Nara Lokesh On Kova Bun | మేడారం జాతరలో చోటుచేసుకున్న కోవా బన్ వివాదంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పందించాడు. కర్నూలుకు చెందిన చిరువ్యాపారి వలీకి అండగా నిలుస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ నోట్ పెట్టాడు.
అసలేం జరిగిందంటే?
మేడారం జాతరలో కర్నూలు జిల్లా వెలుగుగోడు గ్రామానికి చెందిన షేక్ షావలీ అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి కేవలం 10 రూపాయలకే కోవా బన్ విక్రయిస్తున్నారు. అయితే, వ్యూస్ మరియు లైక్స్ కోసం కొంతమంది యూట్యూబర్లు (తేజస్వి న్యూస్ ఛానల్) అతనిని చుట్టుముట్టి. ఆ ఆహారంలో ఏదో కలిపారంటూ, అది ‘ఫుడ్ జిహాద్’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా.. ఆ ఆహారం సురక్షితమేనని నిరూపించడానికి వలీని అందరి ముందే దానిని తినాలని బలవంతం చేసి వేధించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ యూట్యూబర్ల తీరును తప్పుబట్టారు. తాజాగా ఇదే ఘటనపై నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వలీకి అండగా నిలిచాడు.
“డియర్ బ్రదర్ వలీ, నీవు ఎదుర్కొన్న ఈ పరిస్థితికి నేను చాలా బాధపడుతున్నాను. ఇలాంటి విభజన రాజకీయాలకు, మతపరమైన వేధింపులకు మన తెలుగు సమాజంలో చోటు లేదు. మనది ఎప్పుడూ సామరస్యం, పరస్పర గౌరవం మరియు సోదరభావంతో విరాజిల్లే సమాజం. త్వరలోనే నేను నిన్ను కలుస్తాను. నీ ఫేమస్ కోవా బన్ రుచి చూడాలని ఎదురుచూస్తున్నాను. మనం అందరం కలిసి నిలబడదాం అంటూ నారా లోకేష్ రాసుకోచ్చాడు. కేవలం లోకేష్ మాత్రమే కాకుండా టీడీపీ నేతలు పరిటాల శ్రీరామ్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, తదితరులు ఈ ఘటనపై స్పందించడమే కాకుండా వలీకి అండగా నిలిచారు.
Dear Brother Vali, I am deeply sorry that you had to endure this. Such divisive and communal behavior has no place in our Telugu society, which has always stood for harmony, mutual respect, and brotherhood. I will meet you soon and look forward to tasting your famous Khoya bun!… https://t.co/AvckML9odY
— Lokesh Nara (@naralokesh) February 15, 2026