ఉపాధి హామీ పథకంలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ఎంఎంఎస్ సాఫ్ట్ట్వేర్తో ఉపాధిహామీ కూలీలకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. రోజుకు రెండుసార్లు పని ప్రదేశంలో ఫొటో దిగాలనే నిబంధన కూలీలను కలవరపెడుతున్నది. ప్రతి పేద కుటుంబానికీ ఏడాదిలో 100 రోజులు పనికల్పించాలనే లక్ష్యంతో 2005లో అప్పటి ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టింది. గత నెల వరకు రాష్ర్టానికి చెందిన సాఫ్ట్‌వేర్‌లో ఉపాధి పనుల వివరాలను నమోదు చేసేవారు. తాజాగా కేంద్రం కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది.
వేసవి దృష్ట్యా చాలా మంది కూలీలు ఉదయం ఆరు గంటలకు పనికి వెళ్లి కొలతల ప్రకారం చేసి 10 గంటల వరకు ఇండ్లకు చేరుకుంటారు. ప్రస్తుత సాఫ్ట్వేర్ ద్వారా ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పని చేయాలి. అందుకు సంబంధించిన రెండు ఫొటోలను పని సమయంలోనే సంబంధిత గ్రూప్‌నకు చెందిన మేట్ ఎన్ఎంఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో అప్లోడ్ చేయాలి. ఇలా చేస్తేనే పూర్తి హాజరుతో గరిష్ఠ కూలి వస్తుందని అధికారులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్ ఉన్న వారినే మేట్లుగా నియమిస్తున్నారు. వీరి ఫోన్లో ఎన్ఎంఎంఎస్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని, ఎప్పటికప్పుడు పని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
రెండు పూటలా పని విధానం అమలు కష్టంగా మారనుంది. అసలే ఎండలు ముదురుతున్నాయి. 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండు పూటలా పని చేయడంపై కూలీలు ఆందోళన చెందుతున్నారు. పల్లెల్లో ఉపాధి పనులకు పోవడానికి ప్రయాణ సౌకర్యం ఉండదు. ఎంత దూరమైనా నడుచుకుంటూ ఎండలోనే వెళ్లాలి. అలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానంతో ఉదయం, సాయంత్రం పనులు చేయడం కష్టమే అని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కూలీ ముఖం ఫొటోలో స్పష్టంగా కనిపిస్తేనే ఆన్లైన్లో హాజరు నమోదయ్యే అవకాశం ఉంటుంది. దీనికి తోడు పనిప్రదేశంలో మొబైల్ సిగ్నల్ వేధిస్తుంది. పని ప్రదేశం నుంచి ఫొటోలు అప్లోడ్ చేయడం సరికాదని కూలీలు పేర్కొంటున్నారు.
గతంలో ఉపాధి కూలీలకు ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ నెల వరకు వేసవి భత్యం అందేది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రాష్ర్టానికి సంబంధించిన టీసీఎస్ సాఫ్ట్‌వేర్‌లో ఉండేవి. కానీ కేంద్ర ప్రభుత్వం గత నెలలో వినియోగంలోకి తీసుకవచ్చిన ఎన్ఎంఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో వేసవి భత్యానికి సంబంధించిన ఆప్షన్ లేదు. ఫిబ్రవరిలో 20శాతం, మార్చిలో 25, ఏప్రిల్, మేలో 30శాతం చొప్పున, జూన్‌లో 20శాతం అదనంగా పేమెంట్ ఇచ్చేవారు. వేసవి భత్యం చెల్లింపు తీసేయడంపై కూలీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉన్నందున పాత విధానంలో ఉపాధి పనులు కొనసాగించాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు.