e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News Akhanda movie review | అఖండ సినిమా రివ్యూ

Akhanda movie review | అఖండ సినిమా రివ్యూ

Akhanda movie review | అఖండ రివ్యూ
Nandamuri Balakrishna Akhanda movie review

Akhanda movie review | మాస్‌ పల్స్‌ బాగా తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయనకు బాలకృష్ట తోడైతే ఆ ఇంపల్స్‌ ఎలా ఉంటుందో ‘లెజెండ్‌’ ‘సింహా’ వంటి సినిమాల్లో చూశాం. భారీ ఎలివేషన్స్‌, రోమాంచితమైన యాక్షన్‌ ఘట్టాలతో బాలయ్యను అభిమానులు కోరుకున్న విధంగా ప్రజెంట్‌ చేస్తుంటారు బోయపాటి. వీరిద్దరి కాంబినేషన్‌లో మూడో చిత్రం ‘అఖండ’ నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. కరోనా సెకండ్‌వేవ్‌ తర్వాత థియేటర్‌లో విడుదలవుతున్న పెద్ద సినిమా ఇదే కావడంతో కూడా భారీ అంచనాలకు కారణమైంది. మరి ఈ సూపర్‌హిట్‌ మాస్‌ కాంబినేషన్‌ హ్యాట్రిక్‌ టార్గెట్‌ ఫలించిందా? ‘ అఖండ ’ అంచనాల్ని అందుకుందా?…ఇవన్నీ తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..

కథ గురించి..

అనంతపురం నేపథ్యంలో నడిచే కథ ఇది. సేవాభావంతో పాటు ఆదర్శగుణాలు కలిగిన మురళీకృష్ణ (బాలకృష్ణ) ప్రజల కష్టాల్లో తోడూనీడగా ఉంటాడు. తన ఉళ్లో పెద్ద ఆసుపత్రిని కట్టించి ఉచితంగా వైద్యాన్ని అందిస్తుంటాడు. ఆ జిల్లాకు కొత్త కలెక్టర్‌గా వచ్చిన శరణ్య (ప్రగ్యాజైస్వాల్‌)…మురళీకృష్ణ మంచితనాన్ని నచ్చి ఆయన్ని ఇష్టపడుతుంది. పెద్దల అంగీకారంతో ఇద్దరు పెళ్లిచేసుకుంటారు. అత్యంత క్రూరుడైన వరదరాజులు (శ్రీకాంత్‌) అక్రమ మైనింగ్‌ చేస్తూ తనకు ఎదురు తిరిగిన ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటాడు. యురేనియం తవ్వకాల్ని జరుపుతూ ఆ ప్రక్రియలో వచ్చే ఉద్గారాలను రివర్స్‌ పంపింగ్‌ ద్వారా భూమిలోకి పంపిస్తుంటాడు. దీనివల్ల ప్రజలు రోగాల బారిన పడుతుంటారు. తన అన్యాయాల్ని ప్రశ్నించిన మురళీకృష్ణపై వరదరాజులు పగ పెంచుకుంటాడు. ఆసుపత్రిలో బాంబ్‌బ్లాస్ట్‌ కుట్ర పన్ని మురళీకృష్ణను జైలుకు పంపిస్తాడు. అంతటితో ఆగకుండా మురళీకృష్ణ కుటుంబాన్ని అంతమొందించే ప్రయత్నం చేస్తాడు? అప్పుడు అఖండ (బాలకృష్ణ) ఒక్కసారిగా తెరమీదికొచ్చి మురళీకృష్ణ కుటుంబానికి రక్షకుడిగా నిలుస్తాడు. అసలు అఖండ పూర్వాపరాలు ఏమిటి? మురళీకృష్ణతో అతనికున్న సంబంధమేమిటి? వరదరాజులు మాఫియా నెట్‌వర్క్‌ లోతులు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానంగా మిగతా కథ నడుస్తుంది.

Akhanda movie review | అఖండ రివ్యూ
Akhanda movie review ( అఖండ రివ్యూ )

కథా విశ్లేషణ..

- Advertisement -

మాస్‌ అంశాలతో పాటు శివుడికి సంబంధమైన దైవిక అంశాల్ని కలబోసి దర్శకుడు బోయపాటి ఈ సినిమా కథ రాసుకున్నారు. మాస్‌ ఎలిమెంట్స్‌ను అత్యంత ప్రభావశీలంగా, ప్రేక్షకుల్లో ఓ ఊపు తీసుకొచ్చే విధంగా ఆవిష్కరించడంలో బోయపాటి దిట్ట. ఈ సినిమాలో కూడా అవే అంశాలపై దృష్టిపెట్టాడు. సినిమా ఆద్యంతం బాలకృష్ణ ఎలివేషన్స్‌, రొమాంచితమైన యాక్షన్‌ హంగులతో సాగింది. ఆరంభ సన్నివేశాల్లో మురళీకృష్ణ ప్రజాసేవ, కలెక్టర్‌ శరణ్యతో అతని ప్రేమ…. పెళ్లికి దారితీసే ఎపిసోడ్‌తో ఆకట్టుకుంది. వరదరాజులుతో మురళీకృష్ణ వైరంతో సినిమా పూర్తిగా యాక్షన్‌ బాటపట్టింది. ఆసుపత్రిలో బాంబ్‌బ్లాస్ట్‌తో ఎన్‌.ఐ.ఏ రంగ ప్రవేశం చేసి మురళీకృష్ణను అరెస్ట్‌ చేయడం..అనంతరం అఖండ ఆగమనం ఉత్కంఠను పంచుతుంది. ప్రీ ఇంటర్వెల్‌లో అఖండ సినిమాలోకి ఎంట్రీ ఇస్తాడు. ఆ ఎపిసోడ్‌లో కావాల్సినంత యాక్షన్‌ పండింది. సినిమాలోని ఆ బ్లాక్‌ను బాలయ్య అభిమానులకు ఓ విజువల్‌ ఫీస్ట్‌లా చెప్పుకోవచ్చు. తనమార్క్‌ పతాకస్థాయి ఉద్వేగాలు, రొమాంచితమైన ఎలివేషన్స్‌తో అఖండ ఎంట్రీ ఎపిసోడ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు దర్శకుడు బోయపాటి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ద్వితీయార్థం ఎలా ఉంటుందోననే ఉత్సుకతను పెంచుతుంది.

Akhanda movie review | అఖండ రివ్యూ
Akhanda movie review

ఇక ద్వితీయార్థంలో కథ మొత్తాన్ని అఖండ చుట్టే నడిపించారు. అఖండ అడుగేస్తే పోరాటం, శత్రు సంహారం అన్న చందంగా సెకండాఫ్‌ సాగింది. ఏ మాత్రం విరామం లేని యాక్షన్‌ వల్ల మధ్యలో సన్నివేశాలుంటే బాగుండనే భావన కలగడం ఖాయం. అఖండ పాత్రను దైవాంశ సంభూతుడిలా ఆవిష్కరించారు బోయపాటి. ఆ పాత్ర ద్వారానే శివతత్వం, హిందు ధార్మిక అంశాల్ని చెప్పే ప్రయత్నం చేశారు. అఖండ చెప్పే సంభాషణలకు కొదువలేకుండా పోయింది. అవి బాగున్నాయి కూడా. సెకండాఫ్‌లో మురళీకృష్ణ పాత్రకు తక్కువ స్పేస్‌ ఇచ్చారు. ఓ రకంగా ఆయన్ని నామమాత్రుడిని చేసినట్టు కనిపిస్తుంది. బోయపాటి యాక్షన్‌ ఘట్టాల్లో మాంచి కిక్‌ ఉంటుంది. ఓ మోతాదులో ఉంటో వాటిని ఆస్వాదించవొచ్చు. అడుగడుగునా ఓ ఫైట్‌ అంటే ఒక రొదలా అనిపిస్తుంది. సెకండాఫ్‌ మొత్తం యాక్షన్‌ తప్ప మరేమి లేదని ఫీలింగ్‌ వస్తుంది. యాక్షన్‌ తగ్గించి ఫ్యామిలీ డ్రామాకు చోటిస్తే బ్యాలెన్స్‌ అయ్యేది. ప్రథమార్థంలో మంచి టెంపోలో సాగిన కథను ద్వితీయార్థంలో ఆసాంతం యాక్షన్‌తో నింపేయడం నిరుత్సాహపరుస్తుంది. సినిమాకు అదే మైనస్‌గా అనిపిస్తుంది. ఇక ైక్లెమాక్స్‌ ఘట్టాలు, ముగింపు ఊహించినట్లుగానే సాగాయి.

నటీనటుల పర్‌ఫార్మెన్స్‌..

రెండు పాత్రల్లో బాలకృష్ణ తనదైన సహజ అభినయంతో మెప్పించారు. మురళీకృష్ణ పాత్రలో చక్కటి హుందాతనం కనిపించింది. అలాంటి పాత్రలు ఆయనకు టైలర్‌మేడ్‌లా అనిపిస్తాయి. అఖండగా మాత్రం బాలకృష్ణ అదరగొట్టాడనే చెప్పాలి. అద్భుతమైన గెటప్‌తో పాటు ఏకధాటిగా, అనర్గళంగా చెప్పిన సంభాషణలతో తన స్టామినా ఏమిటో చెప్పారు. ప్రగ్యాజైస్వాల్‌ గ్లామర్‌కే పరిమితమైపోయింది. అక్కడక్కడా అభినయంతో కూడా ఆకట్టుకుంది. ప్రతినాయకుడు వరదరాజులు పాత్రలో శ్రీకాంత్‌ అంతగా సూటవలేదనిపించింది. అంచనాలకు తగినట్లుగా విలనీ ప్రదర్శించలేకపోయారాయన. జగపతిబాబు పాత్ర చిత్రణ మెప్పిస్తుంది. పూర్ణకు అభినయప్రధానమైన పాత్ర దొరికింది. తక్కువ స్క్రీన్‌స్పేస్‌ ఉన్నా మెప్పించింది. సినిమాలో చాలా పాత్రలు కనిపిస్తాయి. వారంతా పరిధుల మేరకు నటించారు.

Akhanda movie review | అఖండ రివ్యూ
అఖండ రివ్యూ

ఇక సాంకేతికంగా ప్రతి విభాగంలో ఉన్నతమైన విలువలు కనిపించాయి. పోరాటఘట్టాలకు తమన్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కు మంచి మార్కులు పడతాయి. సినిమాలో ఎమోషనల్‌ ఫీల్‌ను తమన్‌ బీజీఎమ్‌ చక్కగా ఒడిసిపట్టింది. రాంప్రసాద్‌ కెమెరా పనితనం బాగుంది. ముందే చెప్పినట్లు దర్శకుడు బోయపాటి శ్రీను తనదైన యాక్షన్‌, ఎలివేషన్స్‌ను నమ్ముకొని సినిమా చేశాడు. కొంచెం యాక్షన్‌ డోస్‌ తగ్గించి కథలోని ఎమోషన్స్‌పై దృష్టిపెడితే సినిమా మరింత బాగుండేది. నిర్మాణ విలువలు బాగా కుదిరాయి. ఖర్చుకు ఎక్కడా వెనుకాడినట్లు కనిపించలేదు.

‘అఖండ’ ప్రథమార్థమంతా కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలతో ఆకట్టుకుంది. సెకండాఫ్‌లోనే కాస్త పట్టుతప్పింది. అయితే కావాల్సినంత యాక్షన్‌, ఎలివేషన్స్‌తో ఫ్యాన్స్‌కు మాత్రం ఓ పండగలా అనిపిస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్‌ మాత్రం తథ్యంగా కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్‌ కొట్టారా? వసూళ్ల లెక్కలేమిటి? ఈ విషయాలపై స్పష్టత రావాలంటే రాబోవు కొద్దిరోజులు వేచిచూడాల్సిందే..

తీర్పు: అఖండ- కాషాయసింహం

రేటింగ్‌: 2.75/5

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Akhanda USA Premieres | అఖండ ఓవ‌ర్సీస్ బిజినెస్‌ సంగ‌తేంటి..?

అఖండ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఫ్యాన్స్‌కు పూన‌కాలు.. సౌండ్ త‌గ్గించేస్తాం బాబోయ్ అంటున్న అమెరికా థియేట‌ర్లు

Akhanda : బాల‌య్య అభిమానుల ర‌చ్చ‌.. ఆస్ట్రేలియాలో షో ర‌ద్దు చేసిన పోలీసులు

ఏపీలో సినిమా టికెట్ రేట్లు ఎంత.. లిస్ట్ విడుదల చేసిన ప్రభుత్వం..

Akhanda benefit show | అఖండ సినిమా హైదరాబాద్ బెనిఫిట్ షో టికెట్ ధర తెలుసా..?

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement