నర్సింహులపేట, నవంబర్ 24 : చీరల పంపిణీకి వచ్చిన డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ జాటోత్ రామచంద్రునాయక్పై పలువురు మహిళలు ప్రశ్నల వర్షం కురిపించారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి రామచంద్రునాయక్ హాజరు కాగా, గ్యాస్ సబ్సిడీ పైసలు, వితంతు పింఛన్ రావడం లేదని పలువురు మహిళలు నిలదీశారు. దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పింఛన్ ఆరునెలల తర్వాత వస్తుందని, ఉచిత బస్సు సౌకర్యంతో నెలకు కనీసం నాలుగుసార్లు అటూ ఇటూ తిరుగితే మహిళకు రూ. వెయ్యి, గవర్నమెంట్ ఆఫీసర్లకు రూ. 3వేలు మిగులుతుందని వెటకారంగా తెలిపారు. కాగా, చీరల పంపిణీలో కూర్చునేందుకు కుర్చీలు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఎమ్మెల్యేను ప్రశ్నించిన బుచ్చమ్మ
బుచ్చమ్మ : మా ఆయన చనిపోయి ఏండ్లవుతున్నా పింఛన్ రాలే
ఎమ్మెల్యే : ఆరు నెలల టైం పడుతుంది..
బుచ్చమ్మ : ఉన్నోళ్లకే వస్తుంది.. మొగుడు సచ్చినోళ్లకు పింఛన్ రాదా సార్?
ఎమ్మెల్యే : చెప్పేది విను అవ్వా. ప్రభుత్వం ఆన్లైన్ యాప్ చేయలేదు. ఉన్నోళ్లకు రాదు?
బుచ్చమ్మ : మొగుడు చనిపోయి ఇన్ని రోజులైంది. ఇప్పటి వరకు రావద్దా సార్?
ఎమ్మెల్యే : అట్లా లేదు నాకు చూపించు నేను మాట్లాడతా.. దీంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుడు సైగ చేయడంతో బుచ్చమ్మను మరో మహిళ అక్కడి నుంచి వెనుకకు తోసింది.