటి తరానికి స్పూర్తి ప్రధాత అని ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మధుసూదనాచారి పేర్కొన్నారు. సభాధ్యక్షులు ఇండో కెనెడియన్ యూత్ కౌన్సిల్ వ్యవస్థాపకులు రొయ్యూరు శేషసాయి మాట్లాడుతూ వివేకానందుని భోధనలు ప్రతి ఒక్కరు చదివి ఆచరణలో పెడుతూ సన్మార్గంలో నడవాలని ఉద్బోదించారు.
తెలంగాణ ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన విభిన్న రంగాలలో ప్రతిభావంతులైన 25మందికి లెజెండరీ ఇండియన్ జాతీయ పురస్కారాలతో సత్కరించారు. ఫిలాంత్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ అద్దంకి రాజా యోనా, యువజన సంఘాల సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ, పుడమి సాహితీవేదిక అధ్యక్షులు డాక్టర్ చిలుముల బాల్రెడ్డి, శివ రుద్రయ్య, డాక్టర్ ధీరజ్ అచ్యుతుని, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.