భూపాలపల్లి, మార్చి 30 : భూపాలపల్లి ఏరియాలోని కంపెనీ క్వార్టర్లను సింగరేణి సంస్థ సాధారణ మొత్తంతో అధికారులు, ఉద్యోగులకు అద్దెకు ఇచ్చింది. క్వార్టర్లలో నివాసం ఉంటున్న మెజార్టీ ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు సాధారణ అద్దె చెల్లించడంలోనూ జాప్యం చేస్తున్నారు. 2016 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రూ. 1,22,59,179 బకాయిలు పేరుకుపోయాయి.
కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతో పాటు, జిల్లా కోర్టు సింగరేణి భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ మూడు భవనాలు పోగా వివిధ ప్రభుత్వ శా ఖల అధికారులు, ఇతరులకు భూపాలపల్లి సింగరేణి ఏరియాలో 105 క్వార్టర్లను సంస్థ 2016 నుంచి ఇప్పటి వరకు అద్దెకు ఇచ్చింది. సంస్థ క్వా ర్టర్లు సౌకర్యవంతంగా ఉండడంతో పాటు బయట వాటితో పోల్చుకుంటే తక్కువ అద్దె ఉంది. ఇప్పటికి మిగిలిన కొద్ది మంది అధికారులు కూడా సింగరేణి క్వార్టర్లు కావాలని పట్టుబడుతున్నారు. దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి.
సౌకర్యవంతమైన కంపెనీ క్వార్టర్లకు వైశాల్యాన్ని బట్టి సాధారణ అద్దెను మాత్రమే సింగరేణి వసూలు చేస్తున్నది. విద్యుత్ మాత్రం వినియోగించుకున్న మేరకు చార్జీలు వసూలు చేస్తున్నది. నెలకు రూ. 150 నీటి పన్నును వేస్తున్నది. సింగరేణి కంపెనీ క్వార్టర్‌కు నెలకు రూ. 4వేలు అద్దె ఉంటే, ఇదే వైశాల్యం ఉన్న బయట ప్రైవేట్ ఇంటికి రూ.7 నుంచి 8వేల కిరాయి ఉంది.
2016 నుంచి 2022 ఫిబ్రవరి వరకు రూ. 1,22,59,179 క్వార్టర్ల నివాస అద్దె బకాయిలు పేరుకు పోవడంతో సింగరేణి అధికారులకు ఎటూ పాలుపోవడంలేదు. ఈ విషయమై జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ భవేశ్‌మిశ్రాకు కొద్దిరోజుల క్రితం నివేదించినట్లు సంబంధిత విభాగం అధికారి ఒకరు తెలిపారు.
భూపాలపల్లి మున్సిపాలిటీ కావడంతో ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్‌పై 10శాతం హెచ్ఆర్ఏ వస్తున్నది. సింగరేణి క్వార్టర్లలో అద్దెకు ఉంటున్న ఉద్యోగులు హెచ్ఆర్ఏ తీసుకుంటున్నా సింగరేణి సంస్థకు అద్దె మాత్రం చెల్లించడం లేదు.
సింగరేణి వ్యాప్తంగా ఉన్న 12 ఏరియాల్లో రూ.12 కోట్ల నుంచి రూ. 14కోట్ల వరకు క్వార్టర్ల అద్దె బకాయిలు పేరుకుపోయినట్లు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో పేరుకుపోవడానికి సింగరేణి ఎస్టేట్ విభాగం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని పలువురు కార్మికులు ఆరోపిస్తున్నారు. తాము తోటి కార్మికుడికి కేటాయించిన క్వార్టర్‌ను విధిలేని పరిస్థితుల్లో కిరాయికి తీసుకుంటే ముప్పుతిప్పలు పెట్టే ఎస్టేట్ విభాగం అధికారులు, ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు వసూలు చేయకుండా అలసత్వం ప్రదర్శించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
భూపాలపల్లి ఏరియాలో 2016 నుం చి 2022 ఫిబ్రవరి వరకు రూ.1,22, 59,179 క్వార్టర్ల నివాస అద్దె బకాయిలు ఉన్నాయి. అద్దె చెల్లించాలని పలుమార్లు నోటీసులు పంపాం. సకాలంలో అద్దె చెల్లించి సింగరేణి సంస్థకు సహకరించాలి.
అజ్మీరా తుకారాం, ఏరియా అధికార ప్రతినిధి, భూపాలపల్లి ఏరియా