Prakash Raj | అదొక రంగస్థల ప్రయోగశాల.. థియేటర్ ఆర్ట్ ఇంక్యుబేషన్ సెంటర్. గాజు నాళికలో రసాయనాలు ప్రాణం పోసుకున్నట్టు.. అక్కడ నవరసాలు జీవం పోసుకుంటాయి. ఆలోచనలు పదునుదేలుతాయి. నటుడు ప్రకాశ్ రాజ్ కలల పంటగా .. కర్ణాటకలోని మైసూరు శివార్లలో పచ్చని ప్రకృతి మధ్య సిద్ధమైంది ‘నిర్దిగంత’. కొత్తగా, ఇంకా కొత్తగా, మరింత కొత్తగా.. నాటకాలను ప్రదర్శించడంపై ఈ ఆవరణలో కసరత్తు జరుగుతుంది. నటులు, రచయితలు, దర్శకులు, విమర్శకులు.. బుర్రలు బద్దలుకొట్టుకుంటారు. ఐడియాలు సృష్టిస్తారు. అద్భుతాలు చేస్తారు.
నిర్దిగంత అంటే.. అంతులేనిది. ఎల్లలు తెలియనిది. అనంతమైంది. అపారమైంది అని కూడా అర్థం ఉంది. పదంలోని ఆ గాఢతే ప్రకాశ్‌రాజ్‌కు నచ్చింది. ఆయన కూడా అంతులేనిది, ఎల్లలు తెలియనిది, అనంతమైంది, అపారమైందీ అయిన నాటకు కళకు ఓ వేదిక నిర్మించాలని అనుకున్నారు. రణగొణ ధ్వనులకు నిలయమైన బెంగళూరు నగరమో, ఎప్పుడూ కిటకిటలాడే మైసూరు పట్టణమో అయితే.. నలుగురికీ అందుబాటులో ఉండొచ్చు. కానీ, ఆయన ఆశిస్తున్న గాంభీర్యం రాదు. అందుకే ఇంకొంత లోపలికి వెళ్లాలనుకున్నారు. శ్రీరంగపట్నానికి పది కిలోమీటర్ల దూరంలో లోకపావని నదీ తీరాన.. పచ్చని పొదరింటిని తలపించే ఓ చోటు ఆయనకు చాలా నచ్చింది. చుట్టుపక్కల మానవ సంచారమే కనిపించదు. మహా నిశ్శబ్దం. హఠాత్తుగా ఏ పక్షుల కిలకిలరావాలో వినిపిస్తాయంతే. మరో ఆలోచన లేకుండా.. ఆ ఐదెకరాల ఆవరణను నాటక కళా వేదికగా తీర్చిదిద్దారు. అలా అని అదేదో డ్రామా స్కూల్ కాదు. ఇక్కడ ఎవరూ ఎవరికీ పాఠాలు చెప్పరు. ఆ మాటకొస్తే నిర్దిగంతలో అందరూ విద్యార్థులే. నిత్యం కథా చర్చలు జరుగుతుంటాయి. తరచూ నటులు, దర్శకులు, రచయితలు వస్తుంటారు. ‘మనకు డ్రామా స్కూల్స్ చాలానే ఉన్నాయి. అక్కడ ఎంతోమంది విద్యార్థులే నటన నేర్చుకుంటున్నారు. నేర్చుకున్న తర్వాత ఏమిటి? అనేది పెద్ద ప్రశ్న. ఆ జవాబు నిర్దిగంతలో దొరుకుతుంది. ఇది ప్రయోగాల వేదిక. మూసను ప్రేమించేవారు, పడికట్టును ఇష్టపడేవారు ఇంతదూరం రానవసరం లేదు’ అంటారు ప్రకాశ్ రాజ్.
నిర్దిగంత లాంటి వేదికలు మనకు పూర్తిగా కొత్త. కానీ నాటకాల్ని అపారంగా ప్రేమించే యూరప్ దేశాలలో ఎప్పటి నుంచో ఉందీ సంప్రదాయం. పరిశోధన సంస్థలో ల్యాబొరేటరీ ఉన్నట్టు.. నాటక శిక్షణ సంస్థలకూ ఓ ప్రయోగాల వేదిక ఉండాలన్నది ప్రకాశ్‌రాజ్ ఆలోచన. ‘నా ప్రయోగం విజయవంతం కావచ్చూ, కాకపోవచ్చు. అసలు ప్రయత్నమంటూ జరగాలి కదా?’ అంటారాయన. ఓ కొత్త ఐడియాతో, సరికొత్త ఇతి వృత్తంతో నిర్దిగంతను ఎవరైనా సంప్రదించవచ్చు. ఆలోచనలో తాజాదనం ఉంటే.. ఆర్థిక సాయం చేస్తారు. నటులను ఎంచుకోడానికి సహకారం అందిస్తారు. రిహార్సల్స్ చేసుకోడానికి జాగా ఇస్తారు. ఉండటానికి నీడనిస్తారు. సమయానికి కాఫీ-టీ, ఫలహారం, భోజనం అందిస్తారు. ఆ నలభై అయిదు రోజులూ నాటకమే ప్రపంచంగా బతికేయవచ్చు. ఆ తర్వాత మాత్రం.. తమ ఆవిష్కరణను జనంలోకి తీసుకెళ్లాలి. కాకపోతే ఆ ఇతివృత్తం కొత్తదై ఉండాలి. రానున్న రెండేండ్లలో కనీసం ఇరవై కొత్త నాటకాలనైనా అభిమానుల ముందుకు తీసుకెళ్లాలన్నది ప్రకాశ్‌రాజ్ ఆలోచన.
‘ఎగరడం నేర్పడం వరకే నా పని? ఎంతెత్తు ఎగురుతారన్నది వాళ్ల ఇష్టం’ అంటారు. నాటకరంగంలో సమకాలీనత లోపించడం మేధావులను బాధపెడుతున్న విషయం. మనది కానిది ఏదైనా.. మనకు అవసరం లేదు. ఒకప్పుడు.. నాటకాలను చూసి దొరలపై తిరుగుబాటు చేసిన గ్రామాలు ఉన్నాయి, నాటకాలను చూసి దారిమార్చుకున్న వ్యక్తులు ఉన్నారు. అంతెందుకు, మహాత్ముడిని సత్యం వైపుగా నడిపించింది కూడా ఓ నాటకమే. ప్రకాశ్‌రాజ్ కోరుకుంటున్నది కూడా పెను నిద్దుర వదిలించగల శక్తిమంతమైన నాటకాలనే.
స్టార్టప్స్ కోసం ఇన్క్యుబేషన్ సెంటర్లు ఉంటాయి. ఓ ఐడియాను ఎంచుకుని, దానికి రూపమిచ్చి, సంస్థగా స్థాపించి.. ఉత్పత్తిని ప్రారంభించి లాభాలబాట పట్టించడం వాటి బాధ్యత. రంగస్థలంలో అటువంటి వ్యవస్థ ఎక్కడాలేదు. ఆలోటు తీర్చడమే నిర్దిగంత పని. ఇదొక థియేటర్ ఆర్ట్ ఇంక్యుబేషన్ సెంటర్. జూన్ రెండోవారంలో ఈ నట ప్రయోగశాల తలుపులు తెరుచుకున్నాయి. కొత్తకు జాతర చేద్దామని సంకల్పించేవారికి అక్కడ ‘వెల్కమ్’బోర్డు సిద్ధం. జీవితమే ఒక నాటక రంగం. నాటకమే జీవిత రంగం కూడా!
నాటకం నాకు జీవితాన్ని ఇచ్చింది. అన్నం పెట్టింది. వెండితెరకు పరిచయం చేసింది. ఆ కళామతల్లి రుణం తీర్చుకోడానికి ఇదొక మంచి అవకాశంగా భావిస్తున్నా. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అంతిమ లక్ష్యం నాటకాన్ని బతికించుకోవడమే. సామాన్యుడికి చేరువైనప్పుడే, మధ్యతరగతి ప్రజలను స్పందింపజేసినప్పుడే ఇదంతా సాధ్యం. ఆ శక్తి సమకాలీనత వల్ల వస్తుంది.
-ప్రకాశ్‌రాజ్