శనివారం 06 మార్చి 2021
Devotional - Jan 26, 2021 , 00:16:11

శ్రవణమే పుణ్యప్రదం!

శ్రవణమే పుణ్యప్రదం!

శృణ్వతాం స్వకథాః కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః

హృద్యన్తఃస్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్సతామ్‌

- శ్రీమద్భాగవతం (1.2.17)

‘సత్యశీలుడైన భక్తునిపై సుహృదయుడైనవాడు, సమస్త జీవుల హృదయాల్లో పరమాత్మగా ఉన్న ఆ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు తన కథలను వినాలనే ఉత్సాహం కలిగిన భక్తుని హృదయంలోని భౌతిక భోగవాంఛలన్నిటినీ తుడిచివేస్తాడు. ఆ భగవంతుని లీలలను శ్రవణం, కీర్తనం చేసిన మాత్రాననే అదెంతో పరమ పుణ్యప్రదమవుతుంది’. భక్తి మార్గంలోని ద్వాదశ మహాజనులలో ఒకరైన ప్రహ్లాదుడు భక్తిసాధనలోని తొలి అంగమైన ఈ కృష్ణకథా ‘శ్రవణం’ ప్రాముఖ్యాన్ని వివరించాడు. ‘భగవద్గీత’ లేదా ‘శ్రీమద్భాగవతం’ ప్రకారం, శ్రీకృష్ణుని లీలలను వినటం అత్యంత పుణ్యప్రదం. దానిని విశుద్ధ భక్తుల నుంచి మాత్రమే వినాలి. ప్రామాణికమైన ఆధారం నుంచి ‘కృష్ణకథా శ్రవణం’ చేసే భక్తునిపై దేవదేవుడు మిక్కిలి ప్రసన్నుడవుతాడు. అలాంటి భక్తుల హృదయాల్లోని అశుభకారకాలైన ప్రవృత్తులన్నిటినీ ఆయన తుడిచివేస్తాడు. ఫలితంగా వారి మదిలో ప్రశాంతత వెల్లివిరుస్తుంది.

‘ఎవరైతే తమ ఆశ్రమ స్థితుల్లో నిలిచి ఉన్నవారై జ్ఞాన విధానాన్ని పరిత్యజించి తనువు, వాక్కు, మనస్సుతో నీ రూప లీలాదుల వర్ణనలను ఆదరిస్తూ స్వయంగా నీ చేతను, నీ విశుద్ధ భక్తుల చేతను వర్ణితమైనట్టి ఆ కథలకు తమ జీవితాన్ని అంకితం చేస్తారో.. వారు ముల్లోకాలలో అజితుడవైనప్పటికినీ నిక్కముగా నిన్ను జయింపగలరు’ (శ్రీమద్భాగవతం: 10.14.3). శ్రీమద్భాగవతం, భగవద్గీత వంటి ప్రామాణిక గ్రంథాల్లో తెలిపిన భగవంతుని రూపగుణ పరివార లీలలు, స్వామి నామాలు, వర్ణనలను ఆలకించటమే ‘శ్రవణ భక్తి’. ప్రహ్లాదుడు బోధించిన నవ విధ భక్తిమార్గాల్లో ఇది మొదటిది. ‘శ్రీకృష్ణ నామోచ్ఛారణ’తో మనిషి గుణమాలిన్యం వల్ల కలిగే భౌతికభావన నుంచి పరిశుద్ధుడు కాగలడని శ్రీచైతన్య మహాప్రభువుల వారు ‘శిక్షాష్టకం’లో ప్రబోధించారు. హృదయ కుహరం నుంచి మాలిన్యం తొలగినపుడే మనిషి దేవదేవుని రూపాన్ని అనుభూతిలోకి తెచ్చుకోగలుగుతాడు. అప్పుడే మనిషి భగవంతుని ‘రూపావగాహన స్థితి’కి చేరుకోగలడు. ‘జంతూనామ్‌ నరజన్మ దుర్లభం. సమస్త ప్రాణులలోను నరజన్మ లభించడం ఎంతో కష్టసాధ్యం. ఎందుకంటే,  ప్రతి ప్రాణికీ చెవులుంటాయి. కానీ, మనిషి మాత్రమే శాస్ర్తాలను పఠించి భగవంతుడున్నాడన్న విషయంపై ఒక నిశ్చయబుద్ధితో ‘దృఢ సంకల్పానికి’ రాగలడు. ఇది కూడా ఒక గొప్ప గురువు ద్వారానే శీఘ్రతరంగా సుసాధ్యమవుతుంది. శ్రవణం ద్వారా సంప్రాప్తించే ఈ అద్భుత సౌలభ్యం ఒక్క మనిషికే తప్ప, మరే ఇతర ప్రాణికీ లేదు. జ్ఞాన సముపార్జనా విధానాలైన ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన మొదలైనవాటి ప్రమాణాల్లోకెల్లా ‘శబ్ద ప్రమాణమే’ (ప్రామాణికమైన మూలం నుంచి విని, గ్రహించింది) ఉన్నతమైందిగా శాస్ర్తాల్లో చెప్పబడింది.

మహాత్ములు లేదా కృష్ణానురక్తులైన విశుద్ద భక్తుల నుంచి దేవదేవుని గాథను వినటం ఎంత గొప్పదంటే, ‘ముల్లోకాల్లోనూ అజితుడైన శ్రీకృష్ణుడు తన రూప లీలాదులను శ్రవణం గావించే భక్తులకు మాత్రం వశుడైపోగలడు’. ఆ శ్రోతకు కావలసిన ఏకైక అర్హత ఏమంటే.. పరమసత్యాన్ని గురించి ‘తనకు తానుగా ఊహాకల్పనలతో తెలుసుకోవాలనుకునే ధోరణిని పరిత్యజించడం, భగవంతునితో తాను మమేకం కావాలనుకోవటాన్ని పరిత్యజించడం’. దీనికి బదులుగా, వినమ్రుడై పరమహంసులైన లేదా భాగవతోత్తములైన భక్తుల నుంచి ఆ పరమసత్యాన్ని విని తెలుసుకోవాలి. అలాంటి విశుద్ధ భక్తులు ‘బ్రహ్మ-మధ్వ-గౌడీయ వైష్ణవ’ వంటి ప్రాచీన సంప్రదాయాల్లో ఉన్నారు. ఆ ప్రామాణికుల నోటితో కృష్ణకథా శ్రవణం చేయడం ద్వారా కరుణాంతరంగుడైన దేవదేవుని కృపకు, చరణాశ్రయానికి వేగవంతంగా పాత్రులం కాగలం. ఈ కారణంగానే భగవంతుని కథా శ్రవణం సకల పుణ్యప్రదంగా విలసిల్లుతున్నది. హరే కృష్ణ!

 శ్రీమాన్‌ సత్యగౌర 

చంద్రదాస ప్రభుజీ

93969 56984

VIDEOS

logo