Tata Group | దేశంలోనే దిగ్గజ సంస్థల్లో టాటా గ్రూప్ (Tata Group) ముందు వరుసలో ఉంటుంది. దేశంలోనే అత్యంత విలువైన, విశ్వసనీయ సంస్థగా టాటా గ్రూప్‌కు మంచి పేరుంది. దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా సంస్థను దశాబ్దాల పాటు ముందుండి నడిపించారు. గ్రూప్ చైర్మన్‌గా, టాటా ట్రస్ట్స్ అధిపతిగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. అయితే, ఆయన మరణంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గ్రూప్ సంస్థల్లో ఉన్న సమన్వయం, వ్యక్తిగత ప్రభావం రతన్ టాటాతోనే కనుమరుగైనట్లు తెలుస్తోంది. సంస్థలో ప్రస్తుతం ఆధిపత్య పోరు కొనసాగుతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ దిగ్గజ సంస్థ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉందని, కేంద్రం జోక్యం చేసుకునే పరిస్థితికి చేరిందని వార్తలొస్తున్నాయి.
టాటా ట్రస్ట్స్, గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ (Tata Sons) మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతున్నట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. రతన్ టాటా మరణానంతరం టాటా ట్రస్ట్స్ కొత్త చైర్మన్‌గా నోయెల్ టాటా (Noel Tata) బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రతన్ టాటా ఉన్నంత వరకు.. ఆయన తీసుకునే ఏ నిర్ణయాన్ని ట్రస్టీలు, నామినీ డైరెక్టర్లు ఏనాడూ ప్రశ్నించలేదు, అడ్డు చెప్పలేదు. కానీ, ప్రస్తుత చైర్మన్ నోయెల్ టాటాకు మాత్రం ఆ స్వేచ్ఛ లేదు. ఆయన తీసుకునే నిర్ణయాలకు ట్రస్టీలు అడ్డుచెప్తున్నట్లు తెలుస్తోంది. ట్రస్టీల్లో కీలకంగా ఉన్న మెహిల్ మిస్త్రీ.. నోయెల్ తీసుకొనే కొన్ని కీలక నిర్ణయాల్ని బహిరంగంగానే విమర్శిస్తూ వస్తున్నారు. ఈయనకు టాటా సన్స్‌లో వాటా ఉన్న షాపూర్జీ పల్లోంజీ కుటుంబంతో అనుబంధం ఉంది.
టాటా సన్స్ బోర్డులో కొత్త డైరెక్టర్ల నియామకాల అంశంలో ట్రస్టీల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తుతున్నాయని సమాచారం. నామినీ డైరెక్టర్‌గా విజయ్ సింగ్‌ను తిరిగి నియమించాలనుకున్న ప్రతిపాదనను నలుగురు ట్రస్టీలు వ్యతిరేకించారు. టాటా సన్స్ బోర్డు సమావేశాల గురించి తమకు సరైన సమాచారం లభించట్లేదని వారు ఆరోపించారు. ఇక్కడ కొత్త నామినీ డైరెక్టర్లుగా ఎవరిని తీసుకోవాలనే విషయంలోనూ సంఘర్ణణలు తలెత్తుతున్నాయి. రతన్ టాటా లాగా సంస్థలో నోయెల్ అధికారం చెలాయించలేక పోతున్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం.
టాటాల బోర్డులో తలెత్తిన విబేధాలను సద్దుమణిగేలా చేసేందుకు కేంద్రం జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. టాటా ట్రస్ట్‌లలో స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని కోరినట్లు సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. టాటా ట్రస్ట్ చైర్మన్ నోయెల్ టాటా, వైస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, ట్రస్టీ డారియస్ ఖంబటాలతో సమావేశమైనట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. అంతర్గత చీలికలు టాటా సన్స్ కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది. సంస్థలో స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని సూచించినట్లు సమాచారం. ఈ విభేదాల వేళ ఈనెల 10న టాటా ట్రస్ట్స్ బోర్డు సమావేశం కానుంది. గ్రూప్‌లోని వివాదాస్పద అంశాలు ఇందులో కొలిక్కి రావొచ్చని భావిస్తున్నారు.
Also Read..
Sergio Gor: భారత్‌కు అమెరికా అంబాసిడర్‌గా సెర్గియో గోర్
Karnataka: పిక్నిక్లో విషాదం.. డ్యామ్ గేటు తెరవడంతో ఆరుగురు మృతి