బంజారాహిల్స్, ఫిబ్రవరి 22: జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. డివైడర్‌ను ఢీకొట్టి గాల్లోకి ఎగిరి రోడ్డుకు అవతలివైపు వెళ్తున్న కార్లపై పడడంతో రెండు కార్లు, ఓ బైక్ ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ప్రమాదానికి కారణమైన కారులోని ఇద్దరితో సహా మొత్తం ఐదుగురు గాయాలపాలయ్యారు.
జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి ఈమని క్రాంతిరెడ్డి తన భార్య శిరీషతో కలిసి కొండాపూర్‌లో పెళ్లికి హాజరయ్యేందుకు ఆదివారం ఉదయం తమ కారులో జూబ్లీహిల్స్ రోడ్ నం. 45 మీదుగా కేబుల్ బ్రిడ్జివైపునకు వెళ్తున్నారు. బ్రిడ్జికి సమీపంలోకి రాగానే రోడ్డుపై వెళ్తున్న ఓ కారును ఎడమవైపు నుంచి ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి.. బీభత్సం సృష్టించింది. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రమాదానికి కారణమైన క్రాంతిరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.