మహిళల అందాలకు మరింత వన్నెతెచ్చేవి వారు ధరించే వస్ర్తాలు. పట్టు చీరెలు, బ్లౌజ్‌లు, పరికిణిలు ఇప్పుడు ఏ చిన్న శుభకార్యానికి వెళ్లినా ఆయా వస్ర్తాలపై ఉంటున్న డిజైన్లపై మగువలు మనసు పారేసుకుంటున్నారు. ప్రకృతి అందాలను వస్ర్తాలపై నేస్తూ చూపు తిప్పుకోకుండా చేస్తున్నది మగ్గం వర్క్ డిజైన్లు. కాలానికి అనుగుణంగా మనసుకు నచ్చే దుస్తులను ధరిస్తూ అందాలను ఆరబోసేందుకు నయా ట్రెండ్‌గా మారాయి మగ్గం, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ పనులు. ఈ పనులతో అతివలకు ఉపాధి లభిస్తుండడంతో పట్టు చీరెలు, బ్లౌజ్ డిజైన్లకు భలే డిమాండ్ పెరిగింది.
హుస్నాబాద్ టౌన్, సెప్టెంబర్ 24 : అతివల అందాలకు మరింత వన్నె తెచ్చెవి చీరలు, బ్లౌజ్‌లు అనేది ఒకప్పటి మాట. నేడు ఆ చీరలు, బ్లౌజ్లకు కొత్తగా అందాలు తీర్చిదిద్దుతున్నది మగ్గం, కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ వర్క్. ఒకప్పుడు పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన మగ్గం, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నేడు చిన్న పట్టణాలకు సైతం విస్తరించింది. పైగా కొత్త ట్రెండ్‌పై మహిళలు ఆసక్తి ప్రదర్శిస్తుండడంతో అందుకు అనుగుణంగా డిజైన్లు సైతం మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఇష్టమైన రీతిలో వివిధ రకాల అందమైన డిజైన్లు వేయించుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు.
మగ్గం.. కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్..
పండుగైనా, ఫంక్షన్ అయినా, ఏ చిన్న కార్యక్రమైనా వాటికి హాజరు కావాలంటే తప్పనిసరిగా తమ వస్ర్తాలకు నూతన అలంకరణ చేయించడం ఇప్పడు ఫ్యాషన్‌గా మారింది. మంచాలపై చేతితో తయారుచేసే వివిధ రకాల డిజైన్లతో పాటు కంప్యూటరీ ఎంబ్రాయిడరీ పనులకు హుస్నాబాద్‌లో భారీగా డిమాండ్ నెలకొంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మహిళలు తమ వస్ర్తాలపై కొత్త రకం డిజైన్లు వేయించుకునేందుకు ఆసక్తి చూపుతుండడంతో ఈ వ్యాపారం జోరుగా సాగుతున్నది. ముఖ్యంగా పెండ్లిళ్ల సమయంలో మాత్రం తప్పనిసరిగా ఏదో ఒక డిజైన్ వేయించుకుని హాజరవుతున్నారంటే మగ్గం వర్క్, కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ మహిళల అలంకరణలో ప్రథమస్థానం ఉన్నదని చెప్పవచ్చు.
రూ.100 నుంచి వేల రూపాయలకుపైగా డిజైన్లు..
తాము ధరించే వస్ర్తాలపై వేయించుకునే డిజైన్లకు వేల రూపాయలు ఖర్చవుతున్నా మహిళలు ఆ విషయంలో వెనుకాడడం లేదు. రూ.600 నుంచి 10వేలకు పైగా విలువ చేసే డిజైన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దాదాపు 600పైగా రకాల డిజైన్లు అందుబాటులో ఉన్న ట్లు నిర్వాహకులు చెబుతున్నారు. రోజు కు రెండు వరకు బ్లౌజ్‌లు డిజైన్లు తయారుచేసే కంప్యూటరీ ఎంబ్రాయిడర్ అందుబాటులో ఉండగా, మగ్గంపై చేతితో అద్దె అందాలకే మహిళలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చి పురుషులు ఎక్కువ సంఖ్యలో మగ్గం పనిని ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్వహిస్తున్నారు.
మగ్గంపై ఉచిత శిక్షణ…
మహిళలకు ఇష్టమైన వస్ర్తాల డిజైన్లపై మో జు పెరుగుతుండడంతో ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు సంస్థలు సైతం ముందుకు వస్తున్నా యి. పట్టణంలోని పలు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా మగ్గం వర్క్‌పై మహిళలకు శిక్షణ ఇస్తున్నాయి. పట్టణంలోని ఆప్తమిత్ర యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల మహిళలకు మగ్గం వర్క్ ఉచిత శిక్షణను ప్రారంభించగా, మరికొన్ని సంస్థలు ఇప్పటికే నిర్వహిస్తున్నాయి. మహిళలు ఇంటిదగ్గరే ఉంటూ ఆదాయాన్ని సంపాదించేందుకు మగ్గం పని ఎంతగానో ఉపయోగపడుతున్నది. పట్టుచీరల అందాలు, పరికిణిల రెపరెపలు కనిపిస్తున్నా.. దానికి మరింత అందాన్ని పెంచుతున్నది మగ్గం, కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ వర్క్. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వస్ర్తాలకు డిజైన్ అందాలు అద్దించుకుని ధరించాలని ఆసక్తి చూపతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేటితరం మహిళలు వస్ర్తాలకు డిజైన్లు వేయించుకోవడం తప్పనిసరిగా మారింది.
బ్లౌజ్ డిజైన్లకు భలే డిమాండ్..
పట్టు చీరలకు కుచ్చులు వేయించుకోవడంతో పాటు వాటిపై వేసుకునే బ్లౌజ్లకు మరిన్ని అందాలు ఉట్టిపడే విధంగా డిజైన్లు వేయించుకుంటున్నారు మహిళలు. బ్లౌజ్ వెనకపైతో పాటు చేతులపై వివిధ రకాల డిజైన్లు వేయించుకునేందుకు మహిళలు అమితంగా ఇష్టపడుతున్నారు. దీంతో మార్కెట్లో మగ్గం, కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్‌కు డిమాండ్ పెరిగింది. ఇందులో బోటెనెక్, ఆల్ అవర్, క్లచ్ వర్క్, మిర్రర్, కుచ్చు లు ఇలా పలురకాల డిజైన్లు వేయించుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. చీరలతో పాటు చిన్నపిల్లల లంగాలు, పలు రకాల వస్ర్తాలపై డిజైన్లు వేయించుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. హుస్నాబాద్ పట్టణంలో పదికి పైగా మగ్గం, కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ దుకాణాలు వెలిశాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ చాలాచోట్ల వెలిశాయి. మహిళలు తమ సొంతకాళ్లపై నిలబడి ఉపాధి పొందేందుకు మగ్గం, కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ మార్గంగా
మారింది. యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నా..
చిన్నప్పటి నుంచి కుట్టుమిషన్‌పై బ్లాజ్లు, చీరలకు పాల్స్ కుట్టడం చేశాను. మిషన్ అంటే ఇష్టం ఉన్న టీవీల్లో డిజైన్లతో కూడిన బ్లౌజ్‌లు చూసి చేయాలని అనుకున్నా. యూట్యూబ్‌లో చూసి కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ నేర్చుకున్నా. ఇప్పుడు రోజుకు రూ.వెయ్యి వరకు సంపాదిస్తున్నా. ఆ డబ్బులను అవసరాలకు ఉపయోగిస్తున్నా.
బి.విజయ, గృహిణి, హుస్నాబాద్
రోజుకు రూ.600 సంపాదిస్తున్నా..
మగ్గం వర్క్ నేర్చుకుని మిషన్ కొనుకున్నా. ఇం ట్లోనే ఎంబ్రాయిడర్ మి షన్ తెచ్చుకుని ఆరు నెలల నుంచి వర్క్ చేస్తున్నా. బ్లౌజ్‌లపై డిజైన్లు వేస్తూ రోజుకు రూ.600 సంపాదిస్తున్నా. మహిళలు మిషన్‌పై డిజైన్లు వేయించుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఎవరికి ఎలాంటి డిజైన్ కావాలంటే వాటిని వేసేందుకు కంప్యూటర్లో కొత్త డిజైన్లు తెప్పించి వేస్తున్నా.
దండి స్వప్న, హుస్నాబాద్
మగ్గం పనితో మహిళలకు ఉపాధి..
మగ్గంపై నేసిన డిజైన్లు ధరించేందుకు మహిళలు ఇష్టపడుతున్నారు. నగరాలకు పరిమితమైన మగ్గం వర్క్‌ను పట్టణాల్లోని మహిళలకు సైతం అందించాలనే ఆలోచనతో మగ్గం వర్క్ ఉచితంగా నేర్పుతున్నాం. మగ్గం పని నేర్చుకున్న మహిళలు వారి ఇంట్లోనే డిజైన్లు వేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. మార్కెట్లో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా మహిళలు ఇది నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
రాజమౌళి, ఆప్తమిత్ర యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, హుస్నాబాద్