సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 21 : సూర్యాపేట జిల్లాలో ఒక ఏడాదిలో వివిధ రూపాల్లో పోగొట్టుకున్న 1,430 మొబైల్ ఫోన్స్‌ను జిల్లా పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందించేసినట్లు ఎస్పీ కె.నరసింహ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెల్ ఫోన్ రికవరీ మేళాలో రూ.22 లక్షల విలువ గల 107 మొబైల్ ఫోన్లను బాధితులకు ఆయన అందజేసి మాట్లాడారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతున్నారు. ఒక్కో మొబైల్ రికవరీ చేయడానికి సైబర్ వారియర్స్ పోలీస్, టెక్నికల్ టీం, పోలీసు సిబ్బంది చాలా కృషి చేశారని కొనియాడారు. బీహార్, ఒడిశా, జార్ఖండ్ లాంటి ఇతర రాష్ట్రాల నుండి ఈ మొబైల్స్ ను రికవరీ చేసినట్లు చెప్పారు.
నేరగాళ్లు మొబైల్ దొంగిలించి, వీక్ పాస్ వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మద్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. తప్పుడు ప్రవర్తన కలిగిన వ్యక్తులకు, నేరాలకు పాల్పడే వారికి ఫ్రెండ్లీ పోలీస్ ఉండదని సామాన్యుల పట్ల మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే సి ఇ ఐ ఆర్ పోర్టల్ ( https://www.ceir.gov.in ) నందు నమోదు చేసుకోవాలని, మొబైల్ ను బ్లాక్ చేసి, మీ సేవా ద్వారా దరఖాస్తు సంబంధిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసు శాఖ చాకచక్యంగా పనిచేసి పెద్ద మొత్తంలో ఫోన్స్ రికవరీ చేసి ఇక్కడ బాధితులకు అందించడం జరిగినదన్నారు.
మీ పిల్లలు డ్రగ్స్, అమ్మాయిల రవాణా లాంటి కేసుల్లో చిక్కుకున్నారు, డిజిటల్ అరెస్ట్ చేస్తాం అని సీబీఐ, సిఐడి లాంటి దర్యాప్తు సంస్థల పేర్లు చెప్పి డబ్బులు చెల్లించితే కేసు నుండి తప్పిస్తాం అంటే నమ్మవద్దని డిజిటల్ అరెస్ట్ అబద్దమన్నారు. జిల్లాలో వివిధ రూపాల్లో వినియోగదారులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ ను సి ఇ ఐ ఆర్ అప్లికేషన్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐ.టి కోర్ సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఐటి కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

రూ.22 లక్షల విలువైన 107 మొబైల్ ఫోన్లు రికవరీ