నీడనిచ్చే చెట్టును ఈసడించుకునే వారు ఎవరైనా ఉంటారా? ప్రభువు కూడా మహావృక్షం లాంటి వాడే. ఆయన దిగొచ్చింది.. ప్రేమను ప్రబోధించడానికి కాదు! అనుభవంలోకి తీసుకురావడానికి. ప్రభువు మానవుడిగా రావడానికి కారణం.. మనిషిని మనిషిగా మార్చడానికి. ఆ మారిన మానవుణ్ని మహోన్నతుడిగా తీర్చిదిద్దడానికి. అలా తీర్చిదిద్దిన వాడిని తనతో సమానుడిగా నిలబెట్టడానికి. ఇందులో ఎలాంటి సంశయానికీ తావు లేదు. తనయుణ్ని తనంతవాణ్ని చేయాలని ఏ తండ్రికి మాత్రం ఉండదు? ఆయన బోధనలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తాయి.
అందులోనే త్యాగం, సేవ, నీతి ఒకటేమిటి అన్నీ నిబిడీకృతమై ఉన్నాయి. మానవుణ్ని భద్రంగా చేర్చి సుఖవంతంగా కూర్చోమని చెప్పిన వృక్షం ఇదే మరి! ఈ నీడలో కూర్చుంటే మనిషి మనసు ఆహ్లాదంగా, స్వేచ్ఛగా ఎంత ఆనందిస్తుందో అనుభవిస్తే గానీ తెలియదు! అది సాదాసీదా మాను కాదు. కొండపై సాటి మానవుడి కోసమై ప్రాణాలు విడిచి సజీవంగా నిలిచిన మహావృక్షమది. ఆ చెట్టు నీడలో సదా సేదతీరుదాం!