Tollywood to Hollywood | ఇటీవల తెలుగు సినిమాలు పాన్ ఇండియా హిట్లుగా రికార్డులు సృష్టిస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం. ఇన్నాళ్లూ తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన టాలీవుడ్ సినిమా ప్రస్తుతం మాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలోనూ ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. దీంతో తెలుగు హీరోలను పాన్ ఇండియా స్టార్లుగానే పిలుస్తున్నారు. అయితే ఇప్పుడు మన నటులు హాలీవుడ్ దృష్టినీ ఆకర్షిస్తున్నారు. అంటే ప్రపంచస్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకోబోతున్నారన్నమాట. ఎన్టీఆర్, బన్నీ, సమంత తదితరులు ఈ వరుసలో హాటెస్ట్ ఎంట్రీలుగా నిలిచారు.
టాలీవుడ్ టు హాలీవుడ్… ఈ ట్యాగ్‌లైన్ ఇప్పుడు తెలుగు నటీనటులకు చక్కగా నప్పుతుంది. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్…లాంటి సినిమాలు ఓవర్సీస్లోనూ మెరిశాయి. దీంతో అక్కడివాళ్లూ మన సినిమాలకు, నటీనటులకు ఫ్యాన్స్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి దర్శకనిర్మాతలు మన టాలీవుడ్ స్టార్లతో మంతనాలకు ఆసక్తి కనబరుస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో తన నటనకుగాను ఆస్కార్ బరిలో ఉండబోతున్నా రంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఎన్టీఆర్‌కు హాలీవుడ్ సినిమా ఆఫర్ వచ్చిందన్న వార్త అభిమానులకు కొత్త కిక్ ఇస్తున్నది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడైన ఉమైర్ సంధూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలాన్నిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌కు సంబంధించిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఎన్టీఆర్ నటించనున్నాడని, దాని కథ మన హీరోకు బాగా నచ్చిందనీ ఒక ట్వీట్లో సంధూ పేర్కొన్నాడు. దీంతో ఎన్టీఆర్ హాలీవుడ్ అరంగేట్రం అధికారికంగా కన్ఫర్మ్ అయినట్టేననీ, ఈ అరుదైన అవకాశాన్ని అందుకున్న తొలి తెలుగు హీరో తారక్ అనీ ఆయన అన్నారు. ఇక స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒక ప్రముఖ హాలీవుడ్ దర్శకుడితో మాటామంతీ జరిపినట్టు ప్రచారం జోరందుకుంది. బన్నీ కోసమే కథ రాసిన సదరు దర్శకుడు మన హీరోకు పవర్ఫుల్ క్యారెక్టర్‌ను రూపొందించాడట. బన్నీ న్యూయార్క్ ట్రిప్‌లో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుపై చర్చలు జరిగాయన్న వార్తలు వస్తున్నాయి. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కోసం ఒక కథను రాయాలని అనుకుంటున్నాననీ ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు ఆరోన్ స్టివర్ట్ ఇటీవల తన ఆలోచనను పంచుకున్నాడు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి జాతీయ స్థాయి యాక్టర్‌గా ఎదిగిన సమంత తన నటనతో హాలీవుడ్ దృష్టినీ ఆకర్షించింది. హాలీవుడ్లో పేరుమోసిన డైరెక్టర్ ఫిలిప్ జాన్‌తో కలిసి పనిచేయనుంది సమంత. ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ మూవీలో ఒక డిటెక్టివ్ ఏజెన్సీని నడిపే ధైర్యవంతురాలైన స్త్రీ పాత్ర చేయనుంది సామ్. ఇక మోడల్‌గా, నటిగా తన టాలెంట్‌ను నిరూపించుకున్న తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ కూడా ఇంగ్లిష్ సినిమా ఇండస్ట్రీ నుంచి మంచి ఆఫర్‌ను అందుకుంది. నటుడు దేవ్‌పటేల్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘మంకీ మ్యాన్’ సినిమాలో దక్షిణాఫ్రికా నటుడు షాల్టో కాప్లేతో కలిసి నటించనుంది. ఈ హవా చూస్తుంటే త్వరలోనే మనవాళ్లు హాలీవుడ్‌ను ఏలేస్తారేమో అనిపిస్తున్నది… మీరేమంటారు?!
కేజీఎఫ్ నటుడికి క్యాన్సర్.. డబ్బుల్లేక ఆపరేషన్ కూడా పోస్ట్‌పోన్ !!