కొన్ని రోజులుగా బాలీవుడ్ సినిమా (Bollywood)లు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా మ్యాజిక్ చేయడం లేదు. ఒకప్పుడు వందల కోట్లు వసూలు చేసిన హిందీ సినిమాలు.. ఇప్పుడు 100 కోట్లు వసూలు చేయడానికి కూడా తంటాలు పడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని సినిమాలు కేవలం 30 కోట్లు కూడా వసూలు చేయలేకపోయాయి. రణవీర్ సింగ్ జయేష్ భాయ్ జోర్దార్, అక్షయ్ కుమార్ బచ్చన్ పాండే లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కనీసం 50 కోట్లు కూడా వసూలు చేయలేక ట్రేడ్ వర్గాలకు ఊహించని షాక్ ఇచ్చాయి.
ఇదే సమయంలో సౌత్ (South Indian film industry)నుంచి వెళ్ళిన కేజీఎఫ్ 2, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు ఏకంగా 300 కోట్లకు పైగా వసూలు చేయడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ పని అయిపోయింది.. అక్కడ సార్ హీరోల బిజినెస్ దారుణంగా పడిపోయింది.. సౌత్ సినిమాలని చూసి నేర్చుకోవాలి అంటూ విమర్శలు కూడా మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో చాలా రోజుల తర్వాత ఒక సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపిస్తోంది. మూడు రోజుల్లోనే 60 కోట్లకు పైగా వసూలు చేసి కొత్త ఆశలు చిగురించేలా చేసింది.
ఆ సినిమా భూల్ భూలయ్య 2. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా అనీస్ బజ్మీ తెరకెక్కించిన ఈ సినిమాకు మూడు రోజుల్లోనే 60 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. హారర్ కామెడీగా వచ్చిన భూల్ భూలయ్య 2 సినిమాకు రోజురోజుకు ఆదరణ పెరుగుతుండడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు. రాబోయే పెద్ద సినిమా (Big movies)లకు ఇది ఊరటనిచ్చే విషయం. జూన్ 3న విడుదల కానున్న అక్షయ్ కుమార్ పృథ్విరాజ్ సైతం భారీ కలెక్షన్స్ తీసుకొస్తే బాలీవుడ్ మళ్లీ జూలు విదిల్చినట్టే. ఈ విషయంలో టాలీవుడ్ మళ్లీ జాగ్రత్తపడాలి.. లేదంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు.
మన దగ్గర నుంచి పర్ఫెక్ట్ కంటెంట్ హిందీకి వెళ్ళినప్పుడు మాత్రమే అక్కడ ఆడియన్స్ ఆదరిస్తున్నారు. అలా కాదని అలసత్వానికి వెళ్తే సైరా, రాధే శ్యామ్ లాంటి డిజాస్టర్స్ రుచి చూపిస్తున్నారు. మొత్తానికి హిందీ సినిమా బాక్సాఫీస్ చాలా రోజుల తర్వాత సందడిగా మారింది. అది అలాగే కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి.