ప్రకృతిలో మార్పులకు సాక్షి. ఆధ్యాత్మిక సాధకులకు శ్రీరామరక్ష. మహనీయుల అవతరణకు వేదిక. కవులకు, కావ్యాలకు అక్షర మాలిక… వేదం చెప్పిన కాల స్వరూపం. పరమాత్మ ఉపదేశించిన గీతాసారం. ఇన్నిటినీ ఇముడ్చుకున్న రుతువు హేమంతం. శరత్కాలాన్ని సాగనంపి ఆగమిస్తున్న హేమంత లీలా విలాసం ఒకసారి స్మరించుకుందాం..
భారతీయ ఆధ్యాత్మిక వ్యవస్థ అపరిమితం. ప్రకృతిలో జరిగే మార్పులను ఒడిసిపడుతుంది. అందులోని రహస్యాలు, అంతరార్థాలు మానవులకు తెలియజేస్తుంది. లౌకిక జీవనం పునాదిగా అలౌకిక జీవనానికి మార్గదర్శనం చేయడం మన ఆధ్యాత్మికత గొప్పదనం. కాలస్వరూపాన్ని అనుసరిస్తూ ఆగమిస్తున్న హేమంత రుతువు ఆధ్యాత్మిక కోణంలో అందమైనది మాత్రమే కాదు, అనంత సిద్ధులనూ ప్రసాదించే అద్భుత కాలం. వానజాడలు పూర్తిగా కనుమరుగై, అప్పటికే ప్రవేశించిన చలిని రెట్టింపు చేస్తూ ప్రకృతి కాంతకు చేమంతుల హారం వేస్తుంది హేమంతం.
శరదృతువు ముగిసి హేమంతం మొదలయ్యే సమయానికి వానలతో చికాకు కలిగించిన ప్రకృతి నెమ్మదిగా శీతలంగా మారుతుంది. వాతావరణంలో పగటి కాలపరిధి తగ్గుతూ, రాత్రి నిడివి పెరుగుతుంది. చలిగాలుల ప్రభావం అధికమవుతుంది. ఇతర రుతువులకు భిన్నంగా హేమంతం మనుషుల్ని దగ్గర చేస్తుంది. ఆహ్లాదాన్ని పెంచుతుంది. అంతేకాదు.. ఒక్కటిగా కలిసి నడిస్తే సమాజం ఎంత ఉన్నతంగా ఎదుగుతుందో వివరిస్తుంది. అందుకనే మార్గశిర, పుష్య మాసాలను (హేమంత రుతువు) ఆధ్యాత్మిక చింతనకు బీజం వేసే మాసాలని పెద్దలు చెబుతారు.
వేదకాలంలో ఆయనాంశం (సంవత్సర ఆరంభం) మార్గశిర మాసంతోనే మొదలయ్యేది. ఈ ప్రకారం సంవత్సరం హేమంతంతోనే మొదలయ్యేది. ఆ కాలంలో మార్గశిర మాసాన్ని ‘అగ్రహాయణిక’ అనే పేరుతో వ్యవహరించేవారు. తైత్తిరీయ బ్రాహ్మణంలో సంవత్సరాన్ని పక్షితో, రుతువులను పక్షి అవయవాలతో పోల్చుతూ వర్ణించారు.
తస్య తే వసంతః శిరః; గ్రీష్మో దక్షిణః పక్షః
వర్షాః పుచ్ఛం; శరద్ ఉత్తరః పక్షః; హేమంతో మధ్యం॥
(తై. బ్రా. 3.10.4.1)
సంవత్సరమనే పక్షికి వసంతం శిరస్సు అయితే, గ్రీష్మం కుడి రెక్క, వర్ష రుతువు తోక, శరత్తు ఎడమ రెక్క కాగా.. హేమంతం మధ్యభాగం అని చెబుతుందీ మంత్రం.
తైత్తిరీయ సంహితలో ఆరు రుతువుల్ని (తైత్తిరీయ సంహితం, తైత్తిరీయ బ్రాహ్మణం తరువాతి కాలంలో వెలువడింది. ఇప్పుడు చెప్పుకొనే చైత్రం, వైశాఖం తదితర మాసాల పేర్లు అప్పటికింకా ప్రాచుర్యంలోకి రాలేవు) వివరించే మంత్రం మరొకటి ఉంది.
మధుశ్చ మాధవశ్చ వాసంతికావృతూ
శుక్రశ్చ శుచిశ్చ గ్రైష్మావృతూ
నభశ్చ నభస్యశ్చ వార్షికావృతూ
ఇషశ్చోర్జశ్చ శారదావృతూ
సహశ్చ సహస్యశ్చ హైమంతికావృతూ
తపశ్చ తపస్యశ్చ శైశిరావృతూ
(తైత్తిరీయ సంహత 4-4-11)
ఈ మంత్రంలోని ప్రకారం సహం, సహసం అనే రెండు నెలలూ హేమంత రుతువులో భాగం.
జ్యోతిష శాస్త్రం హేమంత రుతువును ఆధ్యాత్మిక సాధనకు ఉత్తమ కాలంగా పేర్కొన్నది. చంద్రుడు మనః కారకుడు. చంద్రుడు అనుకూలంగా లేకపొతే మంచి ఆలోచనలు కలగవు. మానసిక స్థితి సరైన మార్గంలో ఉండదు. చంద్రుడు అనుకూలించే కాలమైన హేమంతంలో ఆధ్యాత్మిక సాధన ప్రారంభిస్తే శ్రద్ధ బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్ధి చెందుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడికి ఉచ్ఛస్థానం వృషభ రాశి. మృగశిర నక్షత్రం వృషభరాశికి చెందుతుంది. కాబట్టి, చంద్రుడి సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవకార్యాలు మరింతగా చేయాలనే మంచి ఆలోచనలు కలుగుతాయి.
ఆదికవి వాల్మీకి నుంచి ఆధునిక కవుల వరకూ అందరికీ హేమంతం అంటే మక్కువ ఎక్కువ. ప్రత్యేకించి ప్రబంధ కవులు హేమంతాన్ని విడిచిపెట్టిన సందర్భం లేదు. హేమంత వాతావరణం కవులను అంతగా కట్టిపడేసింది. శ్రీరామచంద్రుడికి హేమంతం అంటే ఎంతో ఇష్టమట. వనవాసం చేస్తున్న సమయంలో శరత్కాలం ముగిసి హేమంతం ప్రారంభం కాబోతున్న సమయం అది. సీతతో కలసి వేకువజామున నదీస్నానానికి వెళ్లడానికి రామయ్య సిద్ధపడుతుంటాడు. లక్ష్మణుడు అన్నగారైన రామచంద్రుడిని సమీపించి ‘అన్నా! నీకు ఎంతో ఇష్టమైన హేమంతం ప్రారంభం కాబోతున్నది’ అంటాడు. ఇంకా… ‘అన్నా! ఏ రుతువు వల్ల సంవత్సరం ప్రకాశిస్తుందో, నీకు ఇష్టమైన మాసమేదో, అలాంటి మార్గశిరం, హేమంత రుతువు అయిన మంచుకాలం ఇప్పుడు వచ్చింది కదా! ప్రజలకు దేహం కఠినమైంది. స్నానం చేయడానికి సాధ్యపడకుండా నీటికి పళ్లు వచ్చి కరవసాగింది. పైరుపచ్చలు కాంతితో కళకళలాడుతున్నాయి.
అగ్నిహోత్రుడు గతంలో లాగా కాకుండా ఆప్తుడై ప్రజలను దగ్గరకు రానిస్తున్నాడు. తమకేది మంచిదో తెలుసుకొని కొత్త ధాన్యం రాగానే పాలలో పొంగించి దాన్ని పితృదేవతలకు నివేదించి పాపరహితులు అవుతున్నారు. అన్నా! రాజులు యుద్ధానికి పోవడానికి, గ్రామాలలో ఉండేవారు పాలు, పెరుగు తినడానికి, ఈ మంచుకాలం పనికొస్తుంది కదా? ఆహ్లాదం కలిగించేవాడు కాబట్టి చంద్రుడికి ఆ పేరొచ్చింది. ఇప్పుడా పేరును తనకు వ్యర్థం చేసుకొని, లోకులను సంతోషపర్చడానికి ఆ శక్తిని సూర్యుడికి ఇచ్చాడు. ఆ కారణంతో తపనుడు అనే పేరు సూర్యుడికి వచ్చి చంద్రుడిలాగా అయ్యాడు. (అంటే సూర్యుడు చంద్రుడిలాగా ప్రజలకు సంతోషం కలిగించేవాడయ్యాడు. చంద్రుడేమో మంచు కురవడం వల్ల ప్రజలకు బాధ కలిగించేవాడయ్యాడు)’ అంటూ హేమంత వైభవాన్ని వర్ణించాడు వాల్మీకి.
మాసాల్లో మార్గశిరం తానేనంటూ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్పష్టంగా చెబుతాడు. మార్గశిరంలోనే ధనుర్మాసం మొదలవుతుంది. సర్వ ఏకాదశి, గోవత్స ద్వాదశి, ముక్కోటి ఏకాదశి, మాస శివరాత్రి, సుబ్రహ్మణ్య షష్ఠి, కాలభైరవాష్టమి, గీతాజయంతి, దత్తాత్రేయ జయంతి, రమణమహర్షి జయంతి, హనుమద్ వ్రతం, ఆరుద్ర దర్శన మహోత్సవం.. ఇలా అనేక విశేష పర్వదినాలు మార్గశిర మాసంలోనే వస్తాయి. అన్నిటికీ మించి శ్రీకృష్ణపరమాత్మ తానే అని చెప్పిన మాసమిది. అందువల్లే మార్గశిరం విశిష్టమైంది. మహా దివ్యమైంది. ‘మార్గం’ అంటే దారి, బాట, అన్వేషణ అని అర్థం.
‘శీర్షం’ అంటే తల, మెదడు అని అర్థం. ఈ అర్థాల ప్రకారం పరిశీలిస్తే.. శరీర అవయవాల్లో తల ఏవిధంగా ఉన్నతమైందో, ఆధ్యాత్మిక సాధనకు మార్గశిరం అంతటిదన్న భావన బోధపడుతుంది. ప్రాణులన్నీ దృఢతరంగా, బలవర్ధకంగా ఎదగడానికీ తగిన పరిస్థితులు ఈ మాసంలో ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది. ఈ కాలంలో పొలాల నుంచి ధాన్యం ఇళ్లకు చేరి ప్రజలు సంతోషంగా ఉంటారు. నిర్మలమైన ఆకాశం మాదిరిగా ఈ మాసంలో మనసులు నిర్మలంగా ఉంటాయి.
ఈ కాలంలో భగవంతుడికి నివేదించే వంటలలో పసుపు, ఆవాలు, మెంతులు, మిరియాలు చింతపండు మొదలైన వాటిని విరివిగా వినియోగించాలని పెద్దలు చెబుతారు. చలికాలం కావడం వల్ల ఈ పదార్థాల ద్వారా దేహానికి ఉష్ణశక్తి అందుతుందనే శాస్త్రీయ విజ్ఞానం నివేదనల ద్వారా మనకు అందుతుంది. మొత్తంగా హేమంతం ఆసాంతం మనసుకు ఆహ్లాదాన్ని పంచేదే! ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపజేసేదే!!
ఈ హేమంతము రాకఁ జూచి
రమణీ హేలా పరీరంభ స
త్సాహాయ్యంబునఁ గాని
దీని గెలువన్ శక్యంబుగా దంచుఁ దా
రూహాపోహవిధిం ద్రిమూర్తులు
సతీ యుక్తాంగులైనారు గా
కోహో! వార లదేమి
సంతతవధూయోగంబు రాఁ గందురే?
హేమంత రుతువు కారణంగా చలి తీవ్రత పెరిగింది. చలి శత్రువును జయించాలంటే తమ భార్యల తోడు తప్పనిసరి అని భర్తలు భావిస్తున్నారు. ఈ కారణంగానే త్రిమూర్తులు త్రిశక్తుల్ని విడిచిపెట్టడం లేదు. హేమంతం తోడు లేకపోతే ఇది సాధ్యమయ్యే పనేనా? అంటూ చమత్కరిస్తాడు.
…? డా॥ కప్పగంతు రామకృష్ణ