e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News ఈ ఏకాద‌శిని ముక్కోటి ఏకాద‌శి అని ఎందుకు పిలుస్తారు? పుష్య మాసంలో వ‌చ్చే ఏకాద‌శి ప్ర‌త్యేక‌త ఏంటి?

ఈ ఏకాద‌శిని ముక్కోటి ఏకాద‌శి అని ఎందుకు పిలుస్తారు? పుష్య మాసంలో వ‌చ్చే ఏకాద‌శి ప్ర‌త్యేక‌త ఏంటి?

Mukkoti ekadasi | ధనుర్మాస వేళ.. ఆధ్యాత్మిక వైభవాన్ని రెండింతలు చేసే పర్వదినం ముక్కోటి ఏకాదశి. మహావిష్ణువు దర్శనం కోసం ముక్కోటి దేవతలు వేచి ఉండే పుణ్యదినం. ఉత్తర ద్వారం నుంచి పురుషోత్తముణ్ని దర్శించుకునే అద్భుతమైన రోజు ఇది. మహావిష్ణువు తేజం నుంచి ఆవిర్భవించిన ఏకాదశి, ఆ శేషశాయి విశేష రూపాన్ని కళ్లారా చూడమంటున్నది. ఈ సందర్భంగా.. ముక్కోటి ఏకాదశి పర్వదినం పూర్వాపరాలు తెలుసుకుందాం.

Mukkoti ekadasi
Mukkoti ekadasi

ఏడాదికి పన్నెండు నెలలు. నెలకు రెండు ఏకాదశులు. దేని విశిష్టత దానిదే! ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో ప్రత్యేకమైనది ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఏకాదశి పర్వదినాన్ని చాంద్రమానం ఆధారంగా చేసుకుంటారు. ముక్కోటి ఏకాదశిని మాత్రం సౌరమానం ప్రాతిపదికన చేసుకోవడం విశేషం. సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా చేసుకోవడం సంప్రదాయం. ఈ పర్వదినం మార్గశిర మాసంలో గానీ, పుష్య మాసంలో గానీ వస్తుంటుంది. ఈసారి పుష్య మాసంలో వచ్చింది.

- Advertisement -

దేవతలకు ఉత్తరాయణం పగటి సమయంగా, దక్షిణాయనం రాత్రివేళగా పేర్కొంటారు. ఉత్తర-దక్షిణాయనాలకు సంధిలో వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ సమయంగా అభివర్ణిస్తారు. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చే శుక్ల ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఆ రోజు దేవతలంతా వైకుంఠానికి వెళ్లి ఉత్తర ద్వారం నుంచి వైకుంఠనాథుడిని దర్శనం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని పొందడం కోసం వైష్ణవ ఆలయాల్లో వైకుంఠంతో సమానమైన రత్న మందిరాన్ని నిర్మించి, ఉత్తర దిక్కుగా స్వామిని దర్శించి తరిస్తారు. ఉత్తర ద్వార దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు వేచి ఉంటారు. మోక్ష ద్వారంగా చెప్పే ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకోవడంతో తమ జన్మ పునీతమైందనే అనుభూతికి లోనవుతారు.

రావణుడి చెర నుంచి విముక్తి

కృత్వోత్సవం తథాభూతం ఏకాదశ్యాం విశేషతః
విశంతి మోక్షం తస్మాత్‌ సః మోక్షోత్సవ ఇతీర్యతే
ఈ ఉత్సవానికి మోక్షోత్సవమనే పేరు కూడా ఉంది. దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలవడం వెనుక కూడా ఒక పౌరాణిక గాథ ప్రచారంలో ఉంది.

త్రింశత్‌ కోటిసురైస్సాకం బ్రహ్మా వైకుంఠమాగతః
పౌలస్త్యేన నిపీడితాః సురగణాః
వైకుంఠలోకం యయుః
ద్వారే తత్ర విషాదభావమనసాః
సూక్తైః హరిం తుష్టువుః


రావణుడితో పీడితులైన ముక్కోటి దేవతలను వెంట బెట్టుకొని బ్రహ్మదేవుడు విష్ణువు దర్శనం కోసం వైకుంఠానికి తీసుకెళ్లింది వైకుంఠ ఏకాదశి నాడే అని చెబుతారు. ముక్కోటి దేవతలు మహావిష్ణువును స్తుతించి, ఆయన అనుగ్రహాన్ని పొందిన రోజు కావడంతో దీనికి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది.

విష్ణువు తేజస్సు ఏకాదశి

ఏకాదశి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిథిగా చెబుతారు. దీని వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ముర అనే రాక్షసుడితో విష్ణుమూర్తి యుద్ధం చేశాడు. యుద్ధ సమయంలో అలసిపోయిన విష్ణువు కాసేపు నిద్రిస్తాడు. ఇదే అదునుగా విష్ణువును సంహరించడానికి మురాసురుడు ప్రయత్నిస్తాడు. అప్పుడు విష్ణువు దేహం నుంచి ఓ దివ్యతేజస్సు ఆవిర్భవించి, ఆ రాక్షసుణ్ని సంహరిస్తుంది. ఆ రోజు ఏకాదశి కావడంతో, విష్ణుమూర్తి తన తేజస్సును ఏకాదశి అని సంబోధించాడు. తన దేహం నుంచి ఉద్భవించి తనను రక్షించిన ఏకాదశితో మహావిష్ణువు..
‘మమ భక్తాశ్చ యే లోకాః తవ భక్తాశ్చ యే నరాః
త్రిషు లోకేషు విఖ్యాతాః ప్రాప్స్యంతి మమ సన్నిధిం’ అంటాడు. అంటే ఎవరు తనను, ఏకాదశీ దేవిని ఆరాధిస్తారో వాళ్లు ముల్లోకాల్లో కీర్తిని, చివరగా మోక్షాన్ని పొందుతారని వరం ఇస్తాడు. ఏకాదశిని ఆరాధించడం అంటే, ఆ రోజున ఉపవాసం చేయడమే. ఏకాదశి రోజున భోజనం చేస్తే పాపాన్ని ఆహారంగా తీసుకున్నట్లే అని బ్రహ్మాండపురాణం చెబుతుంది.

Mukkoti ekadasi
Mukkoti ekadasi

ఇహపర సుఖాలు..

లౌకిక జీవితంలో అలౌకికమైన ఫలితాలు పొందడానికి ఏకాదశి వ్రతం ఆచరించడం కన్నా మార్గంలేదు. మహాభారత సంగ్రామం తర్వాత ధర్మరాజును కలుసుకుంటాడు శ్రీకృష్ణుడు. యుద్ధం వల్ల కలిగే పాపాలను తొలగించి, ఇహపర సుఖాలను ప్రసాదించే ఏకాదశి వ్రత అనుష్ఠానాన్ని తెలియజేస్తాడు.

వ్రతేకృతే కులస్థేన యేన కేన నరేణ వా
తద్వంశ జాశ్చతే సర్వేవిష్ణులోకం
యయుస్తదా (బ్రహ్మాండ పురాణం)

వంశంలో ఒక్కరు ఏకాదశి వ్రతాన్ని
ఆచరించినా ఆ వంశంలోని వారంతా సమస్త సుఖాలతోపాటు మహావిష్ణువు అనుగ్రహం పొంది, విష్ణు లోకానికి చేరగలరని చెబుతాడు. ఇలాంటి మహోన్నతన ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలని సూచిస్తాడు.

ఆరోగ్య ప్రదం

ఏకాదశీ సమం కించిత్‌
పాపత్రాణం న విద్యతే
స్వర్గమోక్షప్రదాహ్యేషా రాజపుత్ర ప్రదాయినీ
సుకళత్ర ప్రదాహ్యేషా
శరీరారోగ్యదాయినీ

శుక్ల, కృష్ణ పక్షాలలో నెలకు రెండుసార్లు ఏకాదశి నాడు ఉపవాస దీక్షను, భగవన్నామ సంకీర్తనంతో చేయమని ఉపదేశించాడు వశిష్ఠ మహర్షి. దీనివల్ల రాజ్యం, ధనం, భార్యాపిల్లలు, పరిపూర్ణ ఆరోగ్యం లభించడమే కాక, చివరగా జ్ఞాన సాధన ద్వారా మోక్షాన్ని పొందుతారని పేర్కొన్నాడు. పక్షం రోజులకు ఒకసారి ఉపవాసం చేయడం ఆరోగ్యప్రదమని వైద్యశాస్త్రం కూడా సమర్థిస్తున్నది. వైద్యశాస్త్ర సలహాను లౌకికంగా అనుసరించకుండా, దానిని భక్తిమార్గంతో సమన్వయపరచి, అనుసరించినట్లయితే.. ఇటు ఆరోగ్యాన్ని, అటు భగవంతుడి అనుగ్రహాన్ని పొందవచ్చు.

పుష్య మాసంలో వచ్చే ఏకాదశిని ‘పుత్రదా’ ఏకాదశి అని కూడా పిలుస్తారు. భద్రావతి నగరాధిపతి సుకేతుమాన్‌, శైబ్య అనే దంపతులకు సంతానం ఉండదు. విశ్వేదేవతల ఆదేశంతో, భవిష్యోత్తర పురాణంలోని ప్రమాణాన్ని అనుసరించి పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి సంతానాన్ని పొందుతారు.

మానవుడికి మొత్తం పదకొండు ఇంద్రియాలు. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మరొకటి అంతరింద్రియం వెరసి పదకొండు. వీటిపై నిగ్రహం లేకపోవడం వల్లే మనుషులు పాపకర్మలను ఆచరించి అధోగతి పాలవుతున్నారు. ఉపవాసం వల్ల పదకొండు ఇంద్రియాల పాపాలు తొలగిపోతాయి. కాబట్టి ఈ పుణ్యతిథికి ఏకాదశి అని పేరు వచ్చింది.


– శాస్త్రుల వేంకటేశ్వరశర్మ, 98499 09165

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

Abhishekam |అభిషేకం వేటితో చేస్తే శివుడికి ప్రీతిక‌రం.. పాల‌తోనా? పెరుగుతోనా?

కాలం ముందు ఆ శివుడు అయినా లోబడి ఉండాల్సిందే.. ఇదే అందుకు నిద‌ర్శ‌నం

అమ్మవారికి నిమ్మకాయల హారం వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి?

దానధర్మాలు ఎందుకు చేయాలి?

అయ్య‌ప్ప ద‌ర్శ‌నానికి స్వాములు ఇరుముడి ఎందుకు తీసుకెళ్తారు?

మొండి రోగాల‌ను న‌యం చేసే వైద్య‌నాథుడి ఆల‌యం.. ఎక్క‌డో తెలుసా !

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement