తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో (Tirumala Brahmotsavam) ఐదో రోజు ఆదివారం ఉదయం శ్రీ మలయప్పస్వామి మోహినీ రూపంలో ( Mohini Avataram ) దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. వాహనసేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.ఆదివారం సాయంత్రం సాయంత్రం 6:30 గంటలకు గరుడవాహనంపై మలయప్పస్వామి దర్శనమిస్తారని అర్చకులు వివరించారు.