Telangana | కుభీర్, సెప్టెంబర్ 28 : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు గందరగోళానికి దారి తీశాయి. మండలంలోని ఫకీర్ నాయక్ తండా, దావూజీ నాయక్ తండా రెండింటిలో 100 శాతం గిరిజనులు ఉన్నారు. అయినప్పటికీ రిజర్వేషన్ మాత్రం బిసి జనరల్‌కు కేటాయించారు. ఈ పరిణామం గిరిజన తండావాసులను విస్మయానికి గురిచేసింది. ఒక్కరంటే ఒక్కరు కూడా బీసీలు లేని గిరిజన తండాల జీపిలకు బీసీ రిజర్వేషన్ కేటాయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫకీర్ నాయక్ తండాలో 1483 మంది గిరిజన జనాభా ఉంది. దావూజీ నాయక్ తండాలో జనాభా 830 గిరిజనులు, 563 ఓటర్లు ఉన్నారు. ఏ ప్రాతిపదికన ఒక్కరు కూడా బీసీలు లేని గిరిజన తండాల జీపీలలో బీసీ రిజర్వేషన్ రావడం పట్ల ఆ గిరిజన గ్రామాల ప్రజలు ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం గిరిజనులు అభివృద్ధిలోకి రావాలని దృఢ సంకల్పంతో టిఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన తండాలను జీపీలుగా ఏర్పాటు చేసి నాయకులుగా ఎదిగేందుకు తమకు అవకాశం కల్పించిన కేసీఆర్ ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ సమస్యపై స్పందించి వెంటనే ఎస్టీ రిజర్వేషన్‌ను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో గిరిజన నాయకులు, గిరిజనులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్షకు వెనుకాడేది లేదని మాజీ సర్పంచ్ గోపీచంద్ జాదవ్, నాయకులు పండిత్ జాదవ్, రాథోడ్ కంంటేష్, ఆ గ్రామాల ప్రజలు హెచ్చరించారు.
కేసీఆర్‌ను ఆరాధిస్తాం : పండిత్ జాదవ్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గిరిజనులు ఎప్పుడు మర్చిపోలేరు. గిరిజన తండాలను జీపీలుగా ఏర్పాటు చేసి గ్రామస్థాయి నుండి ఎందరో గిరిజనులను నాయకులుగా, ప్రజా ప్రతినిధులుగా అవకాశం కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. కన్ను తప్పి లొట్టబోయిన చందంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులను తుంగలో తొక్కేందుకు ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు ఎన్ని జరిగాయో పునః సమీక్షించుకుని గిరిజనులకు అన్యాయం జరగకుండా చూడాలని హెచ్చరిస్తున్నట్లు గిరిజన నాయకుడు పండిత్ జాదవ్ పేర్కొన్నారు.