తెలంగాణ ఉద్యమ నినాదంలో ఒకటైన ఉద్యోగాల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. పెద్దఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో శాఖల వారీగా నోటిఫికేషన్ల విడుదలకు రంగం సిద్ధమైంది. ఇదే సమయంలో ఉద్యోగాల సాధనలో యువతకు అండగా నిలువాలని టీఆర్ఎస్ సంకల్పించడం నిరుపేద ఉద్యోగార్థులకు వరంగా మారింది. పార్టీ పిలుపు మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, నియోజవర్గ ఇన్చార్జీలు ఉచిత శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఇప్పటికే కోచింగ్ ప్రారంభమవగా, మిగిలిన చోట్ల వచ్చే నెల మొదటి వారం షురూ కానున్నాయి. నిపుణులైన అధ్యాపకులతో శిక్షణ ఇప్పించడంతోపాటు స్టడీ మెటీరియల్, భోజన వసతి కూడా ఉచితంగానే కల్పిస్తుండడంపై అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నల్లగొండ జిల్లా కేంద్రంలోపోలీస్ ఉద్యోగార్థుల కోసం జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటుచేసిన ఉచిత శిక్షణ శిబిరాన్ని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి గురువారం ప్రారంభించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా 80వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. ఉద్యోగాల ప్రకటన వెలువడే అవకాశాలున్న తరుణంలో మంచి కోచింగ్ సెంటర్లు, సబ్జెక్టు నిపుణుల వద్ద కోచింగ్ తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే, కోచింగ్ ఫీజు, పట్టణాల్లో వసతి, భోజనం ఖర్చు, స్టడీ మెటీరియల్.. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవే. ఎక్కువ మంది నిరుద్యోగులు నిరుపేదలే కావడంతో వీరికి శిక్షణ అంతా తలకు మించిన భారం కానున్నది.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్… పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షన అందించి అండగా నిలువాలని ఎమ్మెల్యేలకు సూచించారు. దాంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎమ్మెల్యేలంతా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గత 15 రోజులుగా ఎమ్మెల్యేలంతా ఇదే పనిలో బిజీగా ఉన్నారు. తమ నియోజకవర్గాల్లో ఉచిత శిక్షణ, ఫ్యాకల్టీ, వసతి, భోజనం తదితర ఏర్పాట్లపై దృష్టి సారించారు. పలువురు ఎమ్మెల్యేలు ముందస్తుగా స్క్రీనింగ్ టెస్టులు పెట్టి అభ్యర్థులను ఎంపిక చేసి శిక్షణకు ఏర్పాట్లు చేశారు.
దేవరకొండ, ఏప్రిల్ 21: దేవరకొండ నియోజకవర్గంలో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. టెట్, గ్రూప్స్‌తోపాటు పోలీస్ ఉద్యోగార్థులకు శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. తరగతులకు 500 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని, వారికి ప్రతి రోజూ శిక్షణతోపాటు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గోల్కొండ అకాడమీ నిర్వాహకులు ఉపేందర్ తెలిపారు. ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ చొరవ తీసుకొని ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడంపై నిరుద్యోగ అభ్యర్థులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
హుజూర్నగర్, ఏప్రిల్ 21 : హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తండ్రి పేరిట ఏర్పాటైన అంకిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. పట్టణంలోని టౌన్ హాల్లో 90రోజులపాటు గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, టెట్‌కు ఉచిత శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. దూరప్రాంతాల నుంచి వచ్చే వారు ఇబ్బంది పడకుండా మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నారు. పోటీ పరీక్షలకు కావాల్సిన మెటీరియల్, నోట్ బుక్స్‌ను ఉచితంగా అందజేస్తున్నారు. రోజూ 600 మంది యువతీ యువకులు తరగతులకు హాజరవుతున్నారు.
సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి స్వయంగా తన తల్లి గుంటకండ్ల సావిత్రమ్మ పేరుతో ఏర్పాటు చేసిన ‘ఎస్’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలోనూ అనేక కార్యక్రమాలు, ఉచిత శిక్షణ ఇచ్చారు. తాజాగా శిక్షణ తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా 1,680 మంది నమోదు చేసుకున్నారు. త్వరలోనే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి శిక్షణతో పాటు ఉచిత వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన ‘అంకిరెడ్డి ఫౌండేషన్’ ఆధ్వర్యంలో రోజూ 600 మంది అభ్యర్థులకు శిక్షణ, భోజనవసతి కూడా కల్పించారు. గోల్కొండ అకాడమి ఫ్యాకల్టీతో నాణ్యమైన స్టడీ మెటీరియల్‌ను అందజేస్తూ శిక్షణ కొనసాగిస్తున్నారు.
కోదాడలోనూ నియోజకవర్గ నిరుద్యోగుల కోసం ఉచిత శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 300 దరఖాస్తులు అందాయి. గోల్కొండ అకాడమీ ఫ్యాకల్టీతోనే శిక్షణకు ఏర్పాట్లు చేస్తుండగా మే నెలారంభంలో తరగతులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
నల్లగొండ జిల్లాలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కోచింగ్‌కు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఇప్పటికే శిక్షణ కూడా మొదలైంది. జిల్లా కేంద్రమైన నల్లగొండలో మొత్తం 2వేల మందికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ‘కంచర్ల మానస ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ, భోజన వసతి, స్టడీ మెటీరియల్ అందించనున్నారు. టెట్‌లో 650 మందికి, గ్రూప్స్ కోసం 525 మందికి, ఎస్ఐ, కానిస్టేబుల్స్ శిక్షణ కోసం మూడు బ్యాచ్‌ల్లో వెయ్యి మందికి శిక్షణను ప్రారంభించారు.
దేవరకొండలోనూ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నేతృత్వంలో ఉచిత శిక్షణకు చకచకా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే తరగతులు కూడా ప్రారంభించారు. ఎన్ఆర్ఐ నర్సిరెడ్డి సహకారంతో మొత్తం 500 మందికి శిక్షణ మొదలైంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ ఆధ్వర్యంలో ‘నోముల ఎన్ఎల్’ ఫౌండేషన్ పేరుతో వారం రోజుల కిందటే హాలియాలో నిరుద్యోగ యువతకు శిక్షణ ప్రారంభించారు. స్క్రీనింగ్ టెస్ట్‌కు 500 మందికి పైగా హాజరయ్యారు.
మునుగోడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు పలు చోట్ల ఏర్పాట్లు చేస్తున్నారు. చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాలకు చెందిన వారికి చౌటుప్పల్‌లో శిక్షణ కోసం ఇప్పటికే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. మునుగోడు, నాంపల్లి, మర్రిగూడెం, చండూర్ మండలాలకు చెందిన వారికి చండూర్లో ఉచిత శిక్షణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉచిత శిక్షణ, భోజన వసతి, స్టడీ మెటీరియల్ అందించి అండగా నిలించేందుకు ఎమ్మెల్యేలంతా ముందుకు వస్తుండడంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత పట్టుదలతో చదివేందుకు తోడ్పడుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఈ నెల 24న అర్హత పరీక్ష
సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 21 : సూర్యాపేట జిల్లా ఏంద్రంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తల్లి గుంటకండ్ల సావిత్రమ్మ పేరున ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించగా మంత్రి ముఖ్య అతిథిగా హాజరై నిరుద్యోగ అభ్యర్థుల్లో ధైర్యాన్ని నింపారు. ప్రస్తుతం 1,680 దరఖాస్తులు అందాయి. ఈ నెల 24న అర్హత పరీక్ష నిర్వహించి ఎంపికైన వారందరికీ ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు.
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పేరుతో ఏర్పాటు చేసిన ‘ఎన్బీఆర్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక పరీక్షలకు శిక్షణ విజయవంతంగా పూర్తిచేశారు. గతంలోనూ పోలీసు ఉద్యోగాల కోసం శిక్షణ నిర్వహించగా అనేక మంది ఎంపికయ్యారు. ప్రస్తుతం కూడా ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పరీక్ష నిర్వహించి 800 మందిని ఎంపిక చేశారు. వీరికి భోజనవసతి, స్టడీ మెటీరియల్‌తో పాటు నిపుణులైన ఫ్యాకల్టీతో శిక్షణకు సిద్ధమవుతున్నారు. నెలాఖరులో తరగతుల ప్రారంభానికి శ్రీకారం చుట్టనున్నారు.
చౌటుప్పల్, ఏప్రిల్ 21 : మునుగోడు నియోజకవర్గ నిరుద్యోగులకు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బాసటగా నిలిచారు. చౌటుప్పల్‌లో ఉచిత కోచింగ్ ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. భాగ్యనగర్ ఇనిస్టిట్యూట్ నిర్వాహకులతో మాట్లాడి నాణ్యమైన శిక్షణ అందించేలా చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుల్, గ్రూప్ -1, 2,3,4 సహా పలు ఉద్యోగాలకు 90రోజుల పాటు శిక్షణ అందించనున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వెయ్యి మంది అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించగా మే తొలి వారంలో తరగతులు ప్రారంభం కానున్నాయి.