మానవ అక్రమ రవాణా కేసు (human trafficking case)లో పాపులర్ సింగర్ దలెర్ మెహిందీ (Daler Mehndi)ని పంజాబ్ పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. 2003 నాటి ఈ కేసులో దలెర్ మెహిందీ అప్పట్లో అరెస్ట్ కాగా.. బెయిల్‌పై విడుదలయ్యాడు. మళ్లీ 15 ఏండ్ల తర్వాత ఈ కేసులో పాటియాలా జిల్లా కోర్టు ఇవాళ తుది తీర్పు ఇచ్చింది. కోర్టు దలెర్ మెహిందీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
ఈ నేపథ్యంలో పంజాబ్ పోలీసులు (Punjab Police) దలెర్ మెహిందీని పాటియాలా జైలుకు తరలించనున్నారు. పంజాబ్ కాంగ్రెస్ నేత నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ కూడా ఇదే జైలులో శిక్షననుభవిస్తున్నారు. సింగర్ దలెర్ మెహిందీ, అతని సోదరుడు షంషీర్ (చనిపోయాడు) తనను కెనడా పంపిస్తామని చెప్పి రూ.12 లక్షలు తీసుకున్నారని బల్బేరా గ్రామానికి చెందిన బక్షిశ్ సింగ్ అనే వ్యక్తి పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత దలెర్ మెహిందీ సోదరులపై మరో 35 ఫిర్యాదులు ఇలాంటివే వచ్చాయి.
ఫిర్యాదులతో అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు దలెర్ మెహిందీని అరెస్ట్ చేయగా..బెయిల్‌పై బయటకు వచ్చాడు. దలెర్ మెహిందీ తెలుగులో బాహుబలి, మగధీర, పైసా వసూల్, యమదొండ, బాద్ షాతోపాటు మరెన్నో చిత్రాల్లో ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ పాడాడు.