మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Sep 05, 2020 , 13:06:06

నాలుగున్న‌రేండ్ల‌ బిడ్డ‌ను చంపి తండ్రి ఆత్మ‌హ‌త్య‌

నాలుగున్న‌రేండ్ల‌ బిడ్డ‌ను చంపి తండ్రి ఆత్మ‌హ‌త్య‌

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో దారుణం జ‌రిగింది. గ‌ణేశ్ అనే ఓ వ్య‌క్తి త‌న నాలుగున్న‌రేండ్ల కూతురును ఉరితీసి చంపి, ఆ త‌ర్వాత తానూ ఉరేసుకున్నాడు. చిత్తూరులోని ఒక ప్రైవేటు లాడ్జిలో శ‌నివారం తెల్ల‌వారుజామున ఈ దారుణం వెలుగుచూసింది. ఘ‌ట‌న‌కు ముందు గ‌ణేశ్ ఒక సెల్ఫీ వీడియో కూడా షూట్‌చేసి పెట్టాడు. త‌న ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌ను ఆ వీడియోలో వెల్ల‌డించాడు. 

చిత్తూరు టూ టౌన్ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. చిత్తూరు ప‌ట్ట‌ణానికే చెందిన గ‌ణేశ్ కొన్ని సంవ‌త్స‌రాల క్రితం దివ్య అనే మ‌హిళ‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి నాలుగున్న‌రేండ్ల పాప ఉంది. అయితే ఇటీవ‌ల గ‌ణేశ్‌ భార్య మ‌రో వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న‌ది. ఈ విష‌యం గ‌ణేశ్‌కు తెలియ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో గురువారం కూడా భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. 

దీంతో గ‌ణేశ్ త‌న కూతురును తీసుకుని ఓ లాడ్జికి వెళ్లాడు. అక్క‌డే బ‌స చేశాడు. అర్ధ‌రాత్రి త‌ర్వాత ఓ సెల్ఫీ వీడియో తీసి అనంత‌రం దారుణానికి ఒడిగ‌ట్టాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నా స్థలానికి వెళ్లి మృత‌దేహాల‌ను పోస్టుమార్టానికి త‌ర‌లించారు. ప‌రారీలో ఉన్న దివ్య కోసం గాలిస్తున్నారు. దివ్య త‌ల్లి, సోద‌రి కూడా ఆమె ప్ర‌వ‌ర్త‌న‌తో విసిగిపోయామ‌ని చెప్పార‌ని. ఎంత న‌చ్చ‌జెప్పినా త‌మ మాట విన‌లేద‌ని తెలిపార‌ని పోలీసులు వెల్ల‌డించారు.                    

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo