ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగియడంతో కేంద్రం వడ్డింపు మొదలుపెట్టింది. కొత్త అర్థిక సంవత్సరం మొదటి రోజే చిరువ్యాపారులపై పిడుగు వేసింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకూ పెరుగుతుండగా, మరోవైపు వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా రూ. 249.50 పెంచగా, ప్రస్తుతం రూ. 2253కు చేరుకున్నది. తమను మరింత నష్టాల్లోకి నెట్టేసేలా కేంద్రం చర్యలు ఉన్నాయని, ఇలా చేస్తే తామెలా బతికేదని వ్యాపారులు మండిపడు తున్నారు. ధరలు పెంచడంపై ఉన్న శ్రద్ధ, సామాన్యులకు మంచి చేయడంలో లేకపోవ డం హేయమని ఎద్దేవా చేస్తున్నారు. వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
ధరల భారం సామాన్యులతో పాటు చిరు వ్యాపారులను భయపెట్టిస్తున్నది. కేంద్రం వరుస వడ్డింపులతో పేద, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం మోపుతున్నది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంతో పాటు టోల్‌ప్లాజాల చార్జీల మోత మోగించింది. కాగా, వాణిజ్య సిలిండర్ ధరలను అమాంతం పెంచి, చిరువ్యాపారులను మరింత నష్టాల్లోకి నెట్టింది. కాగా, వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను ఏకంగా రూ. 249.50 పెంచుతూ శుక్రవారం చమురు కంపె నీలు నిర్ణయం తీసుకొన్నాయి. దీంతో వాణిజ్య సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 2253 కు చేరింది. గతనెల 22నే రూ. 50 పెంచిన కేంద్రం, తాజాగా ఏకంగా నాలుగింతలు పెంచి మోయలేని భారం మోపింది. పెంచేది కొండంత.. తగ్గించేది గోరంత అన్న చందంగా కేంద్రంలోని బీజేపీ పాలకులు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తున్నది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు మండిపడుతున్నారు. అచ్చేదిన్ అటుంచి సచ్చేదిన్ తెచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెన్నూర్, ఏప్రిల్ 3: నేను పదిహేనేండ్ల సంది చెన్నూర్ల చిన్న టీ కొట్టు నడుపుతున్న. మా కుటుంబానికి ఇదే ఆధారం. టీ స్టాల్ నడిస్తేనే మాకు కడుపు నిండుతది. టీ స్టాల్ల మాములు సిలిండర్లు వాడితే అధికారులు ఇడిసిపెట్టరు. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ ధరలు ఇంతలా పెరిగితే, మేమెట్ల బతుకుతం. కేంద్రం ఇప్పటికే ఎన్నోసార్లు గ్యాస్ ధరలు పెంచింది. ఇప్పుడు ఏకంగా రూ 273కు పెంచింది. ఇది నాకైతే మోయలేని భారం. మేం కడుపు నిండా తినుడు కేంద్రానికి ఇష్టం లేనట్టుంది. పేదలపై మరీ ఇంత కక్షనా.. చిన్న చిన్న టిఫిన్ సెంటర్ల పరిస్థితి కూడా ఆగమ్యగోచరం చేసిన్రు. మోడీ చేసేది ఏం మంచిగ లేదు. మాలాంటి పేదోళ్లకు ఏదో చేస్తడు అనుకుంటే ఉన్నది దోసుకుంటున్నడు. గిట్ల చేసి.. పెద్దోళ్లకు పెడుతున్నడు.
– పొన్నం చిన్నాగౌడ్ (టీ స్టాల్ యజమాని, చెన్నూర్)
కాగజ్‌నగర్ టౌన్, ఏప్రిల్ 3: సామాన్యుడిని బతుకగుండా చేస్తున్నరు. హోటళ్ల పెద్ద సిలిండరే వాడుతున్నం. ఇప్పుడు దాని రేటు మూడింతలు పెరిగింది. ఇగ మాకు ఫాయిదా ఏముంటది. సంపాదించింది దానికే పోతది. ఒకే సారి రూ. 200కు పైగా పెంచడంతో నిర్వహణ భారం పెరిగింది. రోజూ హోటల్లో టిఫిన్ల రేట్లు పెంచుదామంటే, కస్టమర్లు ఒప్పుకోరు. ఇగ ఏం చేసుడు. మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉన్నోళ్లకు మంచి చేస్తున్నడు. వెంటనే గీ గ్యాస్ ధరలు తగ్గించాలె. పెంచితే వంద దాకా పెంచి.. తగ్గిస్తే రూపాయి, రెండు రూపాలు తగ్గిస్తున్నరు.
-కైలాస్, హోటల్ నిర్వాహకుడు, కాగజ్‌నగర్
భైంసా, ఏప్రిల్ 3 : నేను నెల మొత్తం కష్టపడితే కిరాణా సరుకులు కూడా రావడం లేదు. ప్రతి వస్తువు ధర రెండింతలైంది. ఇయ్యాల్ల ఉన్న రేటు రేపు ఉండడం లేదు. దీంతో పాటు వంట గ్యాస్ ధరలు పెంచడం మాలాంటోళ్లకు కష్టమే. పేద, మధ్య తరగతోైళ్లెతే బతుకలేని పరిస్థితి ఉంది. కిరాయిలు చెల్లించలేక అప్పుల పాలవుతున్నాం. గ్యాస్ ధరలు ప్రతినెలా పెంచుతున్నారు. ఇలాంటి ధరలు గతంలో ఎప్పుడూ లేవు. నెల సంపాదన అంతా గ్యాస్, నిత్యావసర సరుకుల కొనుగోలుకే సరిపోతున్నది.
– రాజు, భైంసా
ఆసిఫాబాద్, ఏప్రిల్ 3 : ఇప్పటికే ఆయిల్, పల్లీలు, పుట్నాలు తదితర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి కమర్షియల్ గ్యాస్ ధర పెంచడం అన్యాయం. రూ.250 ఒక్కసారిగా పెంచడంతో హోటళ్ల నిర్వహణపై తీవ్రమైన భారం పడుతున్నది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించుకోవాలి. ధరలు పెరగడంతో హోటల్ నిర్వహణ కష్టంగా మారుతున్నది. జీతం కూడా పడని పరిస్థితి నెలకొంటున్నది. – ఇరుకుల్ల సంతోష్,
రాజరాజేశ్వర్ హోటల్ యజమాని, ఆసిఫాబాద్
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 3 : చమురు ధరలు తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫల మైంది. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామా న్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచడం దారుణం. పైగా సబ్సిడీ నగదును గాలికి వదిలేసింది. ఇలాంటి అసంపూర్ణ నిర్ణయాలతో ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నది.
– ఖలీం హైమద్, నిర్మల్
ఎదులాపురం, ఏప్రిల్ 3 : పెంచిన వంట గ్యాస్ ధరలను బీజేపీ సర్కారు వెంటనే తగ్గించాలి. ప్రస్తుతం వంట గ్యాస్ కోనలేని పరిస్థితిలో ఉన్నాం. రెండు, మూడు నెలలుగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. గ్యాస్ పొయ్యి మీద వంట చేయాలంటేనే వణుకు పుడుతున్నది. ధరలు అడ్డూఅదుపు లేకుండా పెంచుకుంటూ పోతే మా లాంటి నిరుపేదలు ఎలా బతకాలి.
– పోచన్న, రణదీవేనగర్, ఆదిలాబాద్
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 3: చదువుకున్న చదువుకు ఉద్యోగం రాలేదు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయం కాడ చిన్నపాటి టీ కొట్టు పెట్టుకొని మూడేళ్లుగా కుటుంబాన్ని పోషించుకుంటున్న. హోటల్ కోసం సబ్సిడీ సిలిండర్లు వాడితే అధికారులు ఫైన్లు వేస్తున్నరు. ఇగ కమర్షియల్ సిలిండర్ కొని వాడుతున్న. ఇప్పుడు ఈ సిలిండర్ ధర ఒకేసారి రూ. 250 పెరిగింది. ఇప్పుడు దాని రేటు రూ. 2253 వరకు చేరుకుంది. ఒకవైపు చక్కెర, పాల ధరలు పెరిగినయ్. ఇప్పుడు సిలిండర్ ధరలు కూడా పెరిగితే ఇక మా బతుకులు ఆగమే. భార్యాభర్తలిద్దరం కలిసి కష్టపడి పని చేస్తే రోజుకు రూ. 600 కూడా మిగలడం లేదు. వెంటనే ఈ గ్యాస్ ధరలు తగ్గించాలే. లేకుంటే వ్యాపారం చేసుకునుడు బందయితది. -లక్ష్మణ్, హోటల్ వ్యాపారి, నిర్మల్
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 3 : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ధరలు తగ్గించి పేద, మధ్య తరగతి ప్రజలకు న్యాయం చేయాలి. లేకుంటే ధరలు తగ్గించేదాకా పోరాటం ఉధృతం చేస్తాం. ప్రతిఏటా ధరలు పెంచడమే తప్పా తగ్గించిన దాఖలాలు బీజేపీ హయాం లో లేవు. సబ్సిడీ గ్యాస్ ధరలను ప్రభుత్వం పెంచడంతో ఈ రోజు సామాన్య ప్రజలు గ్యాస్‌పై వంట చేసుకోవాలంటేనే ఆలోచిస్తున్నారు. ప్రతి ఇంటికీ గ్యాస్ సిలిండర్లను ఇచ్చి నేడు ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచి సామాన్యులపై మోయలేని భారం మోపుతున్నారు.
– సయ్యద్ ముషీరొద్దీన్, నిర్మల్
ఎదులాపురం, ఏప్రిల్ 3 : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ‘అచ్చేదిన్’ వస్తుందని మోడీ అన్నారు. రానురాను పేదలు, మధ్య తరగతి వారు సచ్చే రోజులొచ్చాయి. గత సంవత్సరం కొవిడ్‌తో ఇబ్బందులు పడ్డాం. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.250 పెంచడం చాలా బాధాకరం. ఇదివరకు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచారు. అలాగే కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచి మాపై భారం మోపారు. బిజినెస్ చేయడం ఇక కష్టమే. – డీ గణేశ్, బాదం టీ యజమాని
బెల్లంపల్లి టౌన్, ఏప్రిల్ 3 : కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచుతూ పోతే బిజినెస్ చేయడం ఇక కష్టమే. బేకరీలో అన్ని రకాల తినుబండారాలను ఇక్కడే తయారు చేస్తాం. తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్‌ను వినియోగిస్తాం. పెట్టుబడిలో 25 శాతం గ్యాస్ కొనుగోలుకు పోతే ఏమాత్రం లాభం ఉండదు. గ్యాస్ ధర పెరిగిందని తినుబండారాల ధరలు పెంచినా, పరిమాణం తగ్గించినా మా గిరాకీ దెబ్బ తింటుంది. ఇప్పటికే ఉక్రెయిన్, రష్యా యుద్ధ ప్రభావంతో మంచినూనె ధరలతో పాటు ఇతర ధరలు పెరిగాయి. పరిస్థితి ఇలాగే ఉంటే మా దుకాణాలు మూసుకోవడం ఖాయం. కేంద్ర ప్రభుత్వం వెంటనే ధరలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి.
– ఉస్మాన్ పాషా, బేకరీ నిర్వాహకుడు, బెల్లంపల్లి
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 3: కేంద్రం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఒకేసారి రూ. 250 పెంచడం దారుణం. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధర చాలా ఎక్కువగా ఉంది. టీస్టాల్ నడిపించే మాకు గ్యాస్ ధరలు చాలా భారంగా అయినయ్. మేం టీ ధర పెంచితే ప్రజలు దుకాణానికిరారు. గిరాకీ తగ్గుతుంది. రెండు నెలల కితం రూ. 2000 ఉండే. నెల క్రితం వంద రూపాలు పెంచిన్రు. మళ్లీ ఏప్రిల్ ఒకటో తేదీనుంచి ఏకంగా రూ. 250 పెంచిన్రు. ప్రస్తుతం రూ. 2253కి సిలిండర్ దొరుకుతున్నది. ప్రభుత్వం స్పందించి అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా గ్యాస్ ధరలను ఉంచాలి.
– చల్లా శ్రీనివాస్, మంచిర్యాల