సినిమా పేరు : పొట్టేల్
తారాగణం : యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్..
దర్శకత్వం: సాహిత్ మోత్ఖూరి
నిర్మాతలు: నిశాంక్‌రెడ్డి కుడితి, సురేశ్‌కుమార్ సడిగే..
సంగీతం: శేఖర్‌చంద్ర
విడుదలకు ముందు చిన్న సినిమాలకు హైప్ రావడం చాలా అరుదు. ‘పొట్టేల్’ (Pottel)కు బాగా హైప్ వచ్చింది. ప్రమోషన్స్ విషయంలో నిర్మాతలు రాజీ పడకపోవడం.. ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటం ఈ సినిమా హైప్‌కి గల కారణాలు అని కావొచ్చు. పైగా ప్రభాస్, సందీప్‌రెడ్డి వంగా లాంటి స్టార్స్ ఈ సినిమా గురించి మాట్లాడటం కూడా ‘పొట్టేల్’పై జనానికి ఆసక్తిని పెంచింది. నిజానికి ఈ సినిమాలో అజయ్, అనన్య నాగళ్ల తప్ప తెలిసిన ముఖాలు తక్కువ. అయినా పెద్ద సినిమాకు వచ్చినంద హైప్ వచ్చిందీ సినిమాకు. తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం మరి అందరి అంచనాలనూ అందుకుందా? అందర్నీ మెప్పించిందా..? అనేది తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్లాలి.
కథ:
1970ల్లో తెలంగాణలోని రూరల్ ఏరియాలో ఈ కథ మొదలవుతుంది. అదో చిన్న కుగ్రామం. పటేల్, పట్వారీల పాలనలో జనం మగ్గుతున్న రోజులవి. అగ్ర వర్ణాల పిల్లలు తప్ప బడుగు వర్గాల పిల్లలకు చదువు అందుబాటులో లేదు. ఊరులో 99శాతం నిరక్షరాస్యులే. ఆ ఊరి జనాలకు బాలమ్మతల్లి అంటే నమ్మకం. ఓ బండరాయిని బాలమ్మగా నమ్మి పూజిస్తుంటారు. ఊరు రోగాల బారిన పడినప్పుడు బాలమ్మతల్లే ఆదుకున్నదని ఆ ఊరి జనం నమ్మకం. ఊరి జాతరలో పటేల్‌కు బాలమ్మ పూనుతూ ఉంటుంది. అప్పుడు పటేల్ ఏం చెబితే ఆ ఊరి అదే శాసనం. పాత పటేల్ చనిపోవడంతో అతని కొడుకు కొత్త పటేల్(అజయ్) అవుతాడు. అతడు పరమదుర్మార్గుడు. బడుగు వర్గాల ప్రజలు ఎప్పుడూ కాళ్ల కిందే ఉండాలనేది అతని అభిమతం. అయితే.. జాతరలో తండ్రికి పూనినట్టు చిన్న పటేల్‌కి బాలమ్మతల్లి పూనుదు. దాంతో ఊరి ఆధిపత్యం కోసం బాలమ్మతల్లి పూనినట్టు నటిస్తాడు.
బాలమ్మతల్లిపై జనానికి ఉన్న నమ్మకాన్ని అడ్డుపెట్టుకొని, బాలమ్మ శాసనంగా బలహీన వర్గాల పిల్లలకు చదువు దూరం చేస్తాడు. ‘నా పిల్లాడ్ని బడికి పంపుతానయ్యా..?’ అని అడిగిన పాపానికి గొర్రెల కాపరి అయిన పెద్ద గంగాధరీ (యువచంద్రకృష్ణ) తండ్రిని కొట్టి చంపేస్తాడు. బాలమ్మతల్లే అతడ్ని చంపిందని జనాన్ని నమ్మిస్తాడు. కానీ నిజం పెద్ద గంగాధరీకి తెలుసు. తాను పెరిగి పెద్దయ్యాక బుజ్జమ్మ(అనన్య నాగళ్ల)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప. పేరు సరస్వతి. ఆ పాపను ఎలాగైనా చదివించాలనేది గంగాధరీ కోరిక. కానీ పటేల్ తక్కువ కులం పిల్లల్ని స్కూల్లోకి అనుమతించడు. అది బాలమ్మతల్లి ఆజ్ఞగా చెబుతాడు. మరి గంగాధర్ తన పాపను చదవించుకోగలిగాడా? ఈ కథలో ‘పొట్టేల్’ పాత్ర ఏంటి? చివరకు కథ ఎలాంటి మలుపు తీసుకుంది? అనేది మిగతా కథ.
విశ్లేషణ..
50ఏళ్ల కిందట తెలంగాణ ప్రాంతంలో సామాన్యుడికి చదువు ఎంత దూరంగా ఉండేదో ఈ సినిమాలో దర్శకుడు చూపించాడు. మనిషుల్ని చదువుకి దూరం చేసి, పశువులతో సమానంగా చూసిన పటేళ్ల నాటి రోజుల కథ ఇది. చదువు లేకపోతే మనిషి అనాగరికుడవుతాడు. మానవత్వం మూఢత్వంగా మారుతుంది. ఈ నిజం తెలుసుకున్న ఓ వ్యక్తి తన బిడ్డనైనా చదివించుకోవాలని చేసే పోరాటమే ఈ సినిమా. నిజానికి మంచి కథ. దర్శకుడు 50ఏళ్ల నాటి రోజులకు ఆడియన్స్‌ని తీసుకెళ్లడంలో సఫలం అయ్యాడు. కానీ కథను నడిపించే విధానంలో తడబడ్డట్టు అనిపిస్తుంది.
స్క్రిప్ట్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే బావుండేది. అనుకున్నవిధంగా కథను ముందుకు నడిపించడానికి లాజిక్‌లతో ప్రమేయం లేకుండా సౌకర్యానికి తగ్గట్టుగా స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు దర్శకుడు. స్క్రీన్‌ప్లేలోనే కాస్త కన్ఫ్యూజన్ ఉంది. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం కాస్త వేగంగా ఉంది. విలన్ అనేవాడు ప్రధాన పాత్రల్ని ఎంత హింసేస్తే అంత ఎమోషన్ పండుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. కథలో అద్భుతమైన ఎమోషన్ ఉంది. దాన్ని సరిగ్గా క్యాప్చర్ చేస్తే సినిమా నెక్ట్స్ లెవల్లో ఉండేది అనిపించింది.
నటీనటులు..
ఇందులో నటించిన అందరూ చాలా బాగా చేశారు. యువచంద్రకృష్ణ కొత్తనటుడైనా చక్కగా నటించాడు. ఇక అనన్య నాగళ్ల తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అజయ్ విలనీ ఈ సినిమాకు హైలైట్. అలాగే టీచర్ పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ చాలా బాగా నటించారు. ఇంకా నోయల్, ప్రియాంకశర్మ, తనస్వీ చౌదరి.. ఇలా అందరూ తమ పాత్రలను పరిథిమేర రక్తికట్టించారు. ఆర్టీస్టుల విషయంలో ఎత్తి చూపించేదేం లేదు.
సాంకేతికంగా..
మోనిష్ భూపతిరాజు ఛాయాగ్రహణం సినిమాకు హైలైట్. ఈ విషయంలో అతనికి సహకరించిన కళా దర్శకుడు నార్ని శ్రీనివాస్‌ని కూడా మెచ్చుకోవాలి. ఇద్దరూ కలిసి 80ల నాటి వాతావరణాన్ని అద్భుతంగా క్యాప్చర్ చేశారు. శేఖర్‌చంద్ర నేపథ్య సంగీతం చాలా బావుంది. పాటలు కూడా పర్లేదు అనిపించాయి. ఎడిటింగ్ విషయంలో కార్తీక శ్రీనివాస్ కాస్త జాగ్రత్త పడితే బావుండేది, నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. నిర్మాణ విలువలు బావున్నాయి.
చివరిగా చెప్పొచ్చేదేంటంటే.. దర్శకుడు సాహిత్ మోత్ఖూరి మంచి కథ రాసుకున్నాడు. 70, 80ల నాటి తెలంగాణ రూరల్ ఏరియాల్లోని పరిస్థితుల్ని ఆవిష్కరించడంలో తను సక్సెస్ అయినా.. కథను నడిపించడంలో కాస్త తడబడ్డాడు అనిపించింది. మొత్తంగా లోపాలను పక్కనపెట్టి ఓ మంచి కథను చూడాలనుకుంటే ‘పోట్టేల్’కి వెళ్లొచ్చు. ఓ వర్గం ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది.
బలాలు..
కథ, నటీనటుల నటన, నేపథ్య సంగీతం, కెమెరా..
బలహీనతలు..
కథనం, ఎడిటింగ్..
రేటింగ్ : 3/5
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి
Zebra | సత్యదేవ్ జీబ్రా దీపావళికి రావడం లేదు.. ఎందుకో మరి..?