తల్లి వెచ్చని పొత్తిళ్లు శిశువుకు స్వర్గం కన్నా మిన్న. పురిటి నొప్పులు అనుభవించి బిడ్డను కన్న తల్లి.. ఆ చిన్నారికి పాలుపడుతూ తన ప్రసవ వేదననంతా మర్చిపోతుంది. తల్లి పాలు తాగడం బిడ్డల జన్మ హక్కుగా పేర్కొంటుంది ఖురాన్. ‘తల్లులు తమ బిడ్డలకు రెండు సంవత్సరాలు పాటు పాలు పట్టాలి’ అని ఖురాన్ (2:233) ఉపదేశించింది. పాలు పట్టే తల్లులకూ ఖురాన్ ప్రత్యేక హక్కులు కల్పించింది. బిడ్డకు పాలిచ్చేటప్పుడు పవిత్ర భావాలను నింపుకోవాలని ఉలమాలు బోధిస్తారు. మహనీయుల తల్లులు నమాజుకు ముందు పారిశుద్ధ్యాన్ని (వుజూ) పాటించినట్లుగానే తమ బిడ్డకు పాలు పట్టేటప్పుడూ పాటించేవారని చెబుతారు. ‘బిస్మిల్లాహ్’ పఠించి శిశువుకు పాలుపట్టాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఉత్తమ నైతిక విలువలు అలవడతాయి.
‘నువ్వు పిల్లాడికి పాలు పట్టేటప్పుడు ప్రేమ, ఆప్యాయతలు కురిపించాలి. పాలిచ్చే శక్తినిచ్చినందుకు అల్లాహ్కు కృతజ్ఞతలు తెలపాలి’ అని ఉమర్ బిన్ అబ్దుల్లాహ్ తన సతీమణితో చెప్పేవారు. తల్లి పాలు చాలకపోతే ఇతర తల్లుల పాలూ పట్టేందుకు షరీయత్ అనుమతిస్తుంది. ప్రవక్త కాలంలో తమ శిశువులకు పాలుపట్టేందుకు పల్లెసీమల తల్లులకు ఇచ్చేవారు. ముహమ్మద్ ప్రవక్త (స)కు దాయీ హలీమా అనే మాతృమూర్తి పాలిచ్చి పెంచింది. ముహమ్మద్ ప్రవక్త (స) జీవితాంతం ఆమెను ఎంతగానో ఆదరించారు.
ఒకానొకసారి ముహమ్మద్ ప్రవక్త (స) తమ సహచర మిత్రులతో కలిసి కూర్చున్నారు. అంతలోనే ఒక మహిళ అటుగా వచ్చారు. వెంటనే ప్రవక్త (స) లేచి నిలబడి తన భుజంపై ఉన్న తువ్వాలును పరిచి ఆమెను కూర్చోబెట్టారు. కాసేపు మాట్లాడాక ఆమె అక్కణ్నుంచి వెళ్లిపోయారు. చుట్టూ ఉన్నవారంతా ప్రవక్త ప్రవర్తన పట్ల ఆశ్చర్యపోయారు. ఆమె వెళ్లాక ఆమె ఎవరని అడగ్గా ‘ఆమె నాకు పాలిచ్చిన తల్లి’ అని చెప్పారు. పాలిచ్చే తల్లులకు విధిగా పాటించే రమజాన్ ఉపవాసాల నుంచి మినహాయింపు ఇచ్చారు అల్లాహ్. పిల్లాడు పాలు మానిన తర్వాత ఆ ఉపవాసాలు చేయాల్సి ఉంటుంది.
– ముహమ్మద్ ముజాహిద్ 96406 22076