ఒక ఊర్లో ఓ పాల వ్యాపారి ఉండేవాడు. చుట్టుపక్కల ఉన్న పశువుల యజమానుల దగ్గరికి వెళ్లి పాలు సేకరించి పట్టణానికి పంపేవాడు. దానిద్వారా అతనికి మంచి ఆదాయం వచ్చేది. చాలా ఆస్తులు సంపాదించాడు. కానీ, అతనికి ఏమాత్రం సంతృప్తి ఉండేది కాదు. ‘జరిగిపోయిన కాలంలో నేను అది చేసి ఉంటే బాగుండు, ఇది చేసి ఉంటే బాగుండు’ అని ఎప్పుడూ తనను తాను నిందించుకునేవాడు. ఒకరోజు ఆ ఊరికి ఓ ఆధ్యాత్మిక గురువు వచ్చాడు. ఊరిజనమంతా ఆయన చుట్టూ చేరి తమ సందేహాలను నివృత్తి చేసుకోసాగారు. తమ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోసాగారు. పాల వ్యాపారి కూడా అక్కడికి వెళ్లాడు. తాను ఇరవై ఏండ్లుగా పాల వ్యాపారం చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు.
‘మంచి ఆదాయం ఉన్నా.. నేను ఆ సమయంలో ఆస్తులు సమకూర్చే పనులు చేయలేకపోయాను. అప్పట్లో కొంత బంగారం కొనిపెట్టి ఉంటే బాగుండేది. కొన్ని స్థలాలు తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది. అలా కొన్న నా మిత్రులంతా ఇప్పుడు కోటీశ్వరులయ్యారు’ అని బాధగా చెప్పాడు. ‘జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? గతం గురించి చింతించి ప్రయోజనం లేదు.వదిలేయ్ అని సలహా ఇచ్చాడు’ గురువు. ‘వెనక్కి తిరిగి చూసుకోకపోతే ఎలా? నేను ఆ కాలాన్ని సరిగా వినియోగించుకోక పోవడం వల్లే ఎంత నష్టపోయానో మీకు తెలియదు’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు పాలవ్యాపారి.
‘నువ్వు పల్లెలకు వెళ్లి పాలు సేకరించి తీసుకుని వచ్చేటప్పుడు పాలు ఒలికిపోతే ఏం చేస్తావు?’ అని అడిగాడు. ‘ఒలికిపోయిన పాలను చూస్తూ ఏడ్చే రకం కాదు నేను. ఆ దగ్గర పల్లెల్లో ఆవులు ఉన్నవాళ్లను వెతికి వేరే పాలు తెచ్చుకుంటాను’ అని బదులిచ్చాడు. ‘ఒలికిపోయిన పాలను ఎందుకు ఎత్తుకోవు?’ అని అడిగాడు గురువు. ‘నేల మీద ఒలికిపోయిన పాలు దేనికీ పనికి రావు. అందుకని నేను వాటిని తీసుకోను’ అన్నాడు. ‘గడిచిన కాలం కూడా అంతే. దాని గురించి వగచి లాభం లేదు. అది ఎప్పటికీ తిరిగిరాదు. అయినా సంపద, వస్తువులు నీకు శాశ్వత ఆనందాన్ని ఇవ్వవు. ఆధ్యాత్మికత నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. ఆ మార్గాన్ని అనుసరించు’ అని హితవు చెప్పాడు.