Tesla | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం (electric cars) టెస్లా (Tesla) అధికారికంగా భారత విపణిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జులై 15న ఆర్థిక రాజధాని ముంబైలో తొలి షోరూంను ప్రారంభించింది. ఆ తర్వాత ఢిల్లీలో రెండో షోరూంను కూడా లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాలతో భారత విపణిలోకి అడుగుపెట్టిన టెస్లాకు నిరాశ తప్పలేదు. ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదని తెలిసింది.
సెప్టెంబర్‌లో డెలివరీలు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 157 కార్లను మాత్రమే టెస్లా విక్రయించినట్లు ప్రభుత్వ వాహన్ పోర్టల్ గణాంకాలు చెబుతున్నాయి. ఇక నవంబర్ నెలలో టెస్లా కేవలం 48 కార్లను మాత్రమే డెలివరీ చేసింది. ఈవీ అమ్మకాల్లో బీఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ – బెంజ్ వంటి లగ్జరీ సంస్థల కంటే టెస్లా వెనుకబడింది. బీఎమ్‌డబ్ల్యూ ఇండియా నవంబర్‌లో ఏకంగా 267 ఈవీ కార్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో అత్యధిక అమ్మకాలతో రికార్డు నెలకొల్పిన ‘వై’ మోడల్ కార్లను (Tesla Y Model) భారత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది టెస్లా. RWD (రియర్-వీల్ డ్రైవ్), లాంగ్-రేంజ్ RWD వేరియంట్ కార్లను అమ్మకానికి ఉంచింది. ఇక ధర విషయానికొస్తే రియర్-వీల్ డ్రైవ్ (ఆర్డబ్ల్యూడీ) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు, లాంగ్-రేంజ్ ఆర్డబ్ల్యూడీ వేరియంట్ ధరను రూ. 67.89 లక్షలుగా నిర్ణయించింది.
వీటి ‘ఆన్ రోడ్’ ధరల్ని పరిశీలిస్తే RWD వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 61.07 లక్షలుకాగా, లాంగ్-రేంజ్ వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 69.15 లక్షలుగా ఉంది. టెస్లా అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఇందులో 18 శాతం జీఎస్టీతో సహా రూ. 50,000 అడ్మినిస్ట్రేషన్, సర్వీస్ ఫీజు కూడా ఉంటుంది. అయితే, భారత్‌లో సగటు ఎలక్ట్రిక్ కారు ధర రూ.22 లక్షలు ఉంది. టెస్లా మోడల్ వై ధర దాదాపు రూ.60 లక్షల వరకు ఉంది. టెస్లాకు బ్రాండ్ పేరు ఉన్నప్పటికీ ఎక్కువ ధర కారణంగా భారత EVమార్కెట్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతోందన్నది టాక్.
Also Read..
IIP Growth | దేశీయ పరిశ్రమ విలవిల.. వృద్ధికి దూరమైన ఉత్పత్తి..
వాహన విక్రయాలు అదుర్స్.. కలిసొచ్చిన జీఎస్టీ తగ్గింపు..
రికార్డుల నుంచి సూచీలు వెనక్కి