e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home జిల్లాలు అధ్యాపక వృత్తి వదిలి..లాసాలవైపు మళ్లి..

అధ్యాపక వృత్తి వదిలి..లాసాలవైపు మళ్లి..

అధ్యాపక వృత్తి వదిలి..లాసాలవైపు మళ్లి..

ఇంజినీరింగ్‌ అధ్యాపకుడిని దుర్భర స్థితికి చేర్చిన దురాశ
మోసాలకు పాల్పడి పదమూడేళ్లుగా అజ్ఞాతం
యాక్సిడెంట్‌లో కాలువిరిగి భిక్షగాడిగా దయనీయ జీవితం
తాజాగా కటకటాలపాలు
వివరాలు వెల్లడించిన కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి

కరీంనగర్‌, మే25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/రాంనగర్‌:ఉన్నత కుటుంబం.. చేతిలో ఇంజినీరింగ్‌ పట్టా.. ఆ వెంటే ప్రైవేట్‌ లెక్చరర్‌గా ఉద్యోగం.. మంచి పేరు.. ఇవన్నీ ఉన్నా అతడిలో ఓ దురాశ కలిగింది. అడ్డదారుల్లో విలాసవంతమైన జీవితం గడపాలనే కోరికే, అతడి జీవితాన్ని దుర్భర స్థితికి చేర్చింది. అధ్యాపక వృత్తి నుంచి పక్కదారి పట్టిన అతగాడు, మోసాలకు పాల్పడి జైలు జీవితం గడిపినా పంథా మార్చుకోలేదు. చేసిన తప్పుల నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లి పేరు, చిరునామాలు మార్చాడే తప్పా, తీరు మార్చుకోలేదు. కట్టుకున్న భార్య విడిచి వెళ్లినా మారలేదు. చివరకు ఓ యాక్సిడెంట్లో కాలు విరిగి, తిరుమల మెట్లపై భిక్షగాడిగా మారాల్సి వచ్చింది. పదమూడేళ్లుగా అజ్ఞాత జీవితం గడిపిన అతడు, ఇప్పుడు కటకటాపాలు కావాల్సి వచ్చింది. ఇది వినడానికి ఒక సినిమా కథలా ఉన్నా అక్షరాలా జరిగిన సంఘటన. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం సీపీ కమలాసన్‌రెడ్డి వెల్లడించారు.

కరీంనగర్‌ పోలీస్‌ కమిషన్‌ వీబీ కమలాసన్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి ఎన్‌జీవో కాలనీకి చెందిన కుందన శ్రీనివాసరావు అలియాస్‌ శ్రీనివాస్‌ అలియాస్‌ శశాంక రావుది ఉన్నత కుటుంబం. తండ్రి టెలికాం డిపార్ట్‌మెంట్లో ఉన్నతోద్యోగి. చదువుకోవాలన్న కోరిక.. తల్లిదండ్రులు అందించిన తోడ్పాటుతో శ్రీనివాసరావు చదువులో రాణించాడు. 1991లో వరంగల్‌ కిట్స్‌ నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పట్టా పొందాడు. ఆ తర్వాత కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఫిజిక్స్‌ మ్యాథమెటిక్స్‌ లెక్చరర్‌గా 2006 వరకు పనిచేశాడు. ఇక్కడి వరకు అతడి జీవితం బాగానే గడిచింది.
విలాసవంతమైన జీవితం కోసం పక్కదారి..
అధ్యాపక వృత్తి బాగానే ఉన్నది. కానీ, అతడిలో విలాసవంతమైన జీవితం అనుభవించాలన్న దురాశ కలిగింది. అందుకు వచ్చిన వేతనం సరిపోలేదు. అప్పుడే తన తెలివిని ఉపయోగించాడు. ఒక ముఠాను ఏర్పాటు చేసుకొని మోసాలకు తెరతీశాడు. వారంతా కలిసి నకిలీ కిసాన్‌ వికాస పత్రాలు సృష్టించి, వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టారు. సుమారు కోటి రుపాయల రుణాలు తీసుకొని బురిడి కొట్టించారు. మోసాపోయామని తెలుసుకున్న బ్యాంకర్లు ఫిర్యాదుచేయగా.. కరీంనగర్‌, వరంగల్‌, హన్మకొండ, హైదరాబాద్‌, గుంటూరు జిల్లాల్లోని పోలీస్‌ స్టేషన్లలో40కి పైగా కేసులు నమోదు కాగా, ఈ కేసుల్లో శ్రీనివాసరావును 2007లో కరీంనగర్‌ టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆ మేరకు ఏడాది పాటు అంటే.. 2008 వరకు శ్రీనివాసరావు కరీంనగర్‌ జైలులో గడిపాడు.
అజ్ఞాతంలోకి వెళ్లి.. భిక్షగాడిగా మారి..
మోసాలకు పాల్పడిన ముఠా సభ్యులకు అప్పటికే వివిధ రకాల జైలు శిక్షలు పడ్డాయి. తనకు కూడా అదే గతి పడుతుందని భావించిన శ్రీనివాసరావు.. 2008లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. తన పేరు, తండ్రి పేరు మార్చి కొత్త అవతారం ఎత్తాడు. కూర శశాంక రావు తండ్రి పేరు గౌతమరావు పేరిట హైదరాబాద్‌లో నకిలీ ఆధార్‌, పాన్‌ కార్డును సృష్టించాడు. తరచుగా చిరునామాలు మార్చి, అక్కడి పలు ప్రైవేట్‌ కాలేజీల్లో అధ్యాపకుడిగా కొంతకాలం పని చేశాడు. అనంతరం వరంగల్‌కు మకాం మార్చి, ఇక్కడా కొన్నాళ్లపాటు అధ్యాపకుడిగా పనిచేశాడు. ఈ క్రమంలోనే కుటుంబంలో తలెత్తిన వివాదంతో భార్య విడిచి వెళ్లిపోగా.. వారసత్వంగా తనకు వచ్చిన ఆస్తిని అమ్ముకొని విజయవాడకు మకాం మార్చాడు. కొన్నాళ్లపాటు హోటళ్లలో పని చేసి, అక్కడి నుంచి తిరుపతికి వెళ్లాడు. ఇక్కడ హోటళ్లలో పనిచేస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి పోయింది. దాంతో జీవితం ఒక్కసారిగా దుర్భరమైంది. మానసికంగా, ఆర్థికంగా చితికిపోయిన శ్రీనివాస్‌రావు గత్యంతరం లేక అలిపిరి మెట్లపై భిక్షాటన చేయడం మొదలుపెట్టాడు. నిజామాబాద్‌ నుంచి తీర్థయాత్ర కోసం తిరుపతికి వెళ్లిన కొంతమంది శ్రీనివాసరావును గమనించి, ఆ సమాచారాన్ని శ్రీనివాసరావు సోదరుడు శ్రీధర్‌కు అందించారు. తర్వాత శ్రీనివాసరావును బెంగళూర్‌కి తీసుకెళ్లి అక్కడ ఒక ప్రైవేట్‌ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం ఇప్పించారు.
వెంటాడిన పోలీసులు..
నాన్‌బెయిలబుల్‌ కేసుల్లో ఉండి ఏళ్ల తరబడిగా తప్పించుకొని తిరుగుతున్న నిందితులను పట్టుకునేందకు సీపీ కమలాసన్‌రెడ్డి ‘ఆపరేషన్‌ తలాశ్‌’ పేరిట స్పెషల్‌ ఆపరేషన్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఆపరేషన్‌లో కొంతమంది కరడు గట్టిన నేరస్తులను పట్టుకున్నారు. వారెంట్‌ జారీ చేసి ఉన్న శ్రీనివాసరావును పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ మేరకు సదరు బృందం.. అతడి వివరాలను కూపీలాగారు. ఎన్నో ప్రాంతాలు తిరిగారు. చివరకు బెంగళూర్‌లో అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బృందం సభ్యులను సీపీ అభినందించారు. ఒక దురాశ మనిషి జీవితాన్ని ఎలా దుర్భర పరిస్థితికి తీసుకెళ్తుందో చెప్పడానికి ఇదో నిదర్శనమంటున్నారు పోలీసులు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అధ్యాపక వృత్తి వదిలి..లాసాలవైపు మళ్లి..

ట్రెండింగ్‌

Advertisement