Cold And Cough | దగ్గు, జలుబు అనేవి సీజన్లు మారినప్పుడల్లా మనకు వస్తూనే ఉంటాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి సీజన్లు మారకున్నా తరచూ ఈ సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తుంటారు. వాతావరణంలో వచ్చే మార్పులతోపాటు కాలుష్యం, పలు ఇతర కారణాల వల్ల కూడా దగ్గు, జలుబు సమస్యలు మనల్ని అవస్థలకు గురి చేస్తుంటాయి. అయితే ఈ సమస్యలకు చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడుతుంటారు. కానీ ఇంగ్లిష్ మెడిసిన్‌ను తరచూ వాడడం వల్ల దీర్ఘకాలంలో అనేక సమస్యలు వస్తాయి. అనేక సైడ్ ఎఫెక్ట్స్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో పలు వ్యాధులు సైతం వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక ఇంగ్లిష్ మెడిసిన్‌ను ఎక్కువగా వాడకూడదు. మరి ఆయా సమస్యల నుంచి ఎలా బయట పడాలి అని చాలా మందికి సందేహం వస్తుంటుంది. కానీ అందుకు ఆయుర్వేదంలో చక్కని పరిష్కారాలు ఉన్నాయి. పలు ఇంటి చిట్కాలను పాటించడం వల్ల ఆయా సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు. పైగా వాటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇక ఆ ఇంటి చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
దగ్గు, జలుబు వంటి సమస్యలు ఉన్నప్పుడు రోజూ 2 లేదా 3 సార్లు హెర్బల్ టీలను సేవిస్తుండాలి. అల్లం, తులసి, కమోమిల్, పెప్పర్మింట్ వంటి హెర్బల్ టీలు ఆయా సమస్యల నుంచి త్వరగా బయట పడేలా చేస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఇన్ ఫెక్షన్లను త్వరగా తగ్గిస్తాయి. దీంతో దగ్గు, జలుబుతోపాటు ముక్కు దిబ్బడ నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. వేడి వేడి చికెన్ లేదా వెజిటబుల్ సూప్‌ను తాగుతున్నా కూడా ఎంతగానో ఉపయోగం ఉంటుంది. దీని వల్ల కఫం త్వరగా కరిగిపోతుంది. దగ్గు, జలుబు తగ్గుతాయి. ఇక ఈ సమస్యలను తగ్గించడంలో తేనె కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభించేలా చేస్తాయి. ఒక టీస్పూన్ తేనెను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు 2 సార్లు లేదా 3 సార్లు తాగుతుంటే ఫలితం ఉంటుంది. అవసరం అయితే అందులో నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.
అల్లంలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి గొంతు సమస్యలను తగ్గిస్తాయి. వికారం నుంచి బయట పడేలా చేస్తాయి. వైరస్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. అల్లంను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను వడకట్టి అందులో కాస్త తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. లేదా నేరుగా ఒక టీస్పూన్ అల్లం రసాన్ని కూడా తాగవచ్చు. ఇలా రోజుకు 2 లేదా 3 సార్లు చేస్తుంటే ఫలితం ఉంటుంది. ఇక వెల్లుల్లిలో ఆల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటుంది. కనుక దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. ఇందుకు గాను 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను తీసుకుని కాస్త నలిపి అందులో కాస్త తేనె కలిపి నేరుగా అలాగే తినేయాలి. లేదా వెల్లుల్లి రసాన్ని కూడా తాగవచ్చు. ఇలా రోజుకు 2 సార్లు చేస్తుంటే ఉపయోగం ఉంటుంది.
పసుపు, మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడిలలో దేన్నయినా సరే పాలలో కలిపి తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. వీటిల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి. దగ్గు, జలుబు నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. నారింజ, నిమ్మ వంటి సిట్రస్ జాతికి చెందిన పండ్లను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. వీటిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీని వల్ల దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ పండ్లను తేనెతో కలిపి తింటే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. ఇలా ఆయా ఇంటి చిట్కాలను పాటిస్తే దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. పైగా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.