Brahmotsavams 2025 | తిరుమల క్షేత్రంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం ఉదయం మలయప్పస్వామి దర్శనం భక్తులను కట్టిపడేసింది. ఉదయం జరిగిన వాహన సేవలో మలయప్పస్వామి వారు అద్భుతమైన మోహినీ అలంకారంలో, సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. స్వామివారి పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు కూడా అలంకృతుడై భక్తులకు అభయం ఇచ్చారు. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించడానికి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో నాలుగు మాడ వీధుల్లో స్వామివారిని అనుసరించారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ వాహన సేవలో పెదజీయర్ స్వామి, చినజీయర్ స్వామి, తితిదే (TTD) ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లోనే అత్యంత విశిష్టమైన, భక్తులు ఆసక్తిగా ఎదురుచూసే శ్రీవారి గరుడ వాహనసేవ ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. గరుడోత్సవాన్ని తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో, తితిదే, పోలీసు అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.