e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News దైవాన్ని చేరుకోవ‌డానికి ఈ తొమ్మిది మార్గాలు ఎంతో కీల‌కం.. అవేంటో తెలుసా

దైవాన్ని చేరుకోవ‌డానికి ఈ తొమ్మిది మార్గాలు ఎంతో కీల‌కం.. అవేంటో తెలుసా

దైవాన్ని చేరుకోవటమే మనిషి జీవితానికి చివరి గమ్యం. మరి ఆ దైవాన్ని చేరుకోవటం ఎలా? అందుకు అనుసరించాల్సిన మార్గం ఏమిటి? ఎలాంటి సాధన మార్గాన్ని అవలంబించాలి? ఇంకా ఎన్నో సందేహాలు! దైవ సన్నిధిని చేరుకోవడానికి తొమ్మిది రకాలైన మార్గాలు ఉన్నాయని సూచించింది భాగవతం. ఏమిటా తొమ్మిది మార్గాలు?

‘యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం’ త్రికరణ శుద్ధిగా మనం చేసే ప్రతి పనీ శివారాధనే అవుతుందన్నారు ఆదిశంకరాచార్యులు. చేయాల్సిందల్లా శక్తిలోపం లేకుండా మనం ఎంపిక చేసుకున్న మార్గంలో చెయ్యగలిగిన విధంగా దైవాన్ని ఆరాధించటమే. తనను ఈ విధానంలోనే అర్చించాలని పరమాత్మ నిబంధనలేమీ పెట్టడు. ‘నీ శక్తిని అనుసరించి, నీ భావనకు అనుగుణంగా దైవాన్ని పూజించమ’ని శాస్త్రాలు చెబుతున్నాయి.

- Advertisement -

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం

శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవ, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదన ఈ తొమ్మిది మార్గాల ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చు. వీటినే నవవిధ భక్తి మార్గాలు అంటారు. భక్తుడు తనకున్న శక్తి సామర్థ్యాలు, అవకాశాన్ని బట్టి ఈ తొమ్మిది మార్గాల్లో దేన్నయినా ఎంచుకోవచ్చు. ఏ మార్గాన్ని ఎన్నుకున్నా తుది ఫలితం దైవ
సన్నిధానమే!

శ్రవణం: శ్రవణం అంటే వినటం. దైవం గురించి తన్మయత్వంతో వినటం కూడా భగవంతుడిని అర్చించినట్లే అవుతుంది. వినటం అంటే చెప్పే వ్యక్తి నోటి నుంచి వచ్చే మాటల్ని చెవులతో వినటం కాదు. విన్న మాటల్లోని అంతరార్థం మనసుకు చేరాలి. ఏ పనిచేస్తున్నా అంతకుముందు విన్న దైవికమైన మాటలే మనసులో అంతర్లీనంగా ప్రతిధ్వనించాలి. అవి తప్ప మరేదీ వినటానికి మనసు అంగీకరించని స్థితికి చేరుకోవాలి. అప్పుడే మనం నిజంగా ‘శ్రవణం’ చేసినట్లవుతుంది. ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే భగవంతుడి గురించి నారదుడి ద్వారా విన్నాడు. ధర్మరాజు, జనమేజయుడు, పరీక్షిత్తు మొదలైనవారంతా దైవం గురించి వింటూనే తరించారు. దీన్నే శ్రవణ భక్తి అంటారు.

కీర్తనం: కీర్తనం అంటే గొప్పగా చెప్పటం. భగవంతుడి గొప్పదనాన్ని నోరారా, మనసారా ఉన్నతమైన, ఉత్తమమైన భావనలతో చెప్పటమే కీర్తనం. భగవంతుడి సుగుణాలపై ఆరాధన భావంతో మనసును ఆయనపైనే లగ్నం చేయడం ఇందులో ప్రధానాంశం. నిత్యం భగవంతుడి సుగుణాలను మనసులో తలస్తూ, వాటి గురించి మాట్లాడుతూ ఉండటం వల్ల మనసు భగవంతుడిపై సులభంగా లగ్నం అవుతుంది. ఎప్పుడైతే దైవనామ సంకీర్తన చేస్తామో ఆ క్షణం నుంచే దైవానికి మరింత చేరువ అవుతాం. త్యాగరాజు, అన్నమయ్య, కంచర్ల గోపన్న, మీరాబాయి వంటి భక్తులు భగవంతుడిని కీర్తించి తరించారు. ఇది కీర్తనభక్తి అవుతుంది.

స్మరణం: స్మరణం అంటే తలచుకోవటం. ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దైవం గురించి తలచుకుంటూనే ఉండాలి. చివరకు నిద్రలో కూడా పరమాత్మను మర్చిపోలేని స్థితిని చేరుకోవాలి. అదే స్మరణ భక్తి. హనుమంతుడు, నారద మహర్షి ఇందుకు చక్కటి ఉదాహరణలు. నారాయణ నామ స్మరణ చెయ్యకుండా నారదుడు, రామనామ స్మరణ లేకుండా హనుమంతుడు క్షణం కూడా ఉండలేరు. అదీ నిజమైన స్మరణ అవుతుంది. గొప్పవ్యక్తుల ప్రవచనాలు విన్న కొద్దిసేపటికే వాటిని చాలామంది మర్చిపోతారు. కారణం స్మరణ లేకపోవటమే. ఎప్పుడైతే క్షణం కూడా విడిచిపెట్టకుండా దైవ నామ స్మరణ చేసేందుకు ప్రయత్నిస్తామో అప్పటినుంచి దైవానికి మరింత సన్నిహితులం అవుతాం.

పాదసేవ : పాదసేవ కంటే మించిన భక్తిమార్గం లేదు. రాముడి పాదుకలనే రామస్వరూపంగా భావించి పాదసేవ చేసి తరించాడు భరతుడు. గుహుడు చేసిన పాదసేవకు పులకరించి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు రాముడు. పాదసేవకున్న శక్తి అంత గొప్పది. అయితే, నిజంగా దైవం పాదాలు పట్టుకునే అవకాశం ఉండదు కదా అని సందేహం రావచ్చు. ఎల్లప్పుడూ భగవంతుడి పాదాల మీదే తదేకమైన శ్రద్ధ కలిగి ఉండటం కూడా పాదసేవ అవుతుంది. పాదసేవనం అంటే పాదాల చెంత తలను వాల్చడం మాత్రమే కాదు. దైవం అనుసరించి చూపిన మార్గంలోనే నడవటం ‘పాదసేవ’ అవుతుంది. ఇది సేవాభక్తి.

అర్చనం: ధూపదీపాలు, పువ్వులు మొదలైన వస్తువులతో అర్చన చెయ్యటం కూడా భగవంతుడిని చేరుకునే భక్తిమార్గం అవుతుంది. ఇది అర్చనభక్తి. ఏదో కుంకుమ, అక్షతలు, పూలు… దేవుడి మీద వేసినంత మాత్రాన అది అర్చన కాదు. భౌతికమైన వస్తువులతో భౌతికదేహంతో ప్రారంభించిన అర్చన, క్రమంగా ఉన్నతస్థితికి చేరుకుని చివరికి మానసికంగా దైవాన్ని దర్శించి, ఆ స్వామికి మనసు కోవెలలో అర్చనలు చేసే స్థితికి చేరుకోవాలి. మనలోని దుర్గుణాలు పరమాత్మ పాదాల దగ్గర వదలి, దైవప్రేమను తీసుకోవాలి. రామకృష్ణ పరమహంస కాళికాదేవికి అర్చన చేసి తరించారు.

వందనం: వందనం అంటే నమస్కరించటం. అవతలి వ్యక్తికి నమస్కరిస్తున్నామంటే అర్థం మనలోని అహాన్ని విడిచిపెట్టి అవతలి వ్యక్తి గొప్పదనాన్ని అంగీకరిస్తున్నామని. దైవానికి చేసే వందనం కూడా ఇలాగే జరగాలి. ప్రత్యక్షంగా దేవతా విగ్రహానికి మాత్రమే చేసే వందనం పరిపక్వత చెందిన వందనం అనిపించుకోదు. భగవంతుడి గొప్పతనాన్ని తెలుసుకుని, సమస్త జీవుల్లోను పరమాత్మ ఉన్నాడని గుర్తించి అన్ని ప్రాణుల పట్ల అంతులేని దయతో ఉండటం కూడా భగవంతుడికి వందనం చేసినట్లే అవుతుంది. ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు ఉన్నాడని గమనించి మన ప్రవర్తనను సక్రమంగా మలచుకోవటమే వందనానికి అర్థం,
పరమార్థం.

దాస్యం: ఈ మాట వినగానే రామబంటు హనుమయ్య గుర్తుకు వస్తారు. సేవ అంటే ఏమిటో, సేవకుడు ఎలా ఉండాలో హనుమ ఆచరించి చూపించినంతగా మరొకరు చూపించలేదు. చెప్పలేదు కూడా. దాస్యం కూడా సేవ లాంటిదే. దాస్యంలో ఫలితం ఆశించకుండా యజమానికి లొంగి పని చేస్తాం. అలాగే భగవంతుడు తన చుట్టూ ఉన్న లోకానికి యజమాని అని భావించి, ఆయనను ఆరాధిస్తూ ఉండటమే దాస్యం అవుతుంది. వనవాసంలో 14 సంవత్సరాల పాటు లక్ష్మణుడు అన్నకు దాసుడిగా ఉండి సేవలు చేసాడు.
ఇది దాస్యభక్తి.

సఖ్యం: సఖ్యంగా ఉండటం అంటే స్నేహం చేయడం. మంచి స్నేహితుడితో ఎలా నడుచుకుంటామో అలాగే భగవంతుడితో స్నేహభావం పెరిగే విధంగా ప్రయత్నం చేయడమే ‘సఖ్యం’ అవుతుంది. భగవంతుడిని మిత్రుడిగా భావించి అతని మహిమను, ఔన్నత్యాన్ని కీర్తిస్తూ భక్తిపారవశ్యంతో మెలగడమే సఖ్యత. భగవంతుడు అంటే రాయో, రప్పో కాదని.. విశ్వమంతటా వ్యాపించిన చైతన్యమే అని తెలుసుకుని, ఆ దైవాన్ని తండ్రిగా, తల్లిగా, కొడుకుగా, ప్రియుడిగా, తాతగా, అదీకాదంటే మనింట్లో పెద్దవాడిగా గుర్తించి, మనం ఏం తిన్నాతాగినా ఆయనకు సమర్పించాలి. మనకెంతో ఇష్టమైన వ్యక్తి పట్ల మనమెలా ఆదరభావం ప్రదర్శిస్తామో అంతే ఆదరణ, ప్రేమ దైవం పట్ల చూపిస్తూ ఆయనకు దగ్గరవ్వాలి. ఒకసారి బంధం అంటూ ఏర్పడితే.. మనం ఆయన్ని వదిలిపెట్టినా అతను మనల్ని వదలడు. కృష్ణుడితో పాండవులు సఖ్యతగా ఉండి, నిరంతరం రక్షణ పొందారు. అంతిమంగా జీవితాల్ని తరింపజేసుకున్నారు. కృష్ణ-కుచేల కథ సఖ్యభక్తికి ప్రపంచమంతా ఏకకంఠంతో స్వీకరించిన ఉదాహరణ.

ఆత్మనివేదనం: తనను తాను పూర్తిగా భగవంతుడికి సమర్పించుకోవటమే ఆత్మనివేదనం. తనదైనది ఏదైనా సరే అది పరమాత్మకు సమర్పించాలి. భౌతికదేహం నుంచి లోపల ఉండే జీవం దాకా అన్నిటినీ పరమాత్మ పాదాల దగ్గర వదలాలి. ఇందుకు ఎంతో సాధన, పరిపక్వత కావాలి. మన దగ్గర ఉన్నవన్నీ సమర్పించేశాక మిగిలేది ఆత్మ ఒక్కటే. అదే పరబ్రహ్మం. ఈ స్థితిలో భగవంతుడికి, భక్తునికి భేదంలేదు.. ఇద్దరూ ఒక్కటే. బలిచక్రవర్తి తనవి అనుకున్నవన్నీ పరమాత్మకు ఇచ్చేశాడు. గోదాదేవి ఆత్మ ప్రతిక్షణం రంగనాథుడి మీదే ఉండేది. మీరాబాయిది కూడా అదే మార్గం.

…? శ్రీ భారతి

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Diwali special | పిలక లేని కొబ్బరికాయను దేవుడికి కొడితే ఏమవుతుంది?

ఆది శంక‌రాచార్యులు స‌న్యాసం స్వీక‌రించేందుకు త‌ల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా?

ల‌క్ష్మీదేవి 8 రూపాల వెనుక ఆంతర్య‌మిది.. దీన్ని అర్థం చేసుకుంటే సిరిసంప‌ద‌ల‌కు కొద‌వ ఉండ‌దు

ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే ప‌ది రోజులు ఎందుకు మైల పాటించాలి.. ఇది ఆచారమా? మూఢ న‌మ్మ‌క‌మా?

మానవునికి మరణాన్ని మించిన భయమేముంది?

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement