మన పొరుగు వారు కేవలం చిరునామాలు కాదు. వారు మన బాధ్యతలు. ఈ విలువను తన జీవనశ్వాసగా మార్చుకున్న అసాధారణ వ్యక్తి ఇమామ్ అబూ హనీఫా. ఆయన జీవితం రెండు విభిన్న ధ్రువాల మధ్య నిత్య పోరాటంగా సాగింది. ఒకవైపు, ఇమామ్ అర్ధరాత్రి చీకటిని చీల్చుతూ తహజ్జుద్ నమాజులో దైవంతో ఏకాంత సంభాషణలో నిలబడేవారు. మరోవైపు, సరిగ్గా ఆయన గోడ పక్కనే, ఆయన పొరుగువాడు మద్యం మత్తులో, పాటలతో రాత్రి నిశ్శబ్దాన్ని భంగం చేసేవాడు. ఆ శబ్దం ఒక నిత్య బాధ! ఆ అలజడి ఏకాగ్రతను చెదరగొట్టే ఒక పరీక్ష. ఈ పరిస్థితిలో ఎవరైనా ఏం చేస్తారు? కోపంగా ఫిర్యాదు చేస్తారు, మందలిస్తారు, ద్వేషిస్తారు. కానీ ఇమామ్ అబూ హనీఫా ఓర్పును, కరుణను తన ప్రార్థనలో భాగం చేసుకున్నారు.
ఓ రాత్రి గదిలో ఆవరించిన అసాధారణ నిశ్శబ్దం ఇమామ్ గుండెల్లో ఆందోళనను పెంచింది. ఆయనకు నిద్ర పట్టలేదు. తన ఏకాగ్రతను భంగపరిచే ఆ మనిషి లేకపోవడం, ఆయనకేదో లోటుగా, భారంగా అనిపించింది.
విచారిస్తే… ఆ తాగుబోతును జైలుకు తీసుకెళ్లారని తెలిసింది. హుటాహుటిన, ఎలాంటి అహంకారం లేకుండా, ఇమామ్ అబూ హనీఫా స్వయంగా జైలు గుమ్మం దగ్గరికి వెళ్లారు. పాలకుడు ఆశ్చర్యంతో: ‘ఏం పని ఇమామ్ గారూ? మీరు ఎక్కడ ఉండవలసినవారు? మీరు వచ్చింది ఎవరి కోసం?’ అని అడిగారు. ఇమామ్ అబూ కండ్లు ఆ పొరుగువాడి కోసం వెతికాయి. ఆయన స్వరం ప్రేమతో, విశ్వాసంతో ఇలా పలికింది.. ‘అతను నా పొరుగువాడు. అతని కోసం వచ్చాను’ అన్నాడు. పాలకుడు తక్షణమే అతన్ని విడుదల చేశాడు. జైలు గోడల నుంచి విడుదలైన ఆ మనిషి, ఇమామ్తో ఇంటికి తిరిగి వచ్చాడు. ఆశ్చర్యంతో, పశ్చాత్తాపంతో ఆయన కాళ్లపై పడి ‘నేను మీకు కష్టమే కలిగించాను. నా ప్రవర్తన మిమ్మల్ని బాధించింది. అయినా నాకోసం ఇంత గొప్ప మేలు చేశారు?’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇమామ్ అబూ అతని భుజంపై చేయి వేసి పలికిన మాటలు మన హృదయాలపై శాశ్వత ముద్ర వేస్తాయి. ‘నీవు నా పొరుగువాడివి. నీకు నాపై హక్కులు ఉన్నాయి. నేను వాటిని ఎప్పుడూ విస్మరించలేను’ అని అతన్ని అనునయించాడు. ఆ రాత్రి, ఆ ఒక్క మంచి మాట, ఆ కరుణామయ స్పర్శ, ఒక దుష్టుడి గుండెను కడిగేసింది.
ఆ మనిషి పశ్చాత్తాపంతో కన్నీరు పెట్టుకుని, అల్లాహ్ వైపు తిరిగాడు. ‘చూశారా? ద్వేషం కాదు.. నింద కాదు.. కేవలం కరుణ మాత్రమే ఒక మనిషిని
మార్చగలిగింది’….?
-ముహమ్మద్ ముజాహిద్
96406 22076