కేంద్ర ప్రభుత్వమే యాసంగి వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి టీఆర్ఎస్ సర్కారు పోరుబాట పట్టింది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వారం రోజులుగా తీర్మానాల జోరు కొనసాగుతున్నది. గత గురువారం నియోజకవర్గ కేంద్రాల్లో మంత్రి, విప్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దిశానిర్దేశం చేశారు. పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా, మండల రైతుబంధు సమితులు, డీసీసీబీ, డీసీఎంఎస్, మార్కెట్, పీఏసీఎస్ కమిటీ, జిల్లా పరిషత్‌లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి తీర్మానాలు చేశాయి. గురువారం మున్సిపాలిటీలు కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి చైర్మన్లు, కో-ఆప్షన్, కౌన్సిల్ సభ్యులు తీర్మానాలు చేశారు. నిర్మల్ మున్సిపల్ సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొనగా.. కాగజ్‌నగర్ బల్దియా సమావేశంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొన్నారు. అనంతరం పత్రాలను కేంద్రానికి పంపించారు.
ఎదులాపురం/నిర్మల్ అర్బన్, మార్చి 31 : తెలంగాణలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కేంద్ర ప్రభుత్వమే కొనాలని మున్సిపల్ పాలకవర్గాలు తీర్మానించాయి. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, నస్పూర్, లక్షెట్టిపేట, చెన్నూర్, క్యాతనపల్లి, మందమర్రి, బెల్లంపల్లి ఏడు మున్సిపాలిటీలు ఉండగా.. మందమర్రిలో పాలకవర్గం లేదు. కాగా, మిగతా ఆరు మున్సిపాలిటీల్లో గురువారం పాలకవర్గాలు సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో రైతులు పండించిన వరి పంటను కేంద్రం కొనుగోలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించాయి. మంచిర్యాలలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, నస్పూర్‌లో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, లక్షెట్టిపేటలో చైర్మన్ నల్మాసు కాంతయ్య, చెన్నూర్‌లో మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన గిల్డా, క్యాతనపల్లిలో చైర్పర్సన్ జంగం కళ, బెల్లంపల్లిలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత అధ్యక్షతన మున్సిపల్ పాలకవర్గ సమావేశాలు జరిగాయి. ఇందులో వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తున్నదని వారు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ రైతులను ఆగం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం పురోభివృద్ధి చెందుతున్నదని, తెలంగాణ రైతులను అవహేళన చేసిన కేంద్ర పీయూష్ గోయల్ అన్నదాతలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తీర్మాన పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు పంపించారు.
పంజాబ్ తరహాలో కేంద్ర ప్రభుత్వం ధాన్యం కోనుగోలు చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గురువారం నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సభ్యులు మంత్రి ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలని స్థానిక ఎమ్మెల్యే కోనప్ప సమక్షంలో సభ్యులు ఏకగ్రీవ తీర్మానం శారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని రైతులు పండించిన వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కోనుగోలు చేయాలని, సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని ఆదిలాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అధ్యక్షతన సమావేశం జరుగగా.. సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.