శుక్రవారం 10 జూలై 2020
Cinema - Jun 02, 2020 , 23:28:31

విమర్శలు గాయం చేస్తాయి

విమర్శలు గాయం చేస్తాయి

లాక్‌డౌన్‌ టైమ్‌లో సినీతారలందరూ సోషల్‌ మీడియాలో అభిమానులతో లైవ్‌ వీడియోల ద్వారా సంభాషిస్తూ అనేక సంగతుల్ని పంచుకుంటున్నారు. కేరళ సోయగం ప్రియా ప్రకాష్‌ వారియర్‌ మాత్రం తన ఇన్‌స్టాగ్రామ్‌ ఎకౌంట్‌ను డియాక్టివేట్‌ చేసి అందరిని విస్మయానికి గురిచేసింది. రెండువారాల అనంతరం ఈ అమ్మడు తిరిగి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమైంది. సోషల్‌మీడియాకు విరామమివ్వడానికి కారణలేమిటో వివరించింది.

ఒత్తిడికి గురయ్యా...

లాక్‌డౌన్‌ రోజుల నుంచి నాలో ఒత్తిడి పెరిగిపోయింది. సోషల్‌మీడియాలో అభిమానుల ప్రశంసలు, విమర్శలు, అనవసరమైన కామెంట్స్‌, ఎవరు ఎందుకు ఫాలో అవుతున్నారో? ఎందుకు అన్‌ఫాలో అవుతున్నారో? తెలియని అయోమయ పరిస్థితి ఎదురైంది. వీటి నుంచి బయటపడి మనశ్శాంతిని వెతుక్కోవాలని ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తప్పుకున్నా.

ఈ రేంజ్‌లో ట్రోల్స్‌ వస్తాయని ఊహించలేదు

నా వ్యక్తిగత కారణాలతో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి నిష్క్రమించాను. ఎవరూ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరనుకున్నా. కానీ సోషల్‌మీడియాలో వచ్చిన ట్రోల్స్‌, పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి ఆశ్చర్యపోయాను. ముఖ్యంగా ట్రోల్స్‌, మీమ్స్‌ నన్ను బాగా ఇబ్బందిపెట్టాయి. నా పర్సనల్‌లైఫ్‌ మీద ఇతరులకు ఎందుకింత ఆసక్తి అనిపించింది. భవిష్యత్తులో కూడా నాకు నచ్చకపోతే సోషల్‌మీడియా నుంచి తప్పుకుంటా. 

విమర్శలు కొత్తకాదు..

అభిమానుల నుంచి వస్తున్న ట్రోల్స్‌ తట్టుకోలేకనే అకౌంట్‌ను డీయాక్టివేట్‌ చేశానని ప్రచారం చేశారు. అందులో వాస్తవం లేదు. నాకు ట్రోల్స్‌, విమర్శలు కొత్తకాదు. హాస్యాన్ని పంచుతూ పాజిటివ్‌ మైండ్‌సెట్‌తో చేసే ట్రోల్స్‌ని నేను సరదాగా స్వీకరిస్తా. హద్దులుదాటిన విమర్శలే హృదయాన్ని గాయపరుస్తాయి. 

పబ్లిసిటీ అంటూ సిల్లీ కామెంట్స్‌ చేశారు..

ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో తెలియని అస్థిరత చోటుచేసుకుంది. ఇలాంటి సంక్షుభిత స్థితి లో ఎవరైనా పబ్లిసిటీ కోరుకుంటారా? అందరి అటెన్షన్‌ పొందే ఉద్దేశ్యంతో నేను సోషల్‌మీడియా నుంచి తప్పుకున్నానని దుష్ప్రచారం చేస్తున్నారు. అన్నింటికంటే ఆ విమ ర్శలే నన్ను ఎక్కువగా బాధించాయి.

అభద్రతాభావంతో ఉన్నా...

 లాక్‌డౌన్‌ వల్ల మూడునెలలుగా ఇంట్లోనే ఉంటున్నా. భవిష్యత్తులో కెరీర్‌ ఎలా ఉంటుందో? కరోనా మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో? జీవితం పూర్వంలా ఉంటుందా? అనే సందేహాలు నన్ను నిలవనీయడం లేదు. నా వయసులో ఉండే ప్రతి అమ్మాయికి ఇలాంటి సంశయాలు ఉండటం సహజం. ఒక్క కన్నుగీటుతో దేశమంతా నా గురించే మాట్లాడుకుంది. చిన్న వయసులో వచ్చిన గుర్తింపు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. దాని తాలూకు ఒత్తిడి తప్పకుండా ఉంటుందని అర్థం చేసుకోవాలి.  నన్ను పొగడకున్నా ఫర్వాలేదు. రెండు మంచి మాటలతో ప్రోత్సహిస్తే చాలు.


logo