వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 11: ఎంజీఎం దవాఖానలో అత్యవసర వైద్యసేవలను అందించే క్యాజువాలిటీ విభాగం విస్తరణకు వైద్యాధికారులు చర్యలు చేపట్టారు.. ఫిబ్రవరి 10వ తేదీన సందర్శించిన సమయంలో ఎంజీఎం దవాఖాన అవసరాలను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. ఎంజీఎం దవాఖానకు ఎక్కువ మంది అత్యవసర పరిస్థితుల్లో వచ్చి వైద్య సేవలు పొందుతున్నందున క్యాజువాలిటీని విస్తరించాల్సి ఉందని తెలియజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి విస్తరణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈమేరకు క్యాజువాలిటీని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ వి.
చంద్రశేఖర్ తెపారు. సుమారు రూ.10కోట్లతో మంజూరు చేసిన ఎంఆర్ఐ, సిటీ స్కాన్ యంత్రాలను క్యాజువాలిటీకి అనుసంధానంగా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. క్యాజువాలిటీని విస్తరించి, పడకల సంఖ్య సైతం పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, అందుబాటులో ఉన్న ఆక్సీజన్ పైప్లైన్లను భవిష్యత్తులోనూ వినియోగించుకునేలా ఇంజినీరింగ్ నిపుణుల సలహాలు తీసుకుంటున్నామని వివరించారు. త్వరలోనే విస్తరణ పనులు ప్రారంభించేందుకు ఉన్నతాధికారుల అనుమతులు తీసుకోనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం క్యాజువాలిటీ సేవలు అందిస్తున్న విభాగా లను ఆర్ఐసీయూ భవనంలోని కార్డియాలజీ విభాగాన్ని తాత్కాలిక క్యాజువాలిటీగా వినియోగించడానికి అధికా రులు ఆలోచనలు చేస్తున్నారు. కార్డియాలజీ విభాగంలో అన్ని పడకలకు ఆక్సీజన్ సౌకర్యంతోపాటు మౌలిక వసతులు ఉన్నాయి. అంబులెన్స్‌ల రాకపోకలకు అనువుగా రోడ్డు సౌకర్యంతోపాటు ప్రధానగేటుకు అందుబాటులో ఉంది. ఇది తాత్కాలిక క్యాజువాలిటీకి అనువైనదిగా భావిస్తున్నారు.