ఫిదా సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ..తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది సాయిపల్లవి (Sai Pallavi). అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసే ఈ మల్టీ ట్యాలెంటెడ్ బ్యూటీ పండుగ నేపథ్యంలో షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంది. అయితే బ్రేక్ తీసుకుంది మాత్రం విశ్రాంతి కోసం అనుకుంటే పొరపాటు పడ్డట్టే. బ్రేక్ సమయాన్ని పొలం పనుల కోసం వినియోగించుకుంది సాయిపల్లవి. ఈ భామ వ్యవసాయ పనులు చేస్తున్న కూలీల (Agriculture labourers) దగ్గరకు వెళ్లింది.
పసుపు పంట తీత పనులు చేస్తున్న అమ్మలక్కళ్లాగే సాయిపల్లవి ఎండ నుంచి కాపాడుకోవడానికి తలకు తువాల చుట్టుకుంది. చేతిలో తట్ట పట్టుకుని దుక్కిని తవ్వుతూ పసుపు కొమ్ముల (Turmeric crop) ను ఏరి కుప్ప చేసింది. పనంతా అయిపోయిన తర్వాత కూలీలందరితో కలిసి దుక్కిలోనే కూర్చొని ఫొటోలు దిగింది. ఈ స్టిల్స్ ను నెట్టింట్లో పోస్ట్ చేయగా ట్రెండింగ్ అవుతున్నాయి.
గత ఏడాది లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది సాయిపల్లవి. నాని హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో సాయిపల్లవి పోషించిన దేవదాసి పాత్రకు అద్బుతమైన స్పందన వచ్చింది. నాగచైతన్యతో కలిసి నటించిన లవ్ స్టోరీ మంచి కలెక్షన్లను రాబట్టింది. ప్రస్తుతం రానాతో కలిసి నటిస్తోన్న విరాటపర్వం విడుదల కావాల్సి ఉంది.