తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలు (Brahmotsavams ) తిరుమలలో కన్నుల పండువగా జరుగుతున్నాయి. స్వామివారిని ఒక్కోరోజు ఒక్కో రకంగా ఆలంకరి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. శనివారం శ్రీవారి ఆలయంలో డ్రైఫ్రూట్లు (Dry fruits) , రోజామాలల ( Rose Flowers) అలంకారంతో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది.
ఆలయంలోని రంగనాయకుల మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రకాల ఫలాలు, పుష్పాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అందంగా అలంకరించారు. బాదం, పిస్తా, కుంకుమపువ్వు, వట్టివేరు, పసుపు కొమ్ములు, ఎండు ద్రాక్ష, యాలకులు, తులసి, రోజామాలలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించారు. వివిధ రంగుల పుష్పాలు, ఫలాలు, సాంబ్రాణి, ధూపదీప నైవేద్యాలతో పూజలు నిర్వహించారు.
పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు కొబ్బరినీళ్లు తదితర సుగంధద్రవ్యాలతో అభిషేకం చేశారు. వేదపండితులు చతుర్వేదపారాయణం ఆలపించారు. బ్రహ్మోత్సవాల సమయంలో వాహనసేవల్లో తిరువీధుల్లో ఊరేగి అలసిపోయే స్వామివారు స్నపనతిరుమంజనంతో సేద తీరుతారని ఆలయ అర్చకులు తెలిపారు. కంకణభట్టర్ వేణుగోపాలదీక్షితులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చిన్నజీయంగార్, టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.