ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ( Balka Suman ) ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) , మాజీ ఎమ్మెల్యే కోరుకొండ చందర్ ( Korukonda Chander ) సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితిని, జైలులో వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జైలు బయట వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన కొనసాగిస్తుందని విమర్శించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు 14 మంది గెలిచినా మంత్రి వివేక్ అధికార దౌర్జన్యంతో ఎన్నికలను నిలిపివేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేసి బీఆర్ఎస్ నాయకులపైనే కేసులు నమోదు చేశారని దుయ్యబట్టారు.
సుమన్ పై ఉన్న పాత కేసులు తోడి బెయిల్ రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దౌర్జన్యంగా క్యాతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని మంత్రి వివేక్ ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. అధికార పార్టీ దౌర్జన్యాలను అడ్డుకుంటామని అన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏనాడు ఇలాంటి చర్యలకు పాల్పడలేదని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ దురాగతాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. జైలులో అధికారులు సుమన్‌ను మానసిక శోభకు గురి చేస్తున్నారని, దోమలు బాగా ఉన్న పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి తెలిపారు. కొంత అనారోగ్యానికి గురైన వైద్యం అందించడం లేదని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.