ఊరూ వాడలన్నీ పూల వనాలయ్యాయి.. బతుకమ్మ వేడుకకు కూడళ్లు, చౌరస్తాలు వేదికలయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. టీఎన్జీవోల ఆధ్వర్యంలో సిద్దిపేట, సంగారెడ్డి కలెక్టరేట్లల్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉత్సవాలను జరుపుకొన్నారు. పలుచోట్ల ప్రజాప్రతినిధులు పాల్గొని బతుకమ్మ ఆడిపాడారు.
సిద్దిపేట అర్బన్/ సంగారెడ్డి మున్సిపాలిటీ/ కొండపాక/ చిన్నకోడూరు/ నంగునూరు, అక్టోబర్ 12 : సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం ప్రకృతి పండుగ కన్నుల పండువగా సాగింది. ఒత్తిడితో విధులు నిర్వర్తించే అధికారుల మోముల్లో నవ్వులు పూలై విరబూసాయి. పూలన్నీ రంగుల బతుకమ్మగా మారి సంబురాన్ని తెచ్చాయి. ఈ ఆనందాల వేడుకకు సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణ వేదికైంది. ఈ వేడుకల్లో జిల్లా అధికారులతో పాటు మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు, ఆడబిడ్డల నృత్యాలు, డప్పు చప్పుళ్లతో కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణం మార్మోగింది. మహిళా అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ్రెడ్డి దంపతులు, సీపీ జోయల్ డెవిస్ దంపతులు, అదనపు కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులు ఆనందంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలను జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్వో చెన్నయ్య, మిషన్ భగీరథ పర్యవేక్షక ఇంజినీర్ చారి, పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజినీర్ కనకరత్నం, ఆర్డీవోలు జయంచంద్రారెడ్డి, విజయేందర్‌రెడ్డి, అనంతరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మంత్రి క్యాంపు కార్యాలయంలో..
జిల్లా కేంద్రం సిద్దిపేటలోని మంత్రి హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ సంబురాల్లో మహిళా కౌన్సిలర్లతో కలిసి సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజులారాజనర్సు బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కొండం కవిత, వంగ రేణుక, సాకి బాల్‌లక్ష్మి, వరాల కవిత తదితరులు ఉన్నారు.
టీఎన్జీవో ఆధ్వర్యంలో..
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో టీఎన్జీవో ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. బతుకమ్మ సంబురాల్లో డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ గాయత్రీదేవి పాల్గొని బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో టీఎన్జీవో మహిళా నాయకురాలు నిర్మల రాజకుమారి, సుధామణి, పుణ్యమ్మ, శ్రీవాణి, ప్రియాంక, ఉమారాణి, సుధారాణి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు టి.సుశీల్‌బాబు, ప్రధాన కార్యదర్శి నర్సింహులు, రాష్ట్ర కార్యదర్శి రవి, నాయకులు సిద్ధిరామ్, శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి, శ్రీకాంత్, శ్రీనివాస్, భాస్కర్, గౌస్ హష్మి పాల్గొన్నారు.
కొండపాకలో సద్దుల బతుకమ్మ..
మండల కేంద్రమైన కొండపాకతో పాటు దమ్మక్కపల్లిలో సద్దుల బతుకమ్మ ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలను సేకరించి బతుకమ్మలను పేర్చి, గ్రామ కూడళ్ల వద్ద పెట్టి బతుకమ్మలు ఆడారు. సాయంత్రం బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామాల శివారులోని బతుకమ్మ చెరువులో నిమజ్జనం చేశారు.
ఏడొద్దుల సద్దుల బతుకమ్మ..
చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఏడొద్దుల సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు మండల కేంద్రమైన చిన్నకోడూరుతో పాటు మాచాపూర్, కమ్మర్లపల్లి, అల్లీపూర్, చెల్కలపల్లి, మెట్పల్లి, నంగునూరు మండలం రాజగోపాల్‌పేటలో సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహించారు.
్రబ్రిస్బెన్లో బతుకమ్మ సంబురాలు
మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 12 : ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్ నగరంలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయ బద్ధకంగా నిర్వహిస్తున్నట్లు బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు సంతోష్‌రావు, కత్తి కిషోర్, సాదం శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో నిర్వహించుకునే అన్ని పండుగలను సాంప్రదాయ బద్ధంగా నిర్వహించుకుంటామన్నారు. బతుకమ్మ సంబురాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మహిళలు చిట్టి కవిత, షాలిని, హారిక, కప్పరి స్వాతి, శ్వేత, శిల్ప, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.