తిరుమలగిరి, ఏప్రిల్ 2 : పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం నెలవంక కనిపించడంతో ముస్లింలు ఆదివారం నుంచి ఉపవాసాలు ప్రారంభించారు. నెల రోజుల పాటు ఉపవాసాలు కొనసాగుతాయి. మే 3వ తేదీన శవ్వాల్ నెలవంక కనిపిస్తే రంజాన్ పండుగ జరుపుకొంటారు. ఈ మాసంలోనే దివ్య ఖురాన్ అవతరించిందని ముస్లింల విశ్వాసం. ఖురాన్‌లోని 30 అధ్యాయాలు ఈ మాసంలో పూర్తి చేస్తారు. దీనినే తరావీ నమాజ్ అంటారు.
రంజాన్ నెలలో 30 రోజులు కఠినమైన ఉపవాస దీక్షలు పాటిస్తారు. దైనిక పనులు చేస్తూ కఠోరదీక్ష (ఉపవాసం) చేస్తూ అల్లాహ్‌ను స్మరించడం. పేదలు పడే ఆకలి దప్పుల బాధ ఎలా ఉంటుందో కలిగినవారికి ఉపవాసాల (రోజా) మూలంగా అనుభవంలోకి వస్తుంది. రోజా అంటే కేవలం నీరు, ఆహరం తీసుకోక పోవడమే కాదు.. అన్ని రకాల చెడు కార్యాలు, అన్యాయం, అధర్మం, కామ కోరికలు మనసులోకి రానివ్వకుండా పాప క్రియల నుంచి దూరంగా ఉంటూ అల్లాహ్ స్మరణ చేస్తూ తనకు తాను అంతర్గతంగా ఆత్మ ప్రక్షాళన చేసుకోవడం.
రంజాన్ ఉపవాస దీక్షలో సహర్, ఇఫ్తార్ ముఖ్యమైనవి. రంజాన్ నెలలో పూర్తి 30 రోజలు ఉపవాస దీక్షలు పాటించాలి. సూర్యోదయం కంటే ముందు నిర్ధేశిత సమయంలో అన్నపానీయాలు తీసుకోవాలి. దీనినే సహర్ అంటారు. ప్రతి రోజు కొన్ని నిమిషాల తేడాతో సూర్యాస్తమయ సమయంలో ఉపవాస దీక్ష విరమించడమే ఇఫ్తార్. దీక్షా సమయంలో ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోరాదు. మందులు, ఇంజక్షన్లు చివరికి నోటిలో ఊరే లాలాజలం కూడా మింగరాదు. ఇఫ్తార్‌ను ఖర్జూర ఇతరత్రా ఫలాలతో విరమిస్తారు.
ఇస్లాం అంటే సకల చరాచర సృష్టికర్త, సర్వేశ్వరుడైన అల్లాహ్‌కు లోబడి ఉండడం అని అర్థం. ఇస్లాం పరిపూర్ణంగా అమలు చేసేందుకు ముస్లింలు ఐదు ముఖ్య అంశాలను పాటించాల్సి ఉంటుంది. 1.ఇమాన్, 2.నమాజ్, 3.రోజా(ఉపవాస దీక్ష), 4.జకాత్(దాన ధర్మాలు), 5.హజ్‌యాత్ర.
రంజాన్ మాసాన్ని మూడు భాగాలుగా వర్గీకరిస్తారు. మొదటి పది రోజులు దైవ కారుణ్యానికి ప్రతీక. తర్వాత పది రోజులు క్షమాభిక్షకు ప్రతీక. చివరి పది రోజులు నరకం నుంచి విముక్తికి ఉపకరిస్తాయని మహ్మద్ ప్రవక్త అభివర్ణించారు.