టాలీవుడ్లో ట్రెండీ క్రేజీ కాంబినేషన్ ఏదైనా ఉందంటే..అది ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), రాంచరణ్ (Ram Charan)-జూ..ఎన్టీఆర్ (Jr NTR)లదే. ఈ క్రేజీ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). మార్చి 25న విడుదలైన ఈ మూవీ గ్లోబల్ బాక్సాపీస్ వద్ద రికార్డుల పంట పండించింది. ఈ చిత్రం రూ.1000 కోట్లకుపైగా గ్రాస్ సాధించిన మరో ఇండియన్ సినిమాగా అరుదైన రికార్డు కూడా సొంతం చేసుకుంది.
ఈ సినిమా లాంఛ్ అయినప్పటి నుంచి స్క్రీనింగ్ అయ్యే చివరి రోజు వరకు ఏదో ఒక అప్ డేట్‌తో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఓ భారీ ప్లాన్‌కు సన్నాహాలు జరుగుతున్నాయన్న వార్త ఇపుడు సినీఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇంతకీ విషయమేంటో తెలుసా..? ఆర్ఆర్ఆర్ థీమ్ రెస్టారెంట్. అవును మీరు చదివింది నిజమే. ఓ టాప్ తెలుగు సినీ నిర్మాత ఆర్ఆర్ఆర్ బ్రాండ్ నేమ్‌తో థీమ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనను తారక్, రాంచరణ్, జక్కన్న దృష్టికి తీసుకెళ్లినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అంతేకాదు ఎస్ఎస్ రాజమౌళి అండ్ టీంతో భాగస్వామి అవ్వాలనుకుంటున్నట్టు సదరు నిర్మాత వారితో చెప్పాడని జోరుగా టాక్ నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ థీమ్ ఉట్టిపడేలా రుచికరమైన భారతీయ వంటకాలుండేలా రెస్టారెంట్ డిజైన్ చేయబోతున్నాడట. స్వాతంత్య్రానికి పూర్వం నాటి ఫ్యాషన్ లేబుల్‌తో రెస్టారెంట్ సిబ్బంది డ్రెస్ కోడ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్.
ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత తారక్, రాంచరణ్ వ్యక్తిగత, వృత్తిపరమైన కమిట్మెంట్స్ తో ఫుల్ బిజీ అయిపోయారు. ఆర్ఆర్ఆర్ థీమ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసేందుకు ఒకే చెప్తారా..? లేదా.? ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే..ఇంతకీ ఈ రెస్టారెంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేస్తారంటూ అప్పుడే చేసుకుంటున్నారు సినీజనాలు. ఈ వార్తలపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.